ఆ నియోజకవర్గంలో తండ్రి ఎమ్మెల్యే .. పెత్తనం మాత్రం ఆయన కుమారుడిది.. అక్కడ ఏ పని జరగాలన్నా ఆ రాజకీయ వారసుడి కనుసన్నల్లో జరగాల్సిందే .. దాంతో ఆ నియోజకవర్గం అంతా ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది… అంతా తానే చూసుకుంటూ ఉండటంతో ఆయనకు షాడో ఎమ్మేల్యే గా ముద్ర పడింది..ఈ తండ్రి కొడుకుల పై ఖమ్మం జిల్లా అంతటా ఆసక్తికర చర్చ నడుస్తుంది…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా … కొత్తగూడెం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా ముద్రపడిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పుత్రరత్నం వనమా రాఘవ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది… ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తానే తెలియజేయడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో .. ఎమ్మెల్యే కూర్చునే కుర్చీలో కూర్చొని షాడో ఎమ్మెల్యేగా మరోసారి దర్శనమిచ్చారాయన … అంతేనా పార్టీ సభ్యత్వం లేని వారిని కూడా తనతో పాటు ప్రెస్ మీట్ లో కూర్చోబెట్లుకుని టిఆర్ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చారు ..
ఏ పదవిలో లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలను మీడియాకి వివరించడానికి.. డిపిఆర్ఓ అధికారిని వాడుకోవడం రాఘవ స్టైల్ .. గతంలోనూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అనేక వివాదాల్లో ఇరుక్కున్న ఘనుడీయన .. ఇప్పటికే అధికార దుర్వినియోగం చేస్తూ ఫారెస్ట్ అధికారులను బెదిరించారని ఫారెస్ట్ అధికారులు కేసులు కూడా పెట్టారు ..
మొన్నీమధ్య ఏకంగా మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్యకర్తల బర్తడే వేడుకులు జరిపి దాన్ని ఫంక్షన్ హాల్ చేసేసారు రాఘవ .. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగినప్పుడు కూడా ఆయన ఓవర్ యాక్షన్‌తో ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పడిన ఘటనలున్నాయి .. ఆ పెత్తనం కోసమే ఆయన తండ్రిపై వత్తిడి తెచ్చి గెలిపించిన పార్టీని వదిలేలా చేసారన్న టాక్ ఉంది.. కాంగ్రెస్ టికెట్‌తో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం టిఆర్ఎస్లో కొనసాగుతున్నారు.. టీఆర్ఎస్ చేరిన తర్వాత ఆయన కొడుకు టిఆర్ఎస్ కార్యకర్తలపై పెత్తనం చలాయించడం.. అధికారులపై వత్తిడి పెంచడం కామన్ అయిపోయిందంట..
తన మితిమీరిన ప్రవర్తనతో అనేక వివాదాల్లో తలదూరుస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి తలనొప్పిగా మారాడంట ఆ పుత్రరత్నం … రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే అంతో ఇంతో క్రమశిక్షణ ఉండాలి .. అందర్నీ కలుపుకుని పోవాలి .. లౌక్యంగా కాగల కార్యాలు నెరవేర్చుకోవాలి .. అయితే వీటిలో ఏ ఒక్క లక్షణం ఆయనలో కనపడదని .. ఆయన్ని దగ్గరగా చూసిన వారు చెపుతుంటారు .. అలాంటి వ్యక్తి తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడం కష్టమే అన్న టాక్ కూడా లోకల్‌గా వినిపిస్తుంటుంది .. ఇక గులాబీ శ్రేణులైతే .. ఇతనా మన ఫ్యూచర్ లీడర్ అని.. సెటైర్లు వేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారులో వనమా వెంకటేశ్వరరావు మంత్రిగా కూడా పనిచేవారు.. అప్పుడు కూడా కొడుకు పెత్తనం ఒక రేంజ్లో సాగిందంట.. అందుకే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు 15 సంవత్సరాలు వనమా వెంకటేశ్వరరావుని పదవికి దూరం పెట్టారన్న విమర్శలు ఉన్నాయి.. అయినా రాఘవ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని.. ఉద్యోగుల దగ్గరనుంచి ప్రతిఒక్కరు తన కనుసన్నలలో నడవాలన్నట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు … ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని… రాఘవ దూకుడుకి అడ్డుకట్ట వేయకపోతే నియోజకవర్గంలో పార్టీకి కష్టాలు తప్పవంటున్నాయి గులాబీ శ్రేణులు .. పార్టీ సంగతేమో కాని ఎమ్మెల్యే వనమా ఈ సన్స్ట్రోక్ని ఎలా తప్పించుకుంటారో చూడాలి..