Home News Stories

శ‌వాల‌మీద మీడియా రేటింగ్‌

ఛాన‌ల్స్‌కి సామాజిక బాధ్య‌త లేదా?

 

మిర్యాల‌గూడ‌లో ప్ర‌ణ‌య్ మ‌ర్డ‌ర్‌. రెండ్రోజులుగా తెలుగు మీడియాలో ఏ ఛాన‌ల్ త‌ప్పినా ఆ ప్రేమికుడి విషాద‌మే. త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని పెళ్లాడి, భార్య పుట్టింటివారు త‌న‌పై ప‌గ‌బ‌ట్టార‌ని తెలిసీ…రొమ్ము విరుచుకుని అదే ఊళ్లో ఉన్నాడా ద‌ళిత యువ‌కుడు. భ‌య‌ప‌డి ఎక్క‌డికీ పారిపోలేదు. త‌న జాగ్ర‌త్త‌ల్లో తానున్నా..న‌యీం గ్యాంగ్‌తో అంట‌కాగిన కిరాయి హంత‌కులు అద‌నుచూసి చంపేశారు. భ‌విష్య‌త్తుపై ఎన్నో క‌ల‌లు కంటూ క‌డుపులో బిడ్డ‌తో ఉన్న‌ ప్ర‌ణ‌య్‌భార్య అమృత‌వ‌ర్ణిణి ఉసురుపోసుకున్నారు. స్వాతంత్య్రం వ‌చ్చి డెబ్భైఏళ్లు గ‌డ‌చిపోయినా…ఆధునిక స‌మాజంలో ఇంకా కులం మ‌తం అడ్డుగోడ‌గా నిలుస్తున్నందుకు, ప‌రువు హ‌త్య‌లు జ‌రుగుతున్నందుకు అంతా సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిందే.

ప్ర‌ణ‌య్ హ‌త్య క‌వ‌రేజిలో తెలుగుమీడియా పోటీప‌డింది. సామాజిక రుగ్మ‌త‌గా మారిపోతున్న ప‌రువు హ‌త్య‌ను ప‌దిమందిలో చ‌ర్చ‌కు పెట్టేందుకు మీడియా ఛాన‌ళ్లు ముందుకొచ్చినందుకు మెచ్చుకోవాల్సిందే. అయితే ఓ దారుణాన్ని నిక్క‌చ్చిగా జ‌నం ముందు పెట్టాల‌నే ప‌ట్టుద‌ల‌కంటే…ఓ యువ జంట ప్రేమ‌-పెళ్లి-ప‌రువు హ‌త్య ఎపిసోడ్‌ని త‌మ రేటింగ్‌కోసం ఎలా వాడుకోవాల‌న్న తాప‌త్ర‌య‌మే అన్ని ఛాన‌ళ్ల‌లో ఎక్కువ‌గా క‌నిపించింది. ఎప్పుడో స్కూల్‌డేస్ నుంచే ప్ర‌ణ‌య్‌-అమృత్ స్నేహితులు. అప్ప‌ట్లోనే చిగురించిన ప్రేమ కాలేజీకి వ‌చ్చేస‌రికి మ‌రింత బ‌ల‌ప‌డింది. చివ‌రిక‌ది పెద్ద‌వాళ్ల‌ని ఎదిరించి పెళ్లిచేసుకునే తెగువ‌నిచ్చింది.

ప్ర‌ణ‌య్‌-అమృత డ‌బ్‌స్మాష్‌లు, పెళ్లినాటి వీడియోలు, ముచ్చ‌ట‌ప‌డి తీయించుకున్న ఫొటో షూట్‌లు ఇన్నుంటే ఇక మీడియాకి అంత‌కంటే కావాల్సిందేముంది? ఆస్ప‌త్రి బ‌యట హ‌త్య బ్రేకింగ్ త‌ర్వాత‌…ప్ర‌ణ‌య్ అంత్య‌క్రియ‌ల‌దాకా ఎక్క‌డ తాము వెన‌క‌బ‌డ‌తామోన‌ని తెలుగు టాప్ త్రీ ఫోర్ ఛాన‌ల్స్ పోటీప‌డ్డాయి. ఆస్ప‌త్రి బెడ్‌మీదున్నా.. అంతిమ‌యాత్ర‌లో శ‌వ‌పేటిక‌లో త‌న భ‌ర్తని చూసుకుని క‌న్నీరుమున్నీర‌వుతున్నా అమృత‌ని వ‌ద‌ల్లేదు. ఇలాంటి సంఘ‌ట‌న మ‌రోటి జ‌ర‌గ్గూడ‌ద‌ని, అమృత‌కొచ్చిన క‌ష్టం మ‌రే అమ్మాయికీ రాకూడ‌ద‌ని టార్గెట్‌గా పెట్టుకుని మీడియా ఇదంతా చేస్తే సంతోషం. కానీ ఈ రెండ్రోజుల‌కోసం మీడియాకిదో రేటింగ్ మెటీరియ‌ల్ అంతే. మ‌రో ఇన్సిడెంట్ జ‌రిగితే ఎపిసోడ్ క‌నుమ‌రుగైపోతుంది.

సినిమా పాట‌లేసి, విషాద సంగీతాల్ని జోడించి ప్ర‌ణ‌య్ హ‌త్య‌ని, అమృత‌తో అత‌ని అనుబంధాన్ని బుల్లితెర‌పై బ్ర‌హ్మాండంగా చూపిన మీడియా ఈ స‌మాజంలో కుల‌వివ‌క్ష‌ను దూరం చేసేందుకు ఏం చేస్తోంది? ఈ స‌మాజంలో ఎవ‌ర్‌నెస్ పెంచ‌డంలో మీడియా పాత్రేంటి? వేలంవెర్రిగా ఒక ఛాన‌ల్‌ని చూసి మ‌రోటి పోటాపోటీగా బ్రేకింగ్‌లేసి లైవ్‌లు న‌డిపించ‌డ‌మే త‌ప్ప ఇలాంటి దారుణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసేందుకు.. చూస్తూనే ఉండండి అనే ఛాన‌ళ్లు…ప్ర‌తీక్ష‌ణం ప్ర‌జాహిత‌మ‌ని చెప్పుకునే ఛాన‌ళ్లు చేస్తున్న‌దేమిటి? రోహిత్ వేముల చావు త‌ర్వాత యూనివ‌ర్సిటీల్లో వివ‌క్ష ఆగిందా? ప‌్ర‌ణ‌య్ హ‌త్య త‌ర్వాత ప‌రువు పేరుతో దారుణాలు ఆగుతాయ‌నే న‌మ్మ‌కం ఉందా? న‌యీం ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత కూడా ఆముఠా ఆగ‌డాలు ఎలా కొన‌సాగుతున్నాయి? శ‌వాల‌మీద పేలాలు ఏరుకోవ‌డ‌మే కాదు… గ్లిజ‌రిన్‌తో ప‌న్లేకుండా నాలుగు క‌న్నీటి బొట్లు రాల్చే నిజాయితీ మ‌న మీడియాలో ఉందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here