Home News Updates

జగన్ సన్నిహిత మంత్రితో ఆ ఎంపీ వార్ మరింత ముదిరిందా..?

రాజకీయాల్లో శాస్వత మిత్రులు శాస్వత శత్రువులు ఎవరు ఉండరు. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్లు సడెన్‌గా దోస్తీ చేయొచ్చు. సన్నిహితంగా ఉన్నవారు విడిపోను వచ్చు. తాజాగా ప్రకాశంజిల్లాలో జగన్ కి సన్నిహితంగా ఉండే మంత్రి,ఒంగోలు ఎంపీకి మధ్య మొదలైన వార్ జిల్లాలో అధికారులను టెన్షన్ పెడుతుంది. 2019లో కలిసి ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ప్రకాశం జిల్లా వైసీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య గరంగరం పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మధ్య అస్సలు పొసగడం లేదు. ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య నేత. సీఎం జగన్‌కి దగ్గరి బంధువు కూడా. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ సభ్యుడిగా రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచారు. మాగుంట వైసీపీలోకి రావడం వెనక బాలినేని ఉన్నారని చెబుతారు. కానీ ప్రస్తుతం ఒకరినొకరు ఎదురుపడకుండా తిరుగుతున్నారట.

ఒంగోలు రిమ్స్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీ మాగుంట భావించారట. దీని పై రిమ్స్ అధికారులతో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే మాగుంటని పక్కకు పెట్టిన రిమ్స్ అధికారులు మంత్రి బాలినేని వద్ద ఫండ్స్ తీసుకుని ఆయన పేరు మీద కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. విస్తుపోవడం ఎంపీ వంతైంది. అప్పటి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ని కలిసిన మాగుంట రిమ్స్‌ అధికారులపై ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి మంత్రికి, ఎంపీకి మధ్య గ్యాప్‌ వచ్చిందని తెలుస్తుంది.

ఆనందయ్య మందు పంపిణీ విషయంలోనూ ఇద్దరూ పోటీపడ్డారు. ఒంగోలు కేంద్రంగా మంత్రి, ఎంపీలు వేర్వేరు ప్రాంతాల్లో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఎంపీ మాగుంట ఒంగోలు పీవీఆర్‌ హైస్కూల్‌నూ.. మంత్రి బాలినేని తన నివాసాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఒకరిపై ఇంకొకరు పైచెయ్యి సాధించాలి.. జనాల్లో పేరు తెచ్చుకోవాలి. ఇదే అజెండాతో రాజకీయాలకు తెరతీస్తున్నారు నాయకులు. రెండేళ్ల వ్యవధిలోనే మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట ఈ విధంగా కోల్డ్‌వార్‌కు దిగి..కత్తులు నూరుకోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్య పరుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here