Home News Stories

లక్షల్లో బాలాపూర్ లడ్డూ. ఎందుకంత ప్రత్యేకత అంటే ?

బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. 1980లో మొదలైన బాలపూర్ వినాయ‌కుడి ప్రస్థానం.. 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో మరింత ఖ్యాతిని చాటుకుంది. లంబోదరుడిని మనసారా దర్శించుకొని ఆయన చేతిలో ఉన్న లడ్డూ చేజిక్కించుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భ‌క్తుల‌ విశ్వాసం.

మొదట రైతులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే వారు. లడ్డూ దక్కించుకున్న వారు పంట పొలాలలో చల్లుకుంటే బాగా పంటలు పండుతాయని నమ్మకం. ప్రస్తుతం బాలాపూర్ లడ్డూపై రాజకీయ నాయకులు, వ్యాపారుల కన్ను పడింది. దీంతో లడ్డూకు దేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా విశేషాద‌ర‌ణ వ‌స్తోంది. మొదట 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం…క్రమంగా వందలు, వేలు దాటి లక్షలకు చేరింది.

1994లో కోలన్ మోహన్‌రెడ్డి మొదటిసారిగా లడ్డూను రూ.450లకు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లడ్డూ ధర పెరుగుతూ వస్తున్నది తప్ప తగ్గిన సందర్భాలు లేవు. 1994లో రూ.450 ఉన్న లడ్డూ 2017లో నాగారం తిరుపతిరెడ్డి రూ.15.60లక్షలకు దక్కించుకున్నారు. అయితే 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26లక్షలకు లడ్డూను దక్కించుకున్న తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో తీగల కృష్ణారెడ్డి మరోసారి లడ్డూను దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి .

తీగల కృష్ణారెడ్డితోపాటు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, గతంలో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొత్త మనోహర్‌రెడ్డి కూడా లడ్డూ వేలంలో పాల్గొంటారని ఉత్సవ సమితి సభ్యులు పేర్కొన్నారు. ఉత్సవ సమితి పేరు మీద ఇప్పటికే రూ.18 లక్షలు డిపాజిట్ చేసినట్లు మనోహర్ రెడ్డి అనుచరులు ఉత్సవ సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారన్నారు. అయితే నియోజకవర్గంలో ఉద్దండులు వేలంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపించ‌డంతో లడ్డూ వేలం రసవత్తరంగా సాగింది.

ఈ ఏడాది బాలాపూర్ గణనాథుడి లడ్డూను వేలంలో ఆర్యవైశ్య సంఘం దక్కించుకుంది. ఆర్యవైశ్య సంఘం తరఫున బాలాపూర్ వాసి టీ. శ్రీనివాస్ గుప్తా లడ్డూ అందుకున్నారు. వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డూ 16 లక్షల 60వేలు పలకడం విశేషం. లడ్డూ వేలం ఎక్కువ శాతం పెరుగకుండా జాగ్రత్తలు తీసుకున్న‌ట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

అత్యధికంగా 8 సార్లు బాలాపూర్ గ్రామానికి చెందిన కోలన్ కుటుంబీకులు వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here