Home News Stories

వైసీపీలోకి కొణతాల రాకతో…విశాఖలో‌ సీన్ మారేనా…!

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు హైదరాబాద్‌ నుంచి వైసీపీ ఉన్నత స్థాయి బృందం ఒకటి విశాఖ వచ్చినట్లు తెలిసింది. కొన్నాళ్లుగా ఆయన టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ పార్టీ తరపున అనకాపల్లి లోక్‌సభ టికెట్‌ కూడా ఆశించినట్లు సమాచారం. కానీ ఆడారి ఆనంద్‌ అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు వార్తలు రావడంతో కొణతాల నొచ్చుకున్నట్లు తెలిసింది. తనతో మాట మాత్రం చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించారని.. అందుచేత ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటున్నట్లు వైసీపీ నేతలకు సమాచారం అందించారు.

ఆగమేఘాలపై స్పందించిన వైసీపీ అధిష్ఠానం వెంటనే ఒక బృందాన్ని గురువారం విశాఖపట్నం పంపించింది. పార్టీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఇస్తామని ఆ బృందం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు కొణతాల కూడా అంగీకరించినట్లు తెలిసింది. అయితే టీడీపీలో ఉన్న తన అనుచరుడు గండి బాబ్జీకి పెందుర్తి అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన వైసీపీ నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం కొణతాలను హైదరాబాద్‌లోని లోట స్‌పాండ్‌కు తీసుకెళ్లి.. జగన్‌తో మాట్లాడించి పార్టీలోకి తిరిగి వచ్చినట్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో కొణతాల వైసీపీలోనే ఉన్నారు. అప్పుడు ఆయనకు పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించింది.

విశాఖ ఎంపీగా పోటీకి దిగిన జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మి గెలుపు బాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపింది. కానీ ఆమె ఓడిపోయారు. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 3 స్థానాల్లోనే వైసీపీ గెలిచింది. ఈ ఓటమికి కొణతాల బాధ్యతారాహిత్యమే కారణమని జగన్‌ భావించారు. ఆయనతో మాటలు తగ్గించేశారు. తదనంతరం కొణతాలను పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ‘ఉత్తరాంధ్ర చర్చా వేదిక’ను ఏర్పాటుచేసి మూడు జిల్లాల్లోని సమస్యలపై కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. వైసీపీలోకి మళ్లీ వెళ్లాలని యత్నించారు. వైవీ సుబ్బారెడ్డి తదితరులు సానుకూలంగా స్పందించినా జగన్‌ మాత్రం వ్యతిరేకించారని తెలిసింది.

దీంతో కొణతాల తెలుగుదేశం వైపు దృష్టిసారించారు. మంత్రి అయ్యన్నపాత్రుడి ద్వారా సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరతానని మాటిచ్చారు. అనకాపల్లి ఎంపీ సీటుపై ఆసక్తి కనబరిచారు. 17న విశాఖపట్నంలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఈలోపే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆనంద్‌ పేరు ఖరారుచేశారని వార్తలు రావడంతో కొణతాల తన నిర్ణయం మార్చుకున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ గురించి చెప్పడానికి ఆయన అనకాపల్లిలో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఎంపీగా పోటీచేసే తనకు ఆ స్థోమతు లేకపోయినా ప్రజల కోసం ఓ మెట్టు దిగి పోటీ చేస్తానని, ఇది మీకు ఇష్టమేనా అని సభకు వచ్చిన అభిమానులను ప్రశ్నించారు. వారు అంగీకారమేనని చెప్పారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని ముగించారు. ఆయనపై బహిష్కరణను వైసీపీ శుక్రవారం ఎత్తివేయనున్నట్లు సమాచారం. శనివారం టికెట్‌ ప్రకటిస్తారని.. ఆదివారం నర్సీపట్నంలో జరిగే సభలో జగన్‌తో పాటు వేదిక పంచుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి.


కొణతాల మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. ఆయన కంటే ముందే ఇటీవల ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కొణతాల కాంగ్రెస్‌లో ఉండగా.. దాడి టీడీపీలో ఉండేవారు. అనకాపల్లిలో ఇద్దరికీ రాజకీయంగా అసలు పొసగదు. గత ఎన్నికల ముందు దాడి తన కుమారుడు రత్నాకర్‌తో కలిసి వైసీపీలో చేరారు. విశాఖ పశ్చిమ సీటును రత్నాకర్‌కు ఇచ్చారు. కొణతాల తమ్ముడు అనకాపల్లిలో పోటీచేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అనంతరం దాడి వైసీపీకి దూరంగా ఉండిపోయారు. టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మళ్లీ వైసీపీకి వెళ్లిపోయారు. ఈ దఫా రత్నాకర్‌కు అనకాపల్లి సీటును ఆయన ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొణతాల తిరిగి వైసీపీలోకి రావడంతో దాడికి ఏమీ పాలుపోవడం లేదు. రత్నాకర్‌కు అనకాపల్లి అసెంబ్లీ టికెట్‌ ఖరారవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here