Home News

కోమటిరెడ్డి బ్రదర్స్‌ కొత్త ప్లాన్ వర్కవుటవుతుందా…!

తెలంగాణ పీసీసీ నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టులో చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పదవులు అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలు బయట పెడతానని చెప్పారాయన. పార్టీ కార్యకర్తలు తన రాజకీయ పయనాన్ని నిర్దేశిస్తారని కూడా ఓ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు అన్న చర్చ మళ్లీ ఊపందుకుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. పీసీసీ వస్తుందని.. ఇన్నాళ్లూ కాన్ఫిడెన్స్‌తో ఉన్న వెంకట్ రెడ్డికి అధిష్ఠానం హ్యాండ్ ఇచ్చింది. ఇక పార్టీ మారే ఆలోచనలో ఎంపీ కోమటిరెడ్డి ఉన్నట్టు ప్రచారం ఈసారి కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఆయన సోదరుడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ పయనంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాదు దేశంలో కూడా కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని గతంలోనే ప్రకటించి సంచలనం రేపారు. కాకపోతే పీసీసీ నియామకం తర్వాత వెంకటరెడ్డి వైఖరికి భిన్నంగా స్పందించారు సోదరుడు. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా పార్టీ ప్రకటించిందన్నది రాజగోపాల్‌రెడ్డి కామెంట్‌. ఇందులో వివాదం ఏదీ లేదని తెలిపారు. పీసీసీపై అన్నదమ్ములిద్దరూ భిన్నంగా స్పందించినా.. వారి రాజకీయ భవిష్యత్‌పై చర్చ ఆగడం లేదు.ఈ ఇద్దరు కీలక నేతలు కమలం గూటికి చేరతారా అన్న చర్చ మొదలైంది.

ఎంపీ వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాలేదన్న కోపంలో ఉన్నారు. తన ఆవేదనంతా మీడియా ముందు వెళ్లగక్కారు. సోనియా, రాహుల్‌ గాంధీలను ఏమీ అనను అని చెబుతూనే.. ఇంఛార్జ్‌ ఠాగూర్‌తోపాటు..కేసీ వేణుగోపాల్‌పై కాస్త ఘాటుగానే స్పందించారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రముఖులు వెంకటరెడ్డితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీలో ఆయనకు పదవులు ఆఫర్‌ చేస్తున్నారట. అయినప్పటికీ ఎంపీ సంతృప్తి చెందడం లేదని టాక్‌. పైగా ఢిల్లీ టూర్‌లో కాంగ్రెస్‌ పెద్దలను కలుస్తారో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీలోకి వెళ్తారన్నది కొందరి అభిప్రాయం. వెంకటరెడ్డి మాత్రం దానికి అవునని కానీ..కాదని కానీ స్పందించడం లేదు. ఢిల్లీ పర్యటన తర్వాత స్పష్టత ఇవ్వొచ్చని అనుకుంటున్నారట. ఢిల్లీలో జాతీయ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్న తర్వాత తన ఆలోచనలను కార్యకర్తలకు చెప్పే అవకాశం ఉందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరన్న సంగతి కాంగ్రెస్,బీజేపీలకు తెలుసు కాబట్టి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here