Home Entertainment Cinema

లక్ష్మీస్ ఎన్టీఆర్…..వర్మ కొంటె ప్రశ్నలు

బాలకృష్ణ ఎపుడైతే..వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను జోరుగా చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ.

సినీ దర్శకుల్లో వర్మ శైలే వేరు. ఆయన అనుకుంటే ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఆ సినిమాను పూర్తిచేసే వరకు వెనకడుగు వేయరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. రాయలసీమ నాయకుడు పరిటాల రవీంద్ర కథ ఆధారంగా ‘రక్తచరిత్ర’ను తెరకెక్కించి వర్మ వహ్వా అనిపించారు. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘వంగవీటి’ సినిమాను పూర్తిచేసి విడుదల చేశారు. ఈ సినిమాల్లో పాత్రల ఎంపికలో వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నిజజీవిత వ్యక్తులే నిజంగా తెరపై కనిపిస్తున్నారా అన్నంతగా వర్మ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలోనూ వర్మ అంతే జాగ్రత్త తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ జీవితంలోనే కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైంది. ఇప్పటికే టీడీపీ వర్గాలు వర్మ సినిమాపై మండిపడుతున్నారు. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు పాటలతో పాటు కీలక పాత్రల దారులను పరిచయం చేసిన వర్మ మరో అప్‌డేట్ ఇచ్చాడు. అసలు వర్మ నిజంగానే సినిమా తీస్తున్నాడా అన్న అనుమానాలకు కూడా తెర దించాడు. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆన్‌లోకేషన్‌ స్టిల్స్‌ను రిలీజ్‌ చేశాడు వర్మ. ఎన్టీఆర్‌ ఇంట్లో పార్టీ నాయకులు అంతా భోజనం చేస్తున్న స్టిల్‌తో పాటు మరో స్టిల్‌ను రిలీజ్ చేశాడు. వర్మ సినిమా పనుల్లో ఫుల్‌ బిజీగా ఉంటునే తనదైన స్టైల్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా కానిచ్చేస్తున్నాడు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రకు ఈయన్ని ఎంపికచేసుకోవడంతో పాటు కొన్ని నెలలపాటు వర్మ శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ మేనరిజం, హావభావాలు, మాట్లాడే తీరు ఇలా ప్రతి విషయంలో పూర్తి శిక్షణ ఇచ్చి సినిమాలో నటింపజేసినట్లు వర్మ స్వయంగా వెల్లడించారు. ఇక లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తున్నారు. సినిమాలో కీ రోల్ అనుకున్న చంద్రబాబు నాయుడు పాత్రలో ‘వంగవీటి’ సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ కనిపించనున్నారు. ఫిబ్రవ‌రిలో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేసిన వ‌ర్మ ఒకవైపు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుతూనే మ‌రోవైపు చిత్రానికి కావ‌ల‌సినంత ప్రచారం కల్పిస్తున్నారు.

ఇందులో ఓ ఫోటోలో అన్నగారు కుర్చీలో కూర్చొని ఆలోచనలో ఉన్న స‌మ‌యంలో ఆయన వద్దకు ల‌క్ష్మీ పార్వతి న‌డిచొస్తున్నట్టుగా ఉంది. రెండో ఫోటోలో తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా లక్ష్మీ పార్వతి భోజనం వడ్డిస్తున్నట్టుగా ఉంది. ఈ రెండు ఫొటోలు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో వర్మ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కట్టప్ప వెన్నుపోటు పొడిచిన పోస్టర్‌కు మార్ఫింగ్ చేసి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోవాలంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న వేశారు.అయితే ఈ పోస్టర్‌లో కట్టప్పగా చంద్రబాబుగా, బాహుబలి పాత్రలో వెన్నుపోటుకు గురైన వ్యక్తిగా ఎన్టీఆర్‌గా ఈ పోస్టర్‌ను డిజైన్ చేసాడు. నిజాన్ని నిజంగా చూపించాలంటే వర్మ తరవాతే అంటూ కామెంట్లు పెడుతున్నారు.