Home News Stories

మహాకూటమిలో ‘లొల్లి’ షురూ….ఉత్తర తెలంగాణలో ఏ సీటు ఎవరికి ?

మహాకూటమి సర్దుబాట్లకు ఆదిలోనే హంసపాదులెదురవుతున్నాయా? … పట్టున్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్న అగ్రనేతలే పొత్తుల చిక్కుల్లో తికమక పడుతున్నారా? …. ఆ సీటు నాకంటే నాకేనని పేచీ పెట్టుకుని కూర్చుంటున్నారా? … ఆ క్రమంలో పొత్తులకు తూట్లు పొడవడానికి కూడా వెనకాడటం లేదా? అసలింతకీ తెలంగాణ ఎన్నికల్లో కీలకం కానున్న ఉద్యమ కేంద్రం ఉత్తర తెలంగాణలో ఏ సీటు ఎవరికి ?

తెలంగాణ ఎన్నికల కోలహాలమంతా ఇప్పడు పొత్తుల చుట్టే తిరుగుతోంది… విపక్ష పార్టీలు ఏకమై మహాకూటమిగా ఏర్పడ్డాయి.. ఆ కూటమి తరపున సీట్ల సర్దుబాటు జరగకముందే సీటు నాకంటే నాకంటూ జనాల్లోకొచ్చి తిరుగుతున్నారు అన్ని పార్టీల నేతలు… ప్రతీసారి ఎన్నికల్లో ఉత్తర తెలంగాణదే కీలక పాత్ర… అది ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అయినా…ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ అయినా…. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంటాయి ఆ జిల్లాలు .. అందుకే ముందస్తు ఎన్నికల ఎఫెక్ట్‌తో పొత్తుల ఎత్తులు, గెలుపు లెక్కలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి.

 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌ నియోజకవర్గం కాస్తా ప్రత్యేకమైనదిగానే చెప్పాల్సి ఉంటుంది. గతంలో కమ్యూనిస్ట్‌ పార్టీలకు కంచుకోటగా నిల్చిన ఈ నియోజకవర్గం… ఆతర్వాత కాలంలో కాంగ్రెస్‌కు … 2014 ఎన్నికల్లో ఉద్యమపోరాటం చేసిన తెలంగాణ పక్షాన నిలిచింది… సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్‌ను మరోసారి గెలిపించాలని కోరుతూ… గులాబీ దళపతి కేసీఆర్‌ ఏకంగా తన తొలి ఎన్నికల శంఖారావం అక్కడ నుంచే మోగించారు … ఇక ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి ఎవరెవరు బరిలోకి దిగుతారన్నదే ఆసక్తికరంగా మారింది.

ఈక్రమంలో తెలంగాణా రాష్ట్ర సమితిని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో మహాకూటమిగా కాంగ్రెస్‌, టీడీపి, సీపీఐ, తెలంగాణా జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీ వంటి పార్టీలన్నీ జట్టు కట్టేందుకు ఇప్పటికే సిద్దమయ్యాయి …. ఆయా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకముందే హుస్నాబాద్ టికెట్‌ కోసం సీపీఐ, కాంగ్రెస్‌ రెండూ సై అంటే సై అంటుండటం చర్చనీయాంశంగా మారింది.

 

హుస్నాబాద్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇప్పటికే గ్రామాలలో తిరుగుతున్నారు… ప్రవీణ్‌రెడ్డికి స్థానికంగా పట్టుందని … అయితే గత ఎన్నికల్లో సెంటిమెంట్‌ కారణంగా ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. ఆ క్రమంలో 2004 నుంచి గెలిచిన సిపిఐ రాష్ట్ర నేత చాడ వెంకట్‌ రెడ్డి… 2009 లో గెలుపొందిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇద్దరూ ఈస్థానం తమకంటే తమకు కావాలని పట్టుపడుతున్నారట.. దాంతో హుస్నాబాద్‌ టిక్కెట్‌ మహాకూటమిలో ఎవ్వరికి దక్కుతుందన్నది సస్పెన్స్‌గా మారింది..

ఇక టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎల్. రమణది అదే పరిస్థితి… ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.. రమణ గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. రమణ ఎలాగూ ఆ సీటును అడగలేరు…అందుకే పక్కనే ఉన్న కోరుట్ల నుండి పోటీచేయాలన్న ఒత్తిడి వస్తుందట… నిజానికి కోరుట్ల రమణకు కొత్తే… బిసీ ఓటర్లు, అందునా పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్న కోరుట్లలో రమణను అక్కడి జనం రీసివ్ చేసుకుంటారా అన్న అనుమానం ఆయన అనుచరులను తొలిచేస్తోందంట. అంతే కాదు…కరుడుగట్టిన ఉత్తర తెలంగాణలో సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయా అన్న మీ మాంసంలో రమణ ఉన్నారట…

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టిడిపి సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిదీ ఇదే పరిస్థితి… ఆయన నర్సంపేట స్థానాన్ని ఆశిస్తున్నారు… గత నాలుగు నెలలుగా ఆయన ఆ సెగ్మెంట్ లో ప్రచారం చేసుకుంటున్నారు .. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి ఉన్నారు… దాంతో ఒకవేళ రేవూరి ప్రకాశ్ రెడ్డి మారాల్సి వస్తే పరకాలకు లేదా వరంగల్ కు రావాలి… టిఆర్ఎస్ పై అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న కొండా దంపతులు ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే వారూ పరకాల ఆశిస్తారు.. ఆ క్రమంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి వరంగల్ నుంచి పోటీ చేయాల్సి వస్తే ఈస్ట్ నుండి చేయాలా…లేక వెస్ట్ నుండి చేయాలా అన్నది సందిగ్దంలో ఉన్నారట.

మొత్తమ్మీద పొత్తుల ఎఫెక్ట్‌తో పార్టీల అగ్రనేతలకే సీట్లు గ్యారంటీ లేని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది.. ఓ పక్క గులాబీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం దూసుకుపోతుంటే విపక్ష కూటమి ఇంకా తేల్చుకోలేక సందిగ్దంలో ఉండడం క్యాడర్ ను గందరగోళంలోకి నెట్టేస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here