Home News Politics

మంథనిలో పుట్టా పట్టు నిలుపుకుంటాడా…దుద్దిళ్ళకి జై కొడతారా…?

వేదాలకు, మేధావులకు నిలయం. శతాబ్దాల చారిత్రక ప్రాధాన్యం. గల్లీ, ఢిల్లీ రాజకీయాలకు, నాయకులకు పుట్టిల్లు. తెలంగాణకు ముఖ్యమంత్రిని, దేశానికి ప్రధానమంత్రిని అందించిన గడ్డ. అడవిలో అన్నలకు అడ్డా. సహజ సంపదలకు కేంద్రం. నక్సలైట్లను కుదిపేసిన కొయ్యూర్ ఎన్ కౌంటర్ కు చిరునామా. రెండు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న ప్రాంతం. పరమశివుడు ముక్తేశ్వరుడిగా దర్శనమిచ్చే పుణ్య క్షేత్రం. ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న కేంద్రం. అనేక ప్రత్యేకతల సమాహారం పెద్దపల్లిలోని మంథని నియోజకవర్గం. ఇక్కడ రాజకీయం ఎలా ఉంది. తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…

మంథని నియోజక వర్గం అనగానే టక్కున గుర్తొచ్చేది… పీపుల్స్ వార్ పోరాటాలే కాకుండా, దివంగత మాజీ ప్రధాని పివి నర్సింహారావు. ఆయన మొట్ట మొదటి సారి ఇక్కడి నుండి అసెంబ్లీ కి అడుగు పెట్టి వరసగా 4 సార్లు గెలిచి ముఖ్య మంత్రి గా కూడ పని చేశారు. నక్సలైట్ చేతిలో నేల కొరిగిన మాజీ స్పీకర్ శ్రీపాద రావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఆసియాలోనే ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పకుంటున్న ప్రస్థుత కాళేశ్వర ఎత్తి పోతల పథకం ఇక్కడే ఉంది. వీటన్నింటికి తోడు గోదావరి, ప్రాణహిత, అంతర్వాయినీ సరస్వతీ నదుల త్రివేణి సంగమం.

మంథని నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి. 2014 లో మంథని మండలంతో పాటు ముత్తారం, మల్హర్ , మహా దేవాపూర్, కమాన్ పూర్, కాటారం, మహా ముత్తారం, 7 మండలాలుండగా జిల్లాల పునర్విభజనలో భాగంగా కొన్ని గ్రామాలను కలిపి పాలకుర్తి, రామగిరి, పలిమెల మండలాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం జనాబా 2,76,90. కాగా, మొత్తం ఓటర్లు 1,94, 801ఉన్నారు. అందులో పురుషులు. 98,407, మహిళలు .96,394 ఉన్నారు. నియోజక వర్గంలో బిసి లు ఎక్కువ మంది అందులోని మున్నూర్ కాపు కులానికి సంబంధించిన వారే మెజారిటీ. అలాగే మంథని పట్టణంలో బ్రాహ్మణులు ఎక్కువ. ప్రధాన జీవనాధారం వ్యవసాయం .కొంత భాగంలో ఉపరి తల, భూగర్భ బొగ్గు గనులు ఉన్నాయి. దీంతో పారిశ్రామిక వాతావరణం కూడా కనబడుతుందిక్కడ.

1952 లో ఏర్పడ్డ ఈ నియోక వర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ ఒకసారి, టీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి. మంథని కాంగ్రెస్ కంచుకోట. పీవీ నర్సింహారావుకి ఇది సొంత గడ్డ. 1957 నుంచి 1977 వరకూ ఆయన ఇక్కడ నుంచి గెలిచారు. 1983 నుంచి 1989 వరకు దుద్దిళ్ల శ్రీపాదరావు వరుసగా మూడు సార్లు గెలుపొందారు. శ్రీపాదరావు స్పీకర్‌గా పని చేశారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసిన చందుపట్ల రాంరెడ్డి శ్రీపాదరావుపై గెలిచారు. 1999 ఎన్నికలకు ముందు శ్రీపాదరావును నక్సలైట్లు కాల్చివేయడం సంచలనం రేపింది. శ్రీపాదరావు మరణానంతరం ఆయన కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2004, 2009లోనే మంథని ప్రజలు ఆయన్నే ఆదరించారు. 2014లో పరిస్థితి మారింది. శ్రీధర్‌బాబుపై టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు గెలిచారు.

మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం దాదాపు 12 వందల కోట్ల రూపాయలు కేటాయించారు. నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం విస్తృతంగా జరిగింది. అటవీ ప్రాంతంలోని గ్రామాలకు కూడా రోడ్లు వేశారు. నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం అభివృద్ధికి పాతి కోట్ల రూపాయలు కేటాయించారు. కాళేశ్వరంలో ఇసుక లారీల సమస్య ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు ఇసుక భారీగా తరలిపోతోంది. భారీ వాహనాలు, లారీల రాకపోకలతో రహదారులన్నీ దెబ్బ తిన్నాయి. లారీలు వేగంగా వెళ్లడం, ఇష్టం వచ్చినట్లు నడపడం వల్ల.. ప్రమాదాలు జరిగి ప్రతీ నెలా ఒకరిద్దరు చనిపోతున్నారు. ఇసుక లారీలకు స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వివాదాస్పద నేత ఎవరంటే.. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేరు వినిపిస్తుంది. పుట్ట మధు అక్రమ ఆస్తులపై స్థానికుల్లో కొంతమంది ఆదాయపు శాఖ, ఈడీ ఫిర్యాదు లేఖలు రాశారు. మంథని సిట్టింగ్ ఎమ్మెల్యేగా… పుట్టమధు టీఆర్‌ఎస్ తరపున పోటీ పడుతుంటే.. ఆయనపై కాంగ్రెస్ తరపున దుద్దిళ్ల శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. శ్రీధర్ బాబుపైనా ఆరోపణలు ఉన్నాయి. స్థానిక టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో గంజాయి పెట్టించాలన్న ఆడియో టేపుల వ్యవహారంలో శ్రీధర్ బాబు ప్రమేయంపై కేసు నమోదైంది. 2014లో ఓడిపోయినా…నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో తన తండ్రి, తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరేమీ లేదనేది శ్రీధర్ బాబు ఆరోపణ…బీజేపీ తరపున రెండ్ల సనత్ కుమార్ పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండటం, క్షేత్ర స్థాయిలో చురుగ్గా వ్యవహరించడం వంటివి ఆయనకు సానుకూల అంశాలు.

పుట్ట మధు, సనత్ కుమార్‌ది ఒకే సామాజిక వర్గం. బీజేపీ బలపడితే… టీఆర్ఎస్‌ అభ్యర్థిపై ప్రభావం చూపుతుందనేది రాజకీయ వర్గాల అంచనా. వీరి పోటా పోటీ పర్యటనలతో గ్రామాల్లో, మండలాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విజయానికి దోహదపడే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో విజయం ఎవరి సొంతమవుతుందో అనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. బీజేపీ రంగంలో ఉన్నా… ప్రధాన పోటీ టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. ఈ పోటీలో గెలుపెవరిదనేది ఊహించడం కష్టమే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here