Home News Politics

పాలమూరులో వార్ వన్ సైడ్ ….తెలంగాణలో తొలి గెలుపు డీకే అరుణదేనా…!

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో పోటీ రసవత్తరంగా మారింది. మహబూబ్‌నగర్‌ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు ఇక్కడ వ్యూహాలు, ప్రతి ప్యూహాలకి పదునుపెడుతు ముందుకి దూసుకెళ్తున్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధులు డీకే అరుణ,వంశీ చంద్ రెడ్డి బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్ధులుగా బరిలో దిగారు.టీఆర్ఎస్ నుంచి వ్యాపారవేత్తని రంగలోకి దింపారు. నిన్న మొన్నటి వరకూ కాంగ్రె్‌సలో చక్రం తిప్పిన మాజీ మంత్రి డీకే అరుణ, టీఆర్ఎస్ ఎంపీ జీతేందర్ రెడ్డి బీజేపీలో చేరడంతో అనూహ్యంగా కమలం పార్టీ ఇక్కడ పుంజుకుంది. డీకే అరుణ.. వంశీచంద్‌ రెడ్డి.. మన్నె శ్రీనివాస్‌ రెడ్డి మధ్య పోటీ ఒకప్పటి కరువు జిల్లా పాలమూరులో హోరాహోరీగా సాగుతున్న ఇక్కడ కమలంకే కాస్తా ఎడ్జ్ కనిపిస్తుంది.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అలంపూర్, గద్వాల, వనపర్తి శాసనసభా నియోజకవర్గాలు నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కలపగా, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్‌లో కలిశాయి. కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన జైపాల్‌రెడ్డిపై 2,590 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఉత్కంఠ పరిణామాల నడుమ కాంగ్రెస్‌ను వీడిన డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకే పార్టీ టికెట్‌ లభించడంతో ఇక్కడ పోరుని ఈ పార్టీ కూడా సవాల్‌గానే తీసుకుంది. బీజేపీలో చేరిన మరుక్షణం నుంచే ఆ పార్టీ ముఖ్యనేతల మద్దతు కూడగట్టుకున్న అరుణ లోక్‌సభ పరిధి లోని పార్టీ క్యాడర్‌ తో మమేకమై ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరో వైపు తనకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీతో పాలమూరు ప్రచార సభ నిర్వహిస్తూ సభను విజయవంతం చేయడం ద్వారా తన సత్తా చాటాలని డీకే అరుణ భావిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడం ఆమెకు అదనపు బలంగా మారింది.

డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా తెరపైకి రావడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. జనసంఘ్‌ కాలం నుంచీ ఇక్కడ బీజేపీకి సంప్రదాయ ఓటింగ్‌ ఉంది. 1999లో బీజేపీ అభ్యర్థిగా జితేందర్‌ రెడ్డి గెలిచారు కూడా. ఇప్పుడు మోదీ మేనియాతో సానుకూల ఓటింగ్‌ ఉందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పని చేసినప్పుడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తనకంటూ ప్రత్యేక అను చర వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన అరుణ వారిని తనవైపు తెచ్చుకుంటారని భావిస్తున్నారు. ఇక, 1996లో ఆమె ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 5,498 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాగం జనార్దన్‌ రెడ్డి ఇక్కడ ఏకంగా 2,72,791 ఓట్లు తెచ్చుకున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డిని కాదని టీఆర్ఎస్ అధిష్ఠానం శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఇచ్చింది. అభ్యర్థి గెలుపు బాధ్యతలను అధిష్ఠానం మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాస్‌ రెడ్డిని గెలిపించుకోవడం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారింది. నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 2,82,000 ఓట్ల ఆధిక్యం రావడం,కేసీఆర్ చరిష్మా ఆ పార్టీకి ప్లస్ గా చెప్పుకుంటుంది.

మరోపక్క కాంగ్రెస్‌ చల్లా వంశీచంద్‌రెడ్డిని బరిలోకి దింపింది. నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వంశీ చంద‌ర్ రెడ్డిని తీసుకువ‌చ్చి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. దీంతో అత్య‌ధిక ఓటు బ్యాంకు క‌లిగిన బీసీలు తీవ్ర అభ్యంత‌రం తెలియ చేస్తున్నారు. లోలోప‌ల ర‌గిలి పోతున్నారు. ఆయ‌న‌కు ఏ మేర‌కు ఈ నియోజ‌క‌ర్గంలో పార్టీ శ్రేణులు స‌హ‌క‌రిస్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రె్‌సకు కంచుకోట. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అరుణ నేతృత్వంలో బీజేపీ.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కేడర్‌కి గాలం వేస్తోంది.

గెలుపు తమదే అంటూ గులాబీ పార్టీ ,పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలనే తపనతో కాంగ్రెస్‌, మరోసారి కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో తొలిగెలుపు బీజేపీ నుంచి డీకే అరుణదే అనే టాక్ ఇక్కడ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here