Home News Stories

అక్కడ వైసీపీకి వైసీపీ నే ప్రత్యర్ధి….!

గోదావరి జిల్లాల్లో ఆ నియోజకవర్గం రూటే సపరేట్ . అన్ని చోట్ల ఒక ఎత్తాయితే ఇక్కడ మరో ఎత్తు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసుకున్న వైసీపీ ఈ నియోజకవర్గంలో అభ్యర్ధి ఎంపికపై కొలిక్కి రాలేకపోతుంది. టిక్కెట్ కోసం పోటీ పడుతున్న నేతల విభేదాలు పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. పైకి అందరు కలిసికట్టుగా ఉన్నామని నటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటు వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటుంది. మండపేట నియోజకవర్గం పొలిటికల్ సినారియో పై స్పెషల్ రిపోర్ట్….

తూర్పుగోదావరి జిల్లాలో మండపేట అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు ఎక్కువగా పోటీ పడే నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధుల బంధు వర్గాలు రెండు పార్టీల్లోనూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం రాజకీయాలను శాసిస్తుంది. ఆ సామాజిక వర్గం నేతలైతేనే గెలుపు అవకాశాలు ఉంటాయని చరిత్ర చెబుతోంది. వేరొక సామాజిక వర్గంవారు ఇక్కడ ఇమడలేరు. వైసీపీ గత ఎన్నికల్లో ఇక్కడ కాపు సామాజిక వర్గానికి టికెట్ కేటాయించి చేతులు కాల్చుకుంది. దాదాపు 37 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇందుకు కారణం వైసీపీకి నియోజకవర్గంలో సమర్ధవంతమైన నేత లేకపోవడమే.

ఇక్కడ వైసీపీలో ఎవరికి వారు పార్టీ కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేసే వారే. అందరు టికెట్ ఆశించడం దక్కకపోతే పార్టీ ఫిరాయించడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. వైసీపీ కో ఆర్డినేటర్ పితాని అన్నవరం, మరో కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి మధ్య విభేదాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైసీపీ లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మండపేట నియోజకవర్గంలో దివంగత సీఎం వై.ఎస్ రాజశేఖరరెడ్డికి ఎనలేని అభిమానులు ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులు, కార్యకర్తలు గ్రామ, గ్రామాన ఉన్నా నియోజకవర్గస్థాయి నాయకుల్లో సఖ్యత లేకపోవడం
ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉండడం ఇక్కడ పార్టీకి మైనస్ గా మారింది.

మొదట్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి అన్ని గ్రామాల్లో తిరిగి పార్టీని పటిష్ట పర్చారు. దాదాపు నాలుగేళ్లు పార్టీని భుజస్కంధాలపై మోసారు. నాలుగేళ్ల తరువాత కొత్తగా కాకినాడకు చెందిన డాక్టర్ పితాని అన్నవరంను రంగంలోకి దింపి కో – ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. ఇది స్థానిక నేతలకు రుచించడంలేదు. పైకి అందరూ కలిసి పని చేస్తామని చెబుతున్న పార్టీ కార్యక్రమాలు వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకే పార్టీ టిక్కెట్ అని డాక్టర్ పితాని అన్నవరం నియోజకవర్గంలోకి అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల వైసీపీ టికెట్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరికి ఇస్తున్నారని పూకార్లు వచ్చాయి. దీనిని ఒక మీటింగ్ లో కో ఆర్ఢినేటర్ పితాని అన్నవరం ఖండించారు. దీనిని ఒక కార్యకర్త సెల్ ఫోన్ లో వీడియో తీసి వాట్సాఫ్ , ఫేస్ బుక్ లలో పెట్టాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో ప్రత్యర్ధి వర్గం పితాని అన్నవరం పై విరుచుపడ్డారు.

పటిష్టమైన కేడర్ ఉన్న నాయకుల మధ్య విభేదాలు పార్టీ నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనిని వైసీపీ అధిష్టానం సీరియాస్ గా తీసుకుని పరిశీలించకపోతే ఈసారి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక వైసీపీ విభేదాలను సోషల్ మీడియాలో చూసిన తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు. వైసీపీ ఇంటర్నల్ వార్ తో ఎమ్మేల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హ్యాట్రిక్ కొడతారని సబరపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here