సిన్మావాళ్లు వాడుకుని వదిలేస్తారనీ, అందచందాలు తరిగిపోయాక ఎక్స్ట్రా పాత్రలు కూడా ఇవ్వరనే అపనిందలు ఉన్నాయి. ఇక ఎవరిని ఎలా ఎప్పటిదాకా వాడుకోవాలో రాజకీయ నాయకులకు ఒకరు చెప్పాల్సిన పన్లేదు. పాలిటిక్స్‌లో వాడుకున్నోళ్లకి వాడుకున్నంత. మరి మీడియా సంగతేంటి? వాడటం మొదలుపెడితే..వాడి వదిలేసే విషయానికొస్తే ఎంత పోటుగాడయినా మీడియా తర్వాతే.
ఆ రోజుకు బ్రేకింగ్ న్యూస్‌కి పనికొస్తారానో, నాలుగు బులెటిన్లు సందడిగా నడిచిపోతాయనో అనుకుంటే దారినపోయే దానయ్యనయినా గంటల తరబడి స్టూడియోల్లో కూర్చోబెట్టి ఊదరగొట్టేయగలదు ఘనత వహించిన మన మీడియా. తనకు నచ్చలేదో…ఎంత గుండెలు తీసిన బంటునయినా పూచికపుల్లలా తీసి పారేయడంలో మన మీడియాకి పోటీ వచ్చేవారు ఈ భూప్రపంచంలోనే లేరని చెప్పొచ్చు.
ప్రతీక్షణం రెప్పవాల్చకుండా, ఇల్లూవాకిలీ అన్నీ వదిలేసి మాకేసి చూస్తూనే ఉండండని ఊదరగొట్టే మీడియాకి ఏ పూట ఏ ఇష్యూ దొరికితే దాంతోనే పండగ. కోతికి కొబ్బరికాయ దొరికినట్లే. అప్పటిదాకా ఎవరో కొందరికే తెలిసిన కత్తిమహేష్తో పవర్స్టార్మీద పంచ్లేయించి దిగ్రేట్ తెలుగు మీడియా. మళ్లీ ఇప్పుడాయన స్క్రీన్‌మీద కనిపించడంలేదు. ఆ తర్వాత క్యాస్ట్ కౌచింగ్ పేరుతో రోడ్డునపడ్డ శ్రీరెడ్డిని లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్‌గా వాడేసుకుంది మీడియా. శ్రీరెడ్డితో కొందరిని తిట్టించి..ఎదురుగా ఇంకొందరిని కూర్చోబెట్టి శ్రీరెడ్డి నాలుగు మాటలు అనిపించి ఇండస్ట్రీని గబ్బు పట్టించింది మీడియా.
రోజుల తరబడి గంటలు గంటలు స్టూడియో డిస్కషన్స్‌లో కనిపించిన శ్రీరెడ్డి ఊసేలేదిప్పుడు. ఎప్పుడైతే సిన్మా ఇండస్ట్రీ కొన్ని ఛానల్స్‌ని బ్యాన్ చేస్తే మంచిదని చర్చించిందో..ఇక మీడియాలో శ్రీరెడ్డి సౌండ్ లేదు. శ్రీరెడ్డితో ఏమొస్తుంది. మహా అయితే ఆవిడ వీడియోలు, ఫొటోలతో కాసేపు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇండస్ట్రీతో పెట్టుకుంటే కొత్త సిన్మాల యాడ్స్, ప్రమోషన్స్, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్మీట్లూ..అమ్మో చాలా మిస్ అవుతామని వాడుకుని వదిలేసే మీడియాకి తెలీదా. అందుకే శ్రీరెడ్డి పేరే ఎప్పుడూ విన్లేదన్నట్లు పక్కన పెట్టేశారు. మొన్నీమధ్య లాయర్‌తో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి కొందరికి వార్నింగ్ ఇచ్చినా శ్రీరెడ్డిని మీడియా పెద్దగా పట్టించుకోలేదు. అంటే అనఫీషియల్‌గా శ్రీరెడ్డిని మీడియానే బ్యాన్ చేసినట్లేగా?