Home News Politics

మహా కూటమిలో ఏ పార్టీ ఎక్కడ పోటీ ?

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగడానికి సిద్దమయ్యాయి… కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయన్న క్లారిటీ ఇంకా రాలేదు.. కాంగ్రెస్‌ పెద్దన్నగా ఏర్పడుతున్న ఈ కూటమిలో కీలక నేతలు చాలా మందే ఉన్నారు.. అన్ని పార్టీల అధ్యక్షులు పోటీకి సిద్దమవుతున్నారు.. అయితే ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? పొత్తులకు ఓకే అన్న నేతలు తాము ఆశిస్తున్న సీట్ల విషయంలో రాజీ పడతారా? అసలు ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసే అవకాశముంది?

 


మహా కూటమిలో అంతా హేమా హేమీలే… తమతమ పార్టీల్లో చక్రం తిప్పిన నేతలే.. కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా మహా కూటమి ఏర్పడింది.. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసుకుని కాంగ్రెస్‌, టిడిపి, సీపీఐ, కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి వంటి పార్టీలన్నీ ఏకమయ్యాయి.. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లను పక్కన పెడితే కూటమిలో భాగస్వాములైన టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ వ్యవస్థాపకుడు కోదండరాం, సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి వంటి కీలక నేతలు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది..

టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాల నియోజకవర్గం చెందిన నేత.. గతంలో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు… గత ఎన్నికల్లో అక్కడ నుంచి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిద్యం వహించారు .. పొత్తుల పంపకాల్లో సిట్టింగ్ సీటు కాబట్టి జగిత్యాల కాంగ్రెస్ కే దక్కాల్సిఉంటుంది.. అదే జరిగితే రమణ సైలెంట్ గా ఉంటారా..?.. సీటు త్యాగం చేస్తారా..? అంటే చెప్పడం కష్టమే.. అయితే రమణ… గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజవర్గాల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది… టిడిపి కంచుకోట అయిన కూకట్ పల్లి మీద రమణ కన్నేశారనే ప్రచారం జరుగుతుంది.. ఈ విషయమై ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదంటున్నారు రమణ.. చాలా మంది పార్టీ నేతలు త్యాగాలు చేయాల్సి ఉంటుందని తానే చెప్తున్నానని.. అలాంటిది తానే పార్టీని ఇబ్బంది పెట్టేలా ఎందుకు ప్రవర్తిస్తానని అంటున్నారాయన..

ఇక సీపీఐ హుస్నాబాద్ సీటు ఆశిస్తోంది… హుస్సాబాద్ కోసం మునుగోడు టికెట్ వదులుకోవటానికి సిద్ధమంటోంది .. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలో ఉంటారని ఇప్పటికే తేల్చేయటంతో .. కాంగ్రెస్ కి ఈ సీటు వదిలేయడం మంచిదన్న ఆలోచనలో ఉన్నారు సిపిఐ నేతలు.. ఐతే హుస్నాబాద్ లో చాడా వెంకట్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్న క్రమంలో ఆ సీటు కాంగ్రెస్ సీటు వదులుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక వేళ వదులు కుంటే కాంగ్రెస్‌ నేత, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పరిస్ధితి ఏంటి..?.. ప్రవీణ్ రెడ్డి కి సీటు దక్కకపోతే కాంగ్రెస్ కేడర్ సీపీఐ కి సహకరిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది

ఇక ప్రొఫెసర్‌ కోదండరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.జనగామ నుంచి కానీ వరంగల్ వెస్ట్ నుంచి గానీ ఆయన బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుతోంది.. అయితే జనగామ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కాబట్టి.. దాని కోసం కోదండరామ్ పట్టుపట్టే అవకాశాలు తక్కువంటున్నారు .. వరంగల్ వెస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యంతర పెట్టదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..ఆ సీటు వదులుకోవడానికి కాంగ్రెస్‌ కూడా సిద్దంగా ఉందన్న టాక్‌ వినిపిస్తోంది…

ఇక బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తరపున కేసీఆర్‌ మీద గద్దర్‌, కేటీఆర్‌ మీద విమలక్క పోటీ చేయనున్నారు .. .. అయితే తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటున్న బిఎల్‌ఎఫ్‌ మహాకూటమిలో చేరడానికి ససేమిరా అంటోంది.. కాకపోతే గద్దర్‌, విమలక్క పోటీ చేస్తున్న ఆ రెండు సీట్లలో తమకు మద్దతు ఇవ్వమని కాంగ్రెస్‌ను అడుగుతోంది.. గజ్వేలు కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం .. అక్కడ ముందు నుంచి ఆయనపై పోరాడుతున్న ఒంటేరు ప్రతాపరెడ్డి టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు .. అలాగే సిరిసిల్ల కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరపున కె.కె.మహేందర్‌రెడ్డి ముందు నుంచి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.. బీఎల్‌ఎఫ్‌ అడుగుతున్నట్లు నిజంగా కాంగ్రెస్‌ ఆ రెండు సీట్లలో పరోక్ష పొత్తు కుదుర్చుకుని మద్దతిస్తే ప్రతాప్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిల పరిస్థితి ఏంటి? అన్నది సమాధానం లేని ప్రశ్నే.. ఇలా సవాలక్ష ఈక్వేషన్ల మధ్య … టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసుకుంటున్న కీలక నేతలు ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది సస్పెన్ష్ గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here