Home News Politics

కేటీఆర్ మాట మారిందెందుకు?

జ‌గ‌న్ గెలుస్తాడ‌నే న‌మ్మ‌కం లేదా?

 

ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌నే. కేవ‌లం వైసీపీ నేత‌లు చెప్పుకోవ‌డం కాదు…అత్యుత్సాహంగా టీఆర్ఎస్ నేత‌లు కూడా బ‌ల్ల‌గుద్ది ఇదే మాట‌చెప్పారు. స్వ‌యానా సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌మార్పుడి ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు ఓడిపోవాల‌నే వారు కోరుకున్నారు. కాబోయే సీఎంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో దోస్తీప పెంచుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌ట్నించీ ఏపీ రాజ‌కీయాల‌పై కేసీఆర్‌, కేటీఆర్ ఫోక‌స్ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముంద‌స్తుగానే అయిపోవ‌టంతో… ఏపీలో జ‌గ‌న్‌కి నైతిక మ‌ద్ద‌తిచ్చి చంద్ర‌బాబు ఓట‌మిని కోరుకున్నారు.

కేసీఆర్ కాస్త త‌గ్గినా కేటీఆర్ మాత్రం అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబును క‌వ్విస్తూనే ఉన్నారు. టీడీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచి మొద‌లుకుని, ఎన్నిక‌ల‌య్యాక ఈసీమీద టీడీపీ అధినేత పోరాటం దాకా దాదాపుగా ప్ర‌తీ చ‌ర్య‌నీ త‌ప్పుప‌ట్టారు కేటీఆర్‌. ఈవీఎంల‌మీద చంద్ర‌బాబు పోరాటాన్ని ఎద్దేవా చేశారు. ఓట‌మికి సాకులు వెతుక్కుంటున్నార‌ని దెప్పిపొడిచారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకొస్తే గ‌ల్లీ నుంచి ఢిల్లీదాకా త‌మ‌కు తిరుగుండ‌ద‌నేది గులాబీపార్టీ నేత‌ల ఆలోచ‌న‌. అందుకే ఏపీ నేత‌ల‌కంటే ఎక్కువగా అక్క‌డి రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టారు. ఎప్ప‌టి ప‌రిణామాల‌ను అప్పుడు తెలుసుకుంటూ ఓ క‌న్నేసుంచారు.

త‌మంత‌ట తామే ఏపీకి కాబోయే సీఎం జ‌గనేన‌ని చెబుతూ వ‌చ్చిన కేసీఆర్‌, కేటీఆర్…ఇప్పుడు కాస్త డౌట్‌లో ప‌డ్డ‌ట్లే క‌నిపిస్తోంది. అందుకే మునుప‌టిలా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌కుండా…కాస్త బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఆస్క్ కేటీఆర్ అంటూ నెటిజ‌న్ల‌తో కేసీఆర్ వార‌సుడి ఇంట‌రాక్ష‌న్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న స్పంద‌న చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌నీ, చంద్ర‌బాబు అవినీతి పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌టం ఖాయ‌మ‌ని మొన్న‌టిదాకా మైకుల మోత మోగించిన కేటీఆర్‌…ఇప్పుడా మాట గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నారు.

ఏపీకి కాబోయే సీఎం ఎవరు? ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజలనే కాదు రాజకీయ నాయకులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.  గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. అంతిమంగా ఓటరు దేవుడు ఎవరిని కరుణించాడు అనేది మే 23న తేలనుంది. ఇకపోతే.. ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ఇచ్చిన జవాబు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో గెలుపెవ‌రిద‌న్న ప్ర‌శ్న‌కు లౌక్యంగా స‌మాధాన‌మిచ్చారు కేటీఆర్‌. త‌న అభిప్రాయంతో ప‌న్లేద‌ని, ఏపీ ప్ర‌జ‌లు దాన్ని నిర్ణ‌యిస్తార‌ని స్పందించారు.

గ‌తంలో వాద‌న‌కే క‌ట్టుబ‌డి ఉంటే…చంద్ర‌బాబు ఓడిపోతున్నార‌నో, జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తున్నార‌నో కేటీఆర్ చెప్పుండాలి. కానీ ఆయ‌న కాస్త భిన్నంగా స్పందించడం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో వేలుపెడ‌తామ‌నీ, చంద్ర‌బాబుకి రిట‌న్‌గిఫ్ట్ ఇచ్చి తీర‌తామ‌ని తొడ‌గొట్టిన కేటీఆర్‌…ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేదంటున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తారా అన‌డిగితే… దానికింకా చాలా స‌మ‌యం ఉంద‌న్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఓట‌మి త‌ప్ప‌ద‌ని విప‌క్షాలు లెక్క‌లేసుకుంటే… చివ‌రికి ప్ర‌జ‌లు ఆ పార్టీకే అధికారం క‌ట్ట‌బెట్టారు.

ఏపీలో పోలింగ్ ట్రెండ్‌తో టీఆర్ఎస్ డిఫెన్స్‌లో ప‌డింద‌నీ…అందుకే గ‌తంలోలా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌కుండా.. వేచిచూసే ధోర‌ణితో ఉందంటున్నారు. ఒక‌వేళ ఏపీలో చంద్ర‌బాబు మ‌ళ్లీ గెలిస్తే తెలుగురాష్ట్రాల మ‌ధ్య తేలాల్సిన పంచాయ‌తీలు చాలానే ఉన్నాయి. అందుకే తెగేదాకా లాగ‌డం ఎందుక‌నుకుంటున్నారో, మే 23న క్లారిటీ వ‌చ్చాకే చూసుకుందామ‌నుకుంటున్నారో?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here