Home Entertainment Cinema

లక్ష్మీస్ ఎన్టీఆర్…ఆర్జీవీ మార్క్ మూవీ…!

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ల వ్యవహారంలో దాన్ని ఎన్టీఆర్ వివాహంగా మార్చి ఓ చట్టబద్ద సంజాయిషీ ఇచ్చినప్పటికీ ఎన్టీఆరే తన సర్వస్వమని లక్ష్మీపార్వతి భావోద్వేగ వివరణ ఇచ్చినప్పటికీ లోకం దాన్ని ఎపిసోడ్లకు ఎపిసోడ్లు అపోహలుగానే గుసగుసలాడుకుంది. మన పురుషాధిక్య సమాజం ఎన్టీఆర్ ను మన్నించినప్పటికీ లక్ష్మీపార్వతిని మాత్రం అన్యమనస్కంగానే అంగీకరించినట్టు భ్రమ కల్పించింది. చరిత్రను పునర్నిర్వచించడం ఇప్పటి ఆర్డర్ అఫ్ ది డే కనుక రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ ఎల్పీ ల అనుబంధం పట్ల ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసాడు. లక్ష్మీపార్వతి మీద గౌరవం కలిగేట్టు చేసాడు. ఆమెను విలన్ గా చిత్రీకరించిన విలన్ లెవరో ఆమె కోణంలోంచే చెప్పేసాడు. ఇందులో అబద్దాలుండొచ్చు..అవాస్తవాలుండొచ్చు..అతిశయోక్తులూ ఉండొచ్చు…..

కథానాయకుడులో ఎన్టీఆర్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉద్యోగం లంచగొండితనం మీద నిరసనతో వదిలేసాడని చెప్పే సినిమాటిక్ లిబర్టీ బాలకృష్ణకు ఎంతుందో టిడిపి రాజకీయాలలో తన జోక్యం అస్సలు లేనేలేదని చెప్పుకునే స్వేచ్చ కూడా లక్ష్మీపార్వతికీ అంతే ఉంది. ఎవడి సినిమాకు వాడే హీరో కదా. లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్మ చెప్పిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కథ. ఇందులో ఎవర్ని విలన్ చేయాలి అనేది కూడా ఆమె ఇష్టం. చంద్రబాబు, రామోజీరావులను బోనులో నిలబెట్టేసిందామె. ఈ సినిమా కధను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఓ కళాకారుడు తనకు ప్రజలలో ఉన్న ఆదరణతో రాజవుతాడు. కొద్ది కాలానికి శత్రురాజులు రాజ్యాన్ని కొల్లగొట్టేస్తారు.

రాజు ఒంటరివాడవుతాడు. కుటుంబం అతడ్ని పట్టించుకోదు ఆ ఒంటరితనంలో రాజుకో తోడు దొరుకుతుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. రాజుగారి కుటుంబం ఈ సంబంధాన్నిఆమోదించదు. ఈ లోగా రాజు మళ్లీ రాజ్యాన్ని సాధించుకుంటాడు. రాజుగోరి కుటుంబాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న సేనాధిపతి రాజుగోరిని కూలదోసి రాజ్యాన్ని కాజేసి రాజుగోరి మరణానికి కారణమై ఆమెను గెంటేస్తాడు….ఇదీ కథ. ఇందులో రాజు ఎన్టీఆర్ ఐనపుడూ ఆమె లక్ష్మీపార్వతి అయినపుడూ సేనాధిపతి సిబిఎన్ అయినపుడూ కథ ఇంకోలా ఉంటుంది. అదే ఈ కథ.

ఫస్టాఫ్ కొంత లాగ్ అవడం మినహా సినిమాలో ఎక్కడా ఏ లోపమూ లేదు. సెకండాఫ్ లో బాబు విలనీ మొదలయిన దగ్గరనుంచీ సినిమా పాకాన పడుతుంది. మంచి కథ దొరికినపుడు కథ చెప్పే విధానంలో వర్మకు వంక పెట్టడం సాధ్యం కాదు. సూటిగా కథలోకి దిగిపోయి ఎక్కడా పక్కచూపులు చూడకుండా చిక్కగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. సినిమాలో మూడు సన్నివేశాల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. సన్నివేశ రూపకల్పనలో ఎబ్బెట్టుతనం ఉండే అవకాశం ఉన్న సందర్బాలను ఎంచుకుని వాటిని హాయిగా అందరికీ ఆమోదమయేట్టు చిత్రీకరించడం కత్తిమీద సామే. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఎంగిలి తినేందుకు భోజనం బాగాలేదన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఆ తరువాత ఓ చిన్న నవ్వు నవ్విన సన్నివేశం చాలా గొప్పగా పండింది. కొంచెం తడబడితే పరమ అసహ్యంగా తయారయే సన్నివేశం ఇది.

