కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు త్వరలోనే ఫలించేలా ఉన్నాయి. ఒక పక్క అమెరికన్ కంపెనీ ఫైజర్ క్లినికల్ ట్రయల్స్ తుది దశలో ఉండగా, వ్యాక్సిన్ విషయంలో స్పీడ్ పెంచింది రష్యా. ఇండియాలో రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ ట్రయల్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రష్యా నుంచి రెడ్డి ల్యాబ్స్ కు ట్రయల్స్ డోసులు అందటంతో…2వేలమందిపై వీటిని ప్రయోగించబోతున్నారు. వాలంటీర్ల ఎంపిక పూర్తయ్యాక నవంబర్ 15 తరువాత ట్రయల్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

తమ వ్యాక్సిన్ 92శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించిన రష్యా….మిగిలిన దేశాలకంటే ముందే మార్కెట్ లోకి కరోనా టీకా తీసుకురావాలనే పట్టుదలతో ఉంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకుంది రెడ్డీస్ ల్యాబ్స్. 100 బిలియన్ డోసుల కోసం ముందే అగ్రిమెంట్ చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే ప్రపంచంలో వ్యాక్సిన్ అందుకునే దేశాల్లో భారత్ ముందు వరసలో ఉండబోతోంది.
తాము అభివృద్ధి చేసిన టీకా 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఈమద్యే ప్రకటించింది అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్. తమ టీకా 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని తాజాగా ప్రకటించిన రష్యా… తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియని వేగవంతం చేసింది. ఫైజర్ ప్రకటన విడుదలైన నాలుగు రోజులకే రష్యా చేసిన ప్రకటన చూస్తుంటే… వ్యాక్సిన్ విషయంలో అగ్రదేశాల మధ్య ఎంతటి పోటీ నడుస్తోందో అర్ధమవుతోంది. స్పుత్రిక్-వీ టీకాను గమాలేయ పరిశోధన సంస్థ తయారు చేస్తోంది. బెలారస్, యూఏఈ, వెనెజులా తదితర దేశాలలో స్పుత్నిక్ వీ మూడో దశ ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. భారత్‌లో మాత్రం రెండు, మూడు దశల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి.
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రయోగాలు ఆరునెలలు కొనసాగుతాయని ప్రకటించింది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్. మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో, టీకా పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతోందనే నమ్మకంతో ఉంది రష్యా. అయితే క్లినికల్ ట్రయల్స్ విషయంలో ఫైజర్ కంటే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండటంపై చర్చ జరుగుతోంది. ఫైజర్-బయోఎన్‌టెక్ మధ్యంతర ఫలితాలు వెల్లడించిన తర్వాత రష్యా వ్యాక్సిన్ ఫలితాల వెల్లడి వెనుక.. రాజకీయ ఒత్తిడి ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. తమ టీకా సమర్ధత రేటును నిర్ధారించడానికి ట్రయల్స్ కొనసాగుతాయని ఫైజర్ చెబుతుంటే…దానికంటే రెండుశాతం ఎక్కువగానే తమ టీకా ప్రభావం ఉందంటన్న రష్యా…స్పీడ్ పెంచబోతోంది.