Home News

సీఎం జగన్ సన్నిహిత మంత్రిని వదలని వివాదాలు

వైఎస్ కుటుంభానికి దగ్గరి బంధువు జగన్ కి అండగా నిలిచిన నేతల్లో ఒకరైన బాలినేనికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వైఎస్ మరణం తర్వాత మంత్రి పదవిని వదులుకుని మరి జగన్‌ వెంట నిలిచిన అతికొద్ది మంత్రుల్లో బాలినేని ఒకరు. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆయనకి సంబంధం లేని విషయాల్లో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందట. జిల్లాలో సౌమ్యుడిగా పేరున్న ఆయనకి క్యాడర్ చేసే పనులు తలనొప్పిగా మారుతున్నాయన్న చర్చ నడుస్తుంది.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ లీడర్. అధికార పార్టీ వైసీపీలో ఆయన చెప్పిందే వేదం..చేసిందే చట్టం. జిల్లాలో సీనియర్ లీడర్ గా ఉన్న బాలినేనికి సౌమ్యుడిగా పేరుంది. అయితే మంత్రిగా పని చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి కొంత మంది చోటా నాయకులు చేస్తున్న పనులు ఇబ్బందిగా మారాయట. ఏదో ఒక వివాదంలో చోటా నాయకులు వేలు పెడుతుంటే….ఆ వివాదం బాలినేనికి చుట్టుకుంటోందట. దీంతో మంత్రిగా పని చేస్తున్న బాలినేనిపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు తిరిగి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి బాలినేనికి వస్తుందట. గత ఏడాది చెన్నై బోర్డర్ లో ఒంగోలుకి చెందిన వైసీపీ నాయకుడు నల్లమల్లి బాలు ఆరు కోట్లు తరలిస్తూ చిక్కాడు. దీంతో ఆరు కోట్ల నగదు మంత్రి బాలినేనిదే అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఆరు కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాలినేని చెప్పినా ప్రతిపక్షం పట్టించుకోలేదు.

తాజాగా ఒంగోలులో ఖరీదైన భూములు మంత్రి బాలినేని కబ్జా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒంగోలు శివారులో ఉన్న మంగమూరు రోడ్డులో 50 కోట్లు విలువైన ఆరు ఎకరాల ముప్పై సెంట్లు భూమిలో వైసీపీ నేత రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేశాడు. మరో వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఒంగోలు సమతానగర్ లో ఉన్న ఆరు కోట్ల విలువైన ఎకరా భూమిలో ఫెన్సింగ్ వేశాడు. అయితే తమ భూములను వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారంటూ వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లతో కొంత మంది మీడియాని ఆశ్రయించారు. దీనికి తోడు వైసీపీ నాయకులు రాత్రికి రాత్రే ఖరీదైన భూముల్లో ఫెన్సింగ్ లు వేయడం వెనుక మంత్రి బాలినేని ఉన్నాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలకు దిగాయి. దీంతో సీరియస్ అయిన బాలినేని పార్టీని, తన పేరుని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ బాస్ ని ఆదేశించారట.

ఏదో ఒక వివాదంలో దూరి తన పేరుని చెడగొట్టే వారిని వదిలి పెట్టనంటూ మంత్రి బాలినేని హెచ్చరిస్తున్నారట. అయితే బాలినేని హెచ్చరికలతో అయినా ఒంగోలులో పక్కదారి పడుతున్న కొంత మంది వైసీపీ నాయకుల్లో మార్పు వస్తుందో….లేక మరో వివాదంలోకి బాలినేని లాగుతారో అని అధికార పార్టీ క్యాడర్ లో చర్చ జరుగుతోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here