Home News Stories

కేసీఆర్ సన్….కేటీఆర్ అను నేను హామి ఇస్తున్నాను…!

కేసీఆర్ సన్ గా టీఆర్ఎస్ లీడర్ గా కేటీఆర్ గ్రేటర్ లో ఓ వినూత్న ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు. ఆంధ్రా ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండి గెలుపోటముల్ని ప్రభావితం చేసే ప్రాంతాల ఎమ్మెల్యేలను పక్కన కూర్చో బెట్టుకుని సెటిలర్స్ కు సుద్దులు చెప్పాడు కేటీఆర్. మీరందరూ నన్ను సోదరుడిగా భావించండి. మీ అందరికీ వ్యక్తిగతంగా అండగా ఉంటానని ఆయన కుమారుడిగా, టీఆర్‌ఎస్‌ నాయకుడిగా హామీ ఇస్తున్నా. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టండి అంటూ సూదీర్ఘంగానే కన్విన్స్ చేసి పారేశాడు.

గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో టిఆర్ఎస్ కు అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని అన్నారు. నిజాంపేట రోడ్‌లో‘హమారా హైదరాబాద్‌’ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గాల్లోని కాలనీ అసోసియేషన్లతోపాటు అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఒక్కో నియోజక వర్గం నుంచి ఏడుగురు చొప్పున 21 మందితో ఎమ్మెల్యేలు మాట్లాడించారు. వారిలో ఐదుగురు కేసీఆర్‌ ఇటీవలి వ్యాఖ్యలు తమను బాధించాయని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.

నేరుగా చంద్రబాబును టార్గెట్‌గా చేసి మాట్లాడితే టిఆర్ఎస్ కు ఇబ్బందే. చంద్రబాబుపై పరోక్షంగా కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఉన్న మాపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. మన ప్రాంతంలో విజన్‌ ఉన్న నాయకుడిని సీమాంధ్ర ద్రోహులు అంటూ కేసీఆర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా.. ఇంకా ఆ పార్టీలో కొనసాగడానికి మీకు మనసు ఎలా ఒప్పుతోందో అర్థం కావడం లేదని నిలదీస్తున్నారు. దీనిని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని కేసీఆర్‌తో కీలక ప్రకటన చేయించండి’’ అని వారు కేటీఆర్‌ను సభాముఖంగా కోరారు.

కేపీహెచ్‌బీకి చెందిన ధర్మారావు మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్‌ గారు.. మీ పక్కన కూర్చున్న ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అనుకుంటున్నారేమో.. వారంతా ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలేనని గుర్తుంచుకోండి’’ అని వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల కిందట వచ్చి స్థిరపడిన తమను సెటిలర్లు అనడం సమంజసం కాదన్నారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధిలో పోటీ పడాలని, ఇంకా కులం, ప్రాంతాల పేరిట రాజకీయం తగదని హితవు పలికారు. అనంతరం వారిని ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. ధర్మారావు గారు చెప్పినట్టు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచింది టీడీపీ తరపునే కానీ మీరే కాదు ప్రజలు కూడా ఒక విషయాన్ని అంగీకరించితీరాలి… చరిత్ర అప్పుడప్పుడు కొన్ని మలుపులు తీసుకుంటుంది,అలాంటి సందర్భంలో కొన్ని కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడతాయి అప్ప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యల్లో భాగంగానే వాళ్లు టిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది అని కన్ వెన్స్ంగ్ మ్యానర్ లో చెప్పిన కేటిఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి పరిస్థితులని గుర్తు చేశారు.

అదేవిధంగా మరో ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘‘మీరు అడగచ్చు.. చంద్రబాబును కానీ.. టీడీపీని కానీ.. టార్గెట్‌ చేయాల్సిన అవసరం ఏమిటని..? రాజకీయాల్లో ఒకరిపై ఒకరం తలపడడం, విమర్శలు చేయడం సహజమే. చంద్రబాబు కేసీఆర్‌ను విమర్శించడం.. కేసీఆర్‌ చంద్రబాబును, ఉత్తమ్‌ను విమర్శించడం సహజమే. దానిని ప్రజలను ఏదో అన్నట్లు అనుకుంటే తప్పవుతుంది.

అనంతరం బుజ్జగింపు ధోరణిలో మాట్లాడిన కేటిఆర్.. “ఈ నాలుగేళ్లలో మా వ్యవహార శైలి మీకు తెలుసు. ఎక్కడైనా ప్రాంతీయాభిమానం, ప్రాంతీయ వివక్ష చూపించినట్లు కనిపించిందా?’’ అని ప్రశ్నించారు. ఉద్విగ్నంగా, ఉద్వేగపూరితంగా మాటల తూటాలు పేల్చుకున్నప్పుడు కొంత నొప్పి కలిగినట్లు అనిపిస్తుందని, దానిని తాను కాదనడం లేదని చెప్పారు. కానీ, రాజకీయాల్లో చంద్రబాబు ప్రత్యర్థి కాబట్టి ఆయనపై విమర్శలు చేయడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆక్సిజన్‌ అందిస్తున్నది.. చచ్చిన పామును లేచి నిలబెడుతున్నదీ చంద్రబాబేనన్నారు.


ఎన్నికలకు ఎన్నో రోజులు లేకపోవడం, మహాకూటమిని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా చంద్రబాబును విమర్శించడాన్ని ప్రధానాస్త్రంగా ఎంచుకున్న టిఆర్ఎస్,తద్వారా సెంటిమెంటుని రగులుస్తున్న సంగతి తెలిసిందే. కాగా,దాని వల్ల హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర వాళ్లు హర్ట్ అవుతున్నారని ఆత్మపరిశీలించుకున్నారో ఏమో తెలియదు కానీ వాళ్లను తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే టిఆర్ఎస్ అధినాయకత్వం ఈ ” హమారా హైదరాబాద్ ” కార్యక్రమం ద్వారా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here