Home News Stories

కోనసీమ సీట్ల పై తమ్ముళ్ళలో సిగపట్లు…

టీడీపీలో సరికొత్త సంప్రదాయం మొదలైంది. ఎప్పుడూ లేనంత స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కనిపిస్తోంది. అధిష్ఠానంతో సంబంధంలేకుండా టిక్కెట్‌ తనదేనని కొందరు ప్రకటిస్తుంటే.. ఈసారి నేనూ పోటీచేస్తానని మరికొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితి గతానికి భిన్నం. టికెట్ల విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ జిల్లా నాయకులెవరూ స్వయం ప్రకటనలు చేసే సంస్కృతి ఉండేది కాదు. ఈ సారి జిల్లాలో అరడజను మంది నాయకులు టిక్కెట్‌ తమదేనంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ పరిణామాలు టీడీపీ కేడర్‌లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.

జిల్లాలో వైసీపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. జనసేన కొత్త ముఖాలను పోటీకి నిలపాలని దృష్టిసారిస్తోంది. ఈ తరుణంలో టీడీపీలో మాత్రం మరొక విధమైన పోకడ కనిపిస్తోంది. అరవై, డెబ్బయ్‌ ఏళ్ల వయసుదాటిన వాళ్లూ తాము పోటీకి సై అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు 9 ఏళ్లపాటు సీఎంగా ఉన్నప్పుడు పార్టీలో చాలా క్రమశిక్షణ ఉండేది. ఇష్టం వచ్చినట్టు స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కొంత పరిస్థితి మారింది. ఇష్టం వచ్చినట్టు నేనే మళ్లీ పోటీచేస్తానని ఒకరు, టికెట్‌ నాదేనంటూ ఇంకొకరు.. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వారు స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు.


ఇది మంచి పరిణామం కాదు.. ఎవరికి టికెట్‌ ఇవ్వాలనేది అధిష్ఠానం చూసుకుంటుంది. ఈ పరిణామాలు పార్టీ కేడర్‌లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. కట్టడి చేయడంపై అధిష్ఠానం దృష్టిపెట్టాలి..’’ అని టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. అమరావతి ఓ వైపు, పోలవరం ఇంకోవైపు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు.. చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయ్‌. దీంతో పార్టీపై పూర్తి స్థాయి దృష్టిసారించలేకపోతున్నారు. ఇదే అదునుగా కొందరు నాయకులు సొంత పెత్తనం చేయాలని చూస్తున్నారని ఇంకో నేత చెప్పడం విశేషం.

మళ్లీ రాజమండ్రి ఎంపీగా టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ నేను మళ్లీ పోటీచేసి గెలుస్తా.. టికెట్‌ నాదే అంటూ కొన్ని నెలల కిందట రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ స్వయంగా ప్రకటించుకున్నారు. అప్పటివరకు ఎంపీగా ఆయన కోడలు రూపాదేవిని టీడీపీ నిలబెడుతుందన్న ప్రచారం సాగింది. మురళీమోహన్‌కి ఎన్నికల నాటికి ఎనభై ఏళ్లు వస్తాయని, పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని కొన్నాళ్ల కిందట టీడీపీ పెద్దలలోనే చర్చ నడిచింది.

పెద్దాపురం నుంచి 2019లో మళ్లీ నేనే పోటీచేస్తాను. ఎవరెవరో ఏవేవో చెప్తున్నారు. ఖచ్చితంగా టికెట్‌ నాదే. పోటీచేసి గెలవడం ఖాయం… అంటూ డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప ఇప్పటికే చాలాసార్లు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పలు బహిరంగ సభలలోనూ పెద్దాపురం నుంచే పోటీ అని పదేపదే ప్రకటించుకుంటున్నారు. రాజప్ప బాటలోనే ఆయన రాజకీయ శిష్యుడు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, సీనియర్‌ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు కూడా తామే పోటీ చేస్తున్నట్టు ప్రకటించేసుకున్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు.. 2019 ఎన్నికలలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, మంత్రి కూడా అవుతానంటూ చేసిన ప్రకటనలు కోనసీమ టీడీపీలో కలకలం రేపాయి.


1983లో తుని, తాళ్లరేవు, రాజమహేంద్రవరం నుంచి యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్‌ టికెట్లు ఇచ్చారు. అప్పుడు 28-33 సంవత్సరాల మధ్య వయస్కులు వీళ్లు. అప్పటికే క్రియాశీల రాజకీయాలలో ఉన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తదితరులూ నేటికీ క్రియాశీలకంగానే ఉన్నారు. నాలుగుసార్లు రంపచోడవరం ఎమ్మెల్యేగా చేసిన శీతంశెట్టి వెంకటేశ్వరరావు మళ్లీ టికెట్‌ కావాలంటున్నారు. ఇలా వయసుమళ్లిన వాళ్లంతా టీడీపీ టికెట్ల కోసం ఆశపడుతున్నారు. 1982లోనే సమితి అధ్యక్షుడిగా చేసిన బొడ్డు భాస్కరరామారావు కూడా ఇంకా ఎమ్మెల్యే సీటుపై ఆశలుపెట్టుకున్నారు. వైసీపీ, జనసేన యువత, మధ్యవయస్కులకు ప్రాధాన్యత ఇస్తుంటే.. టీడీపీ మాత్రం వృద్ధతరాన్ని ఇంకా వదల్లేకపోతోందనే వాదన వినిపిస్తోంది.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు గన్ని కృష్ణకు ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. ఇపుడు గుడా చైర్మన్‌గా చేశారు. 2019 ఎన్నికలలో పోటీచేస్తానని తాజాగా కృష్ణ ప్రకటించుకున్నారు. పల్లకీ మోసే ఓపికలేదంటూ.. ఇక పోటీ అనివార్యమన్న రీతిలో గన్ని రాజమహేంద్రవరంలో ప్రకటించడంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఇలా జిల్లాలో పలువురు సీనియర్లు, వృద్ధ నేతలు ఎవరికి వారే టికెట్లు ప్రకటించుకోవడంపై రాజకీయ వర్గాలలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు. రెండు, మూడుసార్లు టీడీపీలోకి రావడం, మళ్లీ పార్టీ వదిలిపోవడం చేసిన నేత. 75 ఏళ్ల వయసులోనూ తాను చురుగ్గానే ఉన్నానని, యువకులు నాతో పనిచేయాలంటూ సవాల్‌ చేస్తుంటారు. మళ్లీ ప్రత్తిపాడు నుంచి పోటీచేస్తానని ఇటీవల పలు సభలలో ప్రకటించుకున్నారు. డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా ప్రత్తిపాడు టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. రాజా, సుబ్బారావుకి అన్న మనవడు. తన తాత వరుపుల జోగిరాజు ఎమ్మెల్యేగా చేశారని, చినతాత ఇపుడు ఎమ్మెల్యేగా ఉన్నారని, తర్వాత 2019లో తనకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here