Home News Stories

తెలంగాణ పొలిటికల్ లీగ్…కొడంగల్ దంగల్ ఎవరి పక్షం…!- 2

తెలంగాణ ఎన్నికల్లో హాట్ డిస్కషన్, హాట్ సీట్ అంటే కొడంగల్. అభివృద్దికి ఆమడ దూరంగా, రాజకీయ సంచనాలకు కేంద్రంగా ఉండే కొడంగల్… పొలిటికల్ టెంపరేచర్‌తో అట్టుడుకుతోంది. తెలంగాణలో ఓ మూలకు విసిరేసినట్లు ఉండే ఈ నియోజకవర్గం మీద ఏకంగా టీఆర్ఎస్ అధినేతతో పాటు మిగతా సీనియర్ నేతలంతా దృష్టి పెట్టారు. ఇదేమీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు. కొడంగల్ రాజకీయం రెండేళ్ల క్రితమే మొదలైంది. అది అలా మండుతూ మండుతూ ఇప్పుడు పీక్ స్టేజ్‌కి చేరింది.

కొడంగల్‌లో అభివృద్ధి వర్సెస్ అత్మ గౌరవం అనే నినాదాన్ని వినిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. నియోజకవర్గంలో గతం ఎన్నడూ లేని విధంగా… అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏడాది నుంచి నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఆపరేషన్ కొడంగల్ అమలు చేస్తోంది. పక్క పార్టీల్లో కీలక నేతలందరినీ కారు పార్టీలోకి లాగేసే కార్యక్రమం విస్తృతంగా అమలు చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. కొడంగల్‌లో నిజంగానే అంత స్థాయిలో అభివృద్ధి జరుగుతోందా?.

కొన్ని నియోజకవర్గాల్లో తాము గెలవాలని అభ్యర్థులు, అధినేత కలిసి కసితో పని చేయడం ఇన్నాళ్లూ మనం చూస్తున్న రాజకీయం. కానీ కొడంగల్‌లో ప్రత్యర్థిని ఓడించాలనే కసి ఎక్కువగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని ఓడించాలనే పట్టుదల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు టీఆర్ఎస్ నాయకత్వం. ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై నేరుగా విమర్శలు చేస్తూ అధికార పార్టీకి కొరకరానికి కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిని ఓడించాలని ఏడాది నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. బలమైన అభ్యర్థిని నిలబెడితే సగం విజయం సాధించినట్లే అని భావించిన కేసీఆర్.. ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్లో బరిలోకి దించారు.

నిన్నటి వరకూ కాంగ్రెస్‌లో ఉన్న గుర్నాథ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరారు. కొడంగల్‌ నుంచి ఐదుసార్లు గెలిచిన గురునాథ్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ… అనూహ్యంగా పట్నం నరేందర్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆపరేషన్ కొడంగల్ పేరుతో గత ఏడాదిగా అక్కడ అభివృద్ది పనుల పేరుతో పోలిటికల్ మైండ్ గేం ను ప్రారంభించింది అధికార పార్టీ. అందులో భాగంగా ఓ వైపు రేవంత్‌ ను , కాంగ్రెస్ ను టార్గెట్‌ చేస్తూ సర్కారు బలగాన్నంతా అక్కడ మొహరించింది. అభివృద్ధి, సంక్షేమం- ఆకర్ష్.. ఇలా ముక్కోణపు వ్యూహంతో.. ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతోంది కారు పార్టీ. రేవంత్ ఆరోపిస్తున్నట్లు ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని.. అభివృద్ధి నినాదంతో కొడంగల్‌లో టీఆర్ఎస్ జండా ఎగరేస్తామంటున్నారు పార్టీ అభ్యర్థి.

కొడంగల్‌ నియోజక వర్గం లోని కోస్గి, ముగ్దనూరు మండలాలు మహబూబ్నగర్ లో ఉండటం తో ఆ జిల్లా మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి ఆ మండలాల్లోని కాంగ్రెస్ టీడిపి కార్యకర్తలను ఏడాది నుంచే కారెక్కెంచే పనిలో వున్నారు. కొడంగల్, బొంరాస్‌ పేట, దౌల్తాబాద్ మండలాల్లో పార్టీ ప్రచార బాధ్యతను హరీష్ రావు, పట్నం మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్ లో పొలిటికల్ ఈక్వేషన్లన్ని మినిట్ టూ మినిట్ రిసోర్ట్ ను సీఎం కాంప్ కార్యాలయానికి చేరవేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఇన్నాళ్లూ ఎలా ఉన్నా… పోలింగ్‌కు గడువు దగ్గర పడే కొద్దీ కొడంగల్ రాజకీయం ఊహకందని మలుపులు తిరుగుతోంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. రేవంత్‌ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ అన్ని అస్త్రాలన ప్రయోగిస్తుంటే.. క్యాడర్‌ను కాపాడుకోవడంతో పాటు… పార్టీలో తన ఇమేజ్‌కు తగ్గట్లుగా వ్యవహరించడానికి రేవంత్‌ రెడ్డి కత్తిమీద సాము చేస్తున్నాడు.

రేవంత్ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన రోజునే ఆయన ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా.. ఎవరి అవసరం లేకుండా.. తన నియోజకవర్గంలొ తానొక్కడినే ప్రచారం చేసుకుని గెలిచే సత్తా ఉందన్న ధీమాలో రేవంత్‍ ఉన్నారు. టీఆర్‌ఎస్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తన సోదరులు కొండల్ రెడ్డి, తిరుమల్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. కొడంగల్, కోస్గి, మద్దూర్, దౌలతాబాద్, ముగ్దనూరు మండలాల్లో క్యాడర్‌ని కాపాడుకునేందుకు 70 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కొడంగల్ నియోజకవర్గం అంతటా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కొత్త వాహనాలన్నింటినీ అధికారులు ఆమూలాగ్రం సోదాలు చేస్తున్నారు. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్ట్ ఉంది. టీఆర్ఎస్ నేతలు మహిళా సంఘాలు, రైతులు, గ్రామ సర్పంచ్‌ల ద్వారా డబ్బులు పంచుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

టీఆర్ఎస్ గుర్నాధరెడ్డిని నమ్ముకున్నట్లే…. రేవంత్ రెడ్డి దివంగత మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావు వర్గీయులుతన వైపు తిప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో విఠల్ రావుకి 30వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రజా కూటమి తరపున టీడీపీ- కాంగ్రస్ కలిసి పోటీ చేస్తూ ఉండటంతో… రెండు పార్టీల ఓటు బ్యాంక్ తనకు పడితే… తేలిగ్గా బయటపడతానని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ పూర్తి స్థాయి ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన ఇప్పటికీ కొన్ని గ్రామాలకు వెళ్లలేదు. పార్టీలో కీలకంగా మారడంతో… ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని… రేవంత్ ఉన్నా లేకున్నా ఆయన కోసం కష్టపడి పని చేస్తామటున్నారు అనుచురులు, సోదరులు….

కాంగ్రెస్- టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, బీఎల్‌ఎఫ్, స్వతంత్రులు, రెబల్స్ కొడంగల్‌ బరిలో ఉన్నారు. మిగతా పార్టీల ప్రభావం అంతంత మాత్రమేనని గతంలో జరిగిన ఎన్నికలు సూచిస్తున్నాయి. ఈ పార్టీల వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here