ఇద్దరూ డాన్స్ చేసే సన్నివేశం మరొకటి. అంతటి మనిషి ఆ వయసులో లోకం పూర్తిగా అంగీకరించని భార్యతో అల్లరి డాన్స్ చేయడం అనేది గమ్మత్తయిన సందర్బం. కానీ ఆ డాన్స్ సన్నివేశాన్నివర్మ రవ్వంత కూడా తొణకకుండా సీటీలు కొట్టించేసాడు. ఇక మూడోది ఎన్టీఆర్ మరణ సన్నివేశం. అదే క్లయిమాక్స్. ఆయన చివరి ఘడియలనూ ఆ సందర్బంలో అందరూ కలిసి కొద్దికొద్దిగా లక్ష్మీపార్వతిని చడీచప్పుడు కాకుండా కొదికొద్దిగా వెనక్కు చివరకు బయటకు గెంటేయడమూ గొప్పగా ద్రుశ్యమానం చేసాడు వర్మ.

ఈ మూడు సన్నివేశాలకోసమూ ఎన్టీఆర్ గా విజయ్ నటన కోసమూ, లక్ష్మీపార్వతి పాత్రధారిణి ఆ పాత్రలోని అన్ని రసాలనూ పండించిన విధానాన్నీ ముఖ్యంగా సిబిఎన్ పాత్రధారి తేజ కళ్లలో ఉన్నగొప్ప హావభావాలనూ చూడడానికి సినిమా చూసేయొచ్చు. సిబిఎన్ పాత్రధారి తేజలో గొప్ప నటుడున్నాడ్రా బాబూ..అతనిలో నాకు నలుగురైదుగురు ప్రకాష్ రాజ్ లూ ఇద్దరు ముగ్గురు నానాపాటేకర్ లూ ఒకరిద్దరు సిద్దిఖీలూ కనపడ్డారు. దర్శకులూ తొందరగా వాడేసుకోండి. పాత్రలకు నటులను ఎంపిక చేసుకోవడంలో వర్మకు ఎవరూ సాటిరారు. అందరూ చించేసి ఇరగదీసారు. ఒక్కటీ తెలిసిన ముఖం కాకున్నా అందరూ ఎంతో పరిచయస్తుల్లానే ఉన్నారు.

వాళ్లిద్దరి అనుబంధంలో అపవిత్రత లేదన్నది నిజమే కావచ్చు కానీ పార్టీ వ్యవహారాలలో లక్ష్మీపార్వతి జోక్యం అస్సలే లేదన్నది పూర్తి అవాస్తవం. అప్పటి లోపలి కథ తెలిసిన వారెవరూ దీన్ని అంగీకరించరు. ఆమె కు బహుకరించిన చీరలు ఆమె నియామకాలతో జారీ అయిన సీల్డు కవర్లు చాలా మందికి తెలుసు. ఎన్టీఆర్ రీకానలైజ్ చేయించుకున్నారన్న వార్తను ఆధారాలతో సహా డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. కానీ ఆమె కళ్ల డాక్టర్ దగ్గరికి వెళితే ఇంకేదో అన్నట్టు సిబిఎన్ తప్పుడు ప్రచారం చేసాడన్నది కూడా నమ్మశక్యంగా లేదు. వీరగంధంతో సంబంధం తెగిపోవడం కూడా సినిమాలో చూపినంత సున్నితంగా జరగలేదన్నదీ నిజం. అయితే ఈ భాగాన్ని వర్మ చాలా బాగా డీల్ చేసాడు. వీరగంధం పాత్రకు ఎక్కడా దెబ్బతగలనీయలేదు.

మన సెన్సార్ విధానం ఎంత అపహాస్యమో ఈ సినిమాలో తేలిపోతుంది. లోకేష్ ను ఆకాష్ చేయడం అవసరమా. అశోక్ గజపతిరాజును వివేక్ గజపతిరాజు చేయడం, తెలుగుదేశం పార్టీని మనదేశం పార్టీ చేయడం, సింహగర్జనను తెలుగు గర్జన చేయడం వల్ల వచ్చిన తేడా ఏమిటో వాళ్లే చెప్పాలి. ఈ సినిమాను ఎపిలో విడుదల కాకుండా నిలుపుకోవడం అతని కోణంలో సిబిఎన్ చేసిన మంచిపనే. సిబిఎన్ కనపడ్డప్పుడల్లా వినపడే నాగస్వరం ఆ పాత్రధారి చూపుల్లో విలనీ కచ్చితంగా కొన్ని ఓట్లకయినా గండికొట్టడం ఖాయం.

థియేటర్ లో వర్మ జిందాబాద్, జై వర్మ అనే అరుపులూ కేకలూ వినపడ్డాయి. వర్మ వాయిస్ ఓవర్ వినపడగానే కూడా ఈలలూ చప్పట్లూ ఆశ్చర్యపరచాయి. అప్పుడెప్పుడో దాసరి నారాయణరావుకు విన్నవి. మళ్లీ ఇప్పుడు. ఈ మధ్యలో ఇదెవరూ సాధించలేదు. వర్మ చాలాకాలం తరువాత ఒక ప్రేమకథను… అది అడుల్ట్ లవ్ స్టోరీయే కావచ్చు అందంగా తీసాడు. స్త్రీ పాత్రను ఎక్కడా తగ్గనీయకుండా గౌరవం పెంచేలా తీసాడు. లక్ష్మీపార్వతిని గురించి కొందరైనా తమ అభిప్రాయం మార్చుకునేట్టు తీసాడు. ఈ ప్రేమను శిశిరంలో వసంతం అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here