Home News Stories

ఈనాడు,జ్యోతి ప్రచారంతో సాక్షి వెనకబడిందే…!

ఉన్నదున్నట్లు ప్రజలకు చెప్పాల్సిన మీడియా జెండాలు, అజెండాలు చేపట్టడం ఏపీలో ఇప్పుడు కొత్త ట్రెండ్. ప్రభుత్వంలోకి వస్తే తమకు అనుకూలంగా ఉంటాయని భావించిన పార్టీలను ప్రధాన మీడియా సంస్థలు భుజాలకెత్తుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీని పగవాడిగా చూస్తున్నాయి. గతంలోనూ ఈ సంస్కృతి ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. తాము గుత్తేదారుగా వ్యవహరించే పార్టీని గెలిపించేందుకు అవసరమైన ప్రజాసమ్మతి కల్పనకు అహర్నిశలు మీడియా కష్టపడుతోంది. జరుగుతున్న సంఘటనలను సైతం పక్కదారిపట్టిస్తూ ప్రత్యర్థి పార్టీపై బురదజల్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఏపీ లో పత్రికలు, చానళ్లు అంటేనే ఏహ్యభావం కలిగేలా ఈ పైత్యం పతాకస్థాయికి చేరిపోయింది.

వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాలం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న ఆ రెండు పత్రికలు ఈ విడత మరోసారి విజృభిస్తున్నాయనే చెప్పాలి. అప్పట్లో ఈనాడు పత్రిక వై.ఎస్ మీద కక్ష పూరిత ధోరణితో వ్యవహరించడానికి సహేతుకమైన కారణం ఉంది. మార్గదర్శి ఫైనాన్షియల్ వ్యవహారాలను చర్చనీయం చేస్తూ కేసులు నమోదు చేయించి సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీయించేందుకు వై.ఎస్. ప్రయత్నించారు. ఈనాడు తొలి నుంచీ కాంగ్రెసు పార్టీ వ్యతిరేకి. అయినప్పటికీ ఆ పార్టీకి చెందిన ఏ ముఖ్యమంత్రి అంతగా ఆ పత్రికపై కక్షగట్టలేదు. వై.ఎస్. ను కూడా అదే విధంగా భావించడం ఈనాడు అసెస్మెంట్ లోపం. దాంతో పోటీ పత్రికను పెట్టడమే కాకుండా ముందుగానే ఈనాడు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు వై.ఎస్. యత్నించారు. పాక్షికంగా సక్సెస్ అయ్యారు.

దీని ఫలితంగానే సాక్షి పత్రిక కొంతమేరకు పాఠకాదరణ పొందగలిగింది. వై.ఎస్. చనిపోయిన తర్వాత జగన్ కొంతకాలం పాటు ఈనాడుతో పోరాడినా తర్వాత రాజీ పడిపోయారు. రామోజీని కలిసి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. కానీ అది ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రజ్యోతితోపాటు ఈనాడు కూడా వైసీపీని పరాజయం పాలు చేయాలనే కథనాలకు తాజాగా పెద్దపీట వేస్తోంది. దారులు వేరైనా ఆ రెండు పత్రికల లక్ష్యం ఒకటే. తిరిగి తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తేవడం. అయితే పంథామాత్రం వేరు. ఆంధ్రజ్యోతి కక్ష గట్టినట్లు వైసీపీపై కథనాలు వండివారుస్తోంది. అజెండాను సెట్ చేసి వివిధ రంగాల్లో ప్రముఖులు టీడీపీనే కోరుతున్నారన్న భావన రేకెత్తించేలా ఇంటర్వ్యూలను ప్రసార,ప్రచురణ చేస్తోంది. తద్వారా ప్రజాభిప్రాయాన్ని అధికారపార్టీకి అనుకూలంగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ అజెండాలో భాగంగా కొన్నిసార్లు వక్రీకరణలు, అతిశయోక్తులు, అభూతకల్పనలు సహజాతిసహజంగా మారాయి.

ఈనాడు థృక్పథం అంతగా కుచించుకుపోకపోయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి దిశలో చాలా ముందంజ వేసిందనే కథనాలను వరసగా ప్రచురణ,ప్రసారం చేస్తోంది. ఇదే ప్రభుత్వం తిరిగి ఎన్నికైతే ఈ ప్రగతి రథం ముందుకు సాగుతుందనే భావాన్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేసేందుకు ఈనాడు యత్నిస్తోంది. మొత్తమ్మీద ప్రభుత్వానికి సానుకూల ఫలితాలు తెచ్చిపెట్టేలా ఈ రెండు సంస్థలు చేస్తున్న కృషి అసలు నిజాలను పక్కనపెట్టి ముసుగువేసే ధోరణికి అద్దం పడుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మిగిలిన పార్టీలకు లేని అదనపు సౌలభ్యం ఉంది. తెలుగుదేశానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మద్దతుదారులు, సానుభూతిపరులు మాత్రమే. కానీ జగన్ కు సొంతంగా ఒక పెద్దమీడియా ఉంది. అదే ప్రస్తుతం దురదృష్టకరంగా మారింది. పార్టీ అధినేతను తప్పుదారి పట్టించేలా గతంలో సర్వేలు అందచేసి పార్టీ పరాజయానికి కారణమైన సంస్థల్లో సొంత మీడియా కూడా ప్రముఖమైనది. అంతా వైసీపీ గాలి వీస్తోందంటూ కథనాలు ఇవ్వడం తప్ప క్యాడర్ కు, లీడర్ కు దిశానిర్దేశం చేసే విధంగా సాక్షి మీడియా వ్యవహరించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను విమర్శించే విషయాల్లో పత్రిక పరిధులు దాటిపోతుంది.

దీంతో కనీస నైతిక ప్రమాణాలు పాటించని చౌకబారు మీడియాగా సామాన్య ప్రజల్లో ముద్ర పడిపోయింది. ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ సాక్షి బలహీనతనే ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ పత్రికతో పోలిస్తే తామే మెరుగైన సమాచారం, వ్యాఖ్యానం ఇస్తున్నామనే సహేతుక ముద్ర వేసుకుంటున్నాయి. దీంతో మీడియాపై జగన్ చేసే పోరాటం బలహీన ప్రతిఘటనగా మిగిలిపోతోంది. తటస్థ ముద్రతో ప్రజలను ప్రభావితం చేయాలనుకుంటున్న మీడియాపై ఎన్నికల సంఘం వంటి సంస్థలు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అటు ఈనాడు, ఆంధ్రజ్యోతులను శల్యపరీక్ష చేయడంతోపాటు హద్దులు మీరుతున్న సాక్షినీ కట్టడి చేసేందుకు పూనుకోవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here