Home News Stories

కృష్ణాజిల్లా పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్-PART-1

రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు కృష్ణాజిల్లా.. ఒకప్పుడు రౌడీయిజానికి నేడు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ బెజవాడ.. విద్య ,సినిమా, పత్రికా రంగం ఏదైనా సరే వాటికి పుట్టినిల్లు మాత్రం కృష్ణా జిల్లా నే.. అలాంటి కృష్ణాజిల్లాలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ పార్టీ తాజాగా జనసేన ఈసారి గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కులాల రచ్చ ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లాలో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు ఎవరికి పట్టం కడతారు ఎవరు ఊహించి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కృష్ణాజిల్లా రాజకీయం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…

రెండు పార్లమెంటు నియోజకవర్గాలు,16 అసెంబ్లీ స్థానాలున్న కృష్ణా జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది.. రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది..16 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 11 స్థానాలను కైవసం చేసుకుంటే..నాలుగు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.. ఒక స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది.. మచిలీపట్నం బెజవాడ రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ జెండానే ఎగిరింది.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ అందులో విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన జలీల్ ఖాన్, పామర్రు నియోజకవర్గం నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు.. దీంతో కృష్ణా జిల్లాలో టీడీపీ బలం 13కి పెరిగింది.. జిల్లాలో ఇదే పట్టు నిలుపుకునేందుకు ముగ్గురికి కేబినెట్ లో స్థానం కల్పించింది టీడీపీ.

మైలవరం నియోజకవర్గం నుంచి గెలిచిన దేవినేని ఉమా నీటిపారుదల శాఖ మంత్రిగామైలవరం నుంచి గెలిచిన దేవినేని ఉమా నీటిపారుదల శాఖ మంత్రిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర ప్రస్తుత న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు..కైకలూరు నుంచి బీజేపీ తరఫున గెలిచిన కామినేనిశ్రీనివాస్ ఆరోగ్యశాఖమంత్రిగా పని చేసి ఎన్డీయే నుంచి టీడీపీ బయటకివచ్చాక తన పదవికి రాజీనామా చేశారు.. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీదే పై చేయిగా నిలిచింది. అటు బీజేపీతో పొత్తు, ఇటు జనసేన సపోర్ట్ రెండూ టీడీపీకి కలిసి వచ్చాయి… ఇటు వైసీపీ చేసిన కొన్ని తప్పులు కూడా ఆపార్టీకి మైనస్ గా మారాయి..

గత ఎన్నికల నాటి పరిస్థితి ఈసారి కృష్ణాజిల్లాలో లేదనే చెప్పాలి..గత ఎన్నికల్లో బీజేపీ,జనసేన రెండు టీడీపీకి మద్దతు ఇవ్వటం వల్ల అత్యధిక సీట్లు ఆ పార్టీ సాధించింది.. ఈసారి ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. కుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో జనసేన ఓటింగ్ కీలకంగా మారనుంది. విజయవాడ ఈస్ట్, పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.. అలాగే పెడన, మైలవరం నియోజకవర్గాల్లో గౌడ సామాజిక వర్గం అభ్యర్థి విజయాన్ని శాసిస్తుంది.

వ్యవసాయం మీదే ఎక్కువగా ఆదారపడే కృష్ణాజిల్లాలో ఈసారి పట్టిసీమ ప్రాజెక్ట్ పుణ్యమా అని రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే కృష్ణానది ప్రవహిస్తున్న కృష్ణాజిల్లాలో చాలా చోట్ల తాగునీటికి ప్రజలు ఇప్పటికీ అల్లాడిపోతూనే ఉన్నారు. ఆఖరికి విజయవాడ సిటీలో కూడా చాలా చాలా ప్రాంతాల్లో ఈనాటికి సరైన తాగునీరు అందడం లేదు. తిరువూరు నియోజకవర్గంలో అయితే ఫ్లోరైడ్ సమస్య, అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు అల్లాడి పోతూనే ఉన్నారు. అటు నందిగామ, జగ్గయ్యపేటలోనూ నదీ పక్కనే ఉన్న మండలాల్లో ఇప్పటికీ కృష్ణా జలాలు అందడం లేదు.. మచిలీపట్నం నియోజకవర్గంలో పోర్టు నిర్మాణం అనేది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి పోర్టు పనులు ప్రారంభించినప్పటికీ అది ఎన్నికలముందు చేసిన హడావిడే తప్ప మరోకటి కాదు అనేది అక్కడి ప్రజలు చెబుతున్న మాట..

రాజకీయంగా జంప్ జిలానీలు మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ కాస్త తక్కువే.. రాజకీయాలను కుదిపే సేంత బలమైన రాజకీయనాయకులెవరూ పార్టీలు మారలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిలో కొంతమంది ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీలో ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన సీట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయిస్తోంది.కుల ప్రభావం ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది.. ముఖ్యంగా కులాల ఈక్వేషన్లు బ్యాలన్స్ చేసుకుంటోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో కమ్మ కుల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఇతర కులస్థులను బరిలోకి దింపి ఓటమి పాలయింది వైసీపీ. అందుకే ఈసారి ఆ నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గ అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. ఇక జనసేన పరిస్థితి ఏంటన్నది చూడాల్సి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన ఆ పార్టీ ఈ సారి సింగిల్ గా పోటీ చేస్తుందా లేక ఏదో ఒక పార్టీకి మద్దతిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
నియోజకవర్గాల వారీ విశ్లేషణ part-2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here