Home Women Health

జామకాయతో ఎన్నో లాభాలు: రోజూ తినండి

మనం మన ఆరోగ్యం కోసం మనం ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా తింటుంటాం. ఇక ముందు అలా చేయవలసిన పనిలేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు చెబుతున్నారు.

జామ ఆకులో ఆశ్చర్యం కలిగించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. విరివిగా, చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు. విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం దొరుకుతూ ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇండ్లలో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకుంది. జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి.

ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్ళలో ‘సి’ విటమిన్ పుష్కలంగా వుంటుంది. అపరిమిత పోషకాల నిలయం జామ. అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా, దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు.

ఏదేమైనా పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడేది జామకాయనే.విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు. కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి’ విటమిన్ శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది.

గర్భిణీలకు మేలు చేసే జామ
గర్భిణీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ.. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల ప్రస్తుతం అందరికీ ఇది ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. మధుమేహ రోగులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతుంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామకున్న ప్రాధాన్యత ఏంటో. అందుకే మీరు మార్కెట్ కి వెళ్ళిన వెంటనే జామకాయలు కనిపిస్తే వెంటనే కొని తెచ్చెయ్యండి. హాయిగా కూర్చుని రెండుమూడు జామకాయలు లాగించేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here