Home News Politics

అడుక్కుంటున్న కామ్రేడ్లు

వామ‌ప‌క్ష‌పార్టీల‌తో ప‌వ‌న్ చెడుగుడు

పాపం వామ‌ప‌క్షాలు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలంపాటు అధికారంలో ఉండి, మొన్న‌టిదాకా త్రిపుర‌లో చ‌క్రం తిప్పి, కేర‌ళ‌లో ఇప్ప‌టికీ ఎర్ర‌జెండాని రెప‌రెప‌లాడిస్తున్న కామ్రేడ్లు ఎప్పుడు ఎన్నికలొచ్చినా క్రాస్‌రోడ్స్‌లోనే. ఒక్క బీజేపీతో త‌ప్ప వీలైన‌న్ని పార్టీల‌తో అంట‌కాగిన చ‌రిత్ర‌ను సొంతంచేసుకున్న వామ‌ప‌క్ష‌పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎటువైప‌న్న‌ది ఇప్ప‌టికీ స‌స్పెన్సే. ఏదో ఒక తోడు లేంది అడుగుముందుకేయ‌లేనంత‌గా మాన‌సిక వైక‌ల్యం వ‌చ్చేసింది వామ‌ప‌క్షాల‌కి. వామ‌ప‌క్షాల ఐక్య‌త నేతిబీర‌కాయ‌లో నెయ్యేన‌న్న విష‌యం ఎప్పుడో అంద‌రికీ అర్ధ‌మైపోయింది.

తెలుగురాష్ట్రాల విష‌యానికొస్తే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సీపీఐ, సీపీఎంల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి చ‌ట్ట‌స‌భ‌ల్లో గ‌తంలో అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉండేది. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌తో, త‌ర్వాత టీడీపీతో చెట్ట‌ప‌ట్టాలేసుకున్న వామ‌ప‌క్ష‌పార్టీలు ఇప్పుడు తోడుకోసం త‌పిస్తున్నాయి. చిన్న ఆస‌రా దొరికినా చాల‌నుకుంటున్నాయి. ఏపీలో ఓట్ల‌కోసం మొహం వాచి ఉన్న క‌మ్యూనిస్టుపార్టీల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆప‌ద్బాంధ‌వుడిలా క‌నిపిస్తున్నాడు. హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న జ‌న‌సేనాని వెంట న‌డిస్తే నాలుగు ఓట్లు రాల‌క‌పోతాయా అన్న ఆశ‌తో ఉన్నాయి సీపీఐ, సీపీఎం.

తెలంగాణ‌లో వామ‌ప‌క్ష‌పార్టీలు రెండూ వేటిదారివాటిద‌న్న‌ట్లే ఉన్నా ఏపీలో మాత్రం జ‌న‌సేన‌కి జై కొడుతున్నాయి. ప‌ద‌వుల ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా ప్ర‌జాపోరాటాలు చేసే వామ‌ప‌క్షాలు ఒంట‌రిపోరుతో లాభంలేద‌నే నిర్ణ‌యానికొచ్చేశాయి. అందుకే భావ‌సారూప్యం లేక‌పోయినా జ‌న‌సేన పార్టీనే గుడ్డిలో మెల్ల‌నుకుంటున్నాయి. ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మంలో ప‌వ‌న్‌తో క‌లిసి న‌డుస్తామ‌న్న పార్టీలు..ఆయ‌న ఆ ఊసెత్త‌క‌పోయినా ఎన్నిక‌ల‌దాకా ఈ బంధాన్ని కొన‌సాగించాల‌ని ఆరాట‌ప‌డుతున్నాయి.

వామ‌ప‌క్షాల‌తో మాట‌మాత్ర‌మ‌యినా చెప్ప‌కుండానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో 175 సీట్ల‌లో జ‌న‌సేన పోటీచేస్తుంద‌ని ప్ర‌క‌టించాడు ప‌వ‌ర్‌స్టార్‌. అయినా ఆయ‌న్ని అంటిపెట్టుకునే ఉంటున్నాయి సీపీఐ, సీపీఎం. ఎమోష‌న్‌లో అన్ని సీట్ల‌లో పోటీచేస్తాన‌ని అన్నాడే త‌ప్ప‌…త‌మ‌కో ఇర‌వ‌య్యో పాతికో ఇవ్వ‌కుండా ఉంటాడా అన్న‌దే వామ‌ప‌క్షాల ఆలోచ‌న‌. ప‌వ‌న్ ప్రాప‌కం ఉంటే చాల‌నుకుంటున్న క‌మ్యూనిస్టులు…ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో త‌మ పోరాట‌పంథాను మార్చుకునేలా క‌నిపిస్తున్నాయి. ఎన్నాళ్లిలా తోక‌పార్టీల్లా ఎవ‌రో ఒక‌రిని ప‌ట్టుకుని వేలాడాల‌న్న ఆవేద‌న లోప‌లున్నా…నాలుగు ఓట్లు ప‌డాలంటే, రెండు సీట్లు ద‌క్కాలంటే కామ్రేడ్ల‌కు మ‌రో ఆప్ష‌న్ లేదు మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here