Home News Politics

నందమూరి హోరా…కారు జోరా…కూకట్ పల్లిలో గెలుపెవరిది…?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో కూకట్ పల్లి నియోజకవర్గం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలో ఉండటంతో నియోజకవర్గం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక విజయమే లక్ష్యంగా నియోజకవర్గం పై గురి పెట్టిన గులాబీ పార్టీ మాత్రం అభ్యర్ధి ఎవరైన విజయం తమదే అంటుంది. ఉనికి చాటేందుకు ఇక్కడ కమలం పార్టీ సైతం ఉరుకులు పెడుతున్న ప్రధాన పోటీ మాత్రం కారు-సైకిల్ మధ్యే సాగనుంది. ఇక్కడ అభ్యర్ధుల గెలుపు ఓటములు నిర్ణయించేది సెటిలర్లు అన్నది కామన్ పాయింట్. రసవత్తరంగ మారిన కూకట్ పల్లి రాజకీయ ముఖచిత్రం పై తెలుగుపాపులర్ టీవీ ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్….

కూకట్‌పల్లి నియోజకవర్గంలో గెలుపు, ఓటముల సంగతి ఎలా ఉన్నా కారు, సైకిల్‌ అభ్యర్థులు మాత్రం సెటిలర్ల ఓటర్ల పైనే కన్నేశారు. మినీ ఏపీగా పేరున్న కేపీహెచ్‌బీ రోడ్డు నంబరు-1 నుంచి శ్రీలాపార్క్‌ప్రైడ్‌ వరకు ఉన్న సెటిలర్లదే గెలుపులో కీలకపాత్ర. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రచారం జోరు పెంచగా, టీడీపీ అభ్యర్థి సుహాసిని ఇంకా నాయకులు, కార్యర్తలను పరిచయం చేసుకునే దశలోనే ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావు పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండే వసంతనగర్‌ కేంద్రంగా అన్నీ పార్టీల నాయకులు పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాగా.. ప్రస్తుతం ముఖ్య నాయకులు అంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా ప్రచారం చేస్తుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. టీడీపీకి అనుకూలంగా ఉండే కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌, వసంతనగర్‌, శ్రీలాపార్క్‌ప్రైడ్‌ తదితర కాలనీల్లో ముఖ్య నాయకులను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కొన్ని నెలల ముందు నుంచే తనవైపు తిప్పుకొని వారితోనే ఆ ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండటంతో కారు గుర్తుకు ఈసారి టీడీపీతో సమానంగా ఓట్లు పడతాయని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు.

టీడీపీ టికెట్‌ కోసం పోటీ పడిన నేతలను కాదని నందమూరి వంశం నుంచి సుహాసినీని తీసుకురావడంతో ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు మహాకూటమిలో ప్రధానభాగస్వామి అయిన కాంగ్రెస్‌ నాయకుల గ్రూపుల కారణంగా ఓ వర్గం కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్న సర్వే సత్యనారాయణ చుట్టూ ప్రచారం చేస్తుండటంతో సుహాసినీకి వారు ఇంకా దగ్గర కాలేదనే చెప్పవచ్చు. దీంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆయా కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో మంచి పలుకుబడి ఉన్న వారి ఇళ్లకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు నేరుగా వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతుండటంతో సెటిలర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో గులాబీ నేతల్లో ఉత్సాహం నెలకొంది.

టీడీపీ కంచుకోటకు బీటలు వారకుండా ఎలాగైనా సైకిల్‌కు ఓటువేసేలా ప్రచార వ్యూహాలను రచించాలని టీడీపీ నేతలు ఆలోచించే పనిలోనే ఉన్నారు. మహాకూటమి తరపున ఏ ఉద్ధేశంతో టీడీపీ సుహాసినీని అభ్యర్థిగా రంగంలోకి దింపారో.. అదే సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్‌ను కూకట్‌పల్లి నియోజకవర్గం ఇన్‌చార్జీగా టీఆర్‌ఎస్‌ పార్టీ నియమించింది. టీడీపీకి బలమైన సామాజికవర్గం ఓటర్లను కొంతైనా బండి చీల్చుతారని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గట్టిగా విశ్వసిస్తోంది. పోటీలో ఎన్ని పార్టీలు ఉన్నా.. చివరికి కారు, సైకిల్‌ గుర్తుల మధ్య పోటీ సాగనుంది.

కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో 3.37 లక్షల మంది ఓటర్లు ఉండగా దాదాపు రెండు లక్షలమంది ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడినవారే. వారిలో దాదాపు 60 శాతం మంది ఉత్తరాంధ్రకు చెందినవారే. కృష్ణారావు టీఆర్ఎస్ లో చేరిన తరువాత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కు లేకుండా అయ్యింది. స్థానిక సమస్యలపై నియోజకవర్గమంతటా పోరాడిన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసే వారు లేరు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కృష్ణారావు సైకిల్ పార్టీ శ్రేణులను చాలా వరకు తనవైపు తిప్పుకొన్నారు. ‘ఎన్‌టీఆర్‌ కుటుంబం పట్ల అభిమానంతో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసేవారు వేలాదిమంది ఉన్నారు. ఓటు వేయించుకునేందుకు పార్టీ యంత్రాంగమే సిద్ధంగా లేదు. ఇప్పుడున్న నాయకుల్లో ఎంతమంది పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తున్నారో… ఎంతమంది వెన్నుపోటు పొడుస్తున్నారో చెప్పలేని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. టీడీపీ అగ్రనాయకత్వం దీని పై దృష్టి సారిస్తే ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇక్కడ వచ్చే వారం రోజుల్లో చంద్రబాబు,రాహుల్ గాంధీ రోడ్ షో కూడ ఉండనున్నట్లు తెలుస్తుంది.ఏదేమైన కూకట్ పల్లిలో పోరు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here