Home News Politics

తాటాకు చప్పుళ్లు కాదు…

టీఆర్ఎస్‌కి తొడ‌గొట్టిన ప్రొఫెస‌ర్‌

వాడెంత‌..వీడెంత అంటూ ఎవ‌ర్న‌యినా పూచిక‌పుల్ల‌లా తీసిపారేసే టీఆర్ఎస్ అధినేత‌కు తెలంగాణ‌లో తొడ‌గొట్టి ఎదురునిలిచారు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. మొన్న‌టిదాకా టీజేఏసీ ఛైర్మ‌న్‌గా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్ని ఎత్తిచూపించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను గుర్తుచేస్తూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు ఆయ‌న ఓ రాజ‌కీయ‌పార్టీకి అధినేత‌. న‌లుగుర్ని వెంటేసుకుని జిందాబాద్‌లు కొట్టించుకుని మ‌ళ్లీ ఎప్పుడోగానీ క‌నిపించ‌ని పార్టీ కాదు. జ‌నంలోనే ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల‌క‌ల్లా తెలంగాణ స‌మాజాన్ని చైత‌న్య‌ప‌రిచి అధికారంలోకి రావాల‌నుకుంటున్న పార్టీకి అధ్య‌క్షుడు. తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీని పెట్టి, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వేల‌మందితో కోదండ‌రాం నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ‌స‌భతో టీఆర్ఎస్‌లో టెన్ష‌న్ మొద‌లైంది.
కాంగ్రెస్ నేత‌ల్ని ఏకిపారేసినా, ఆంధ్రాపార్టీ అంటూ టీడీపీ గాలితీసేసినా ఇన్నాళ్లూ న‌డిచింది. కానీ కోదండ‌రాం విష‌యంలో కేసీఆర్ అండ్ కో కొత్త వ్యూహాలేమ‌న్నా ప‌న్నాల్సిందే. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో, స‌క‌ల‌జ‌నుల్నీ ఉద్య‌మంలో భాగ‌స్వాముల్ని చేయ‌డంలో టీజేఏసీ పాత్ర మ‌ర్చిపోలేనిది. కోదండ‌రాం ఉద్య‌మ‌స్ఫూర్తిని తెలంగాణ స‌మాజం మ‌ర్చిపోలేదు.

ఎన్నిక‌ల‌ముందు వ‌ర‌కు కోదండ‌రాంతో స‌న్నిహితంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత అధికారంలోకొచ్చాక ఆయ‌న్నెందుకు ప‌క్క‌న‌పెట్టారో, ఎందుకు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికీ అర్ధంకాని విష‌య‌మే.ఇక తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ ఆవిర్భావ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టించేందుకు చేసిన ప్ర‌య‌త్నం విద్యార్థులు, మేథావుల్ని, ప్ర‌జాసంఘాల్ని ఆగ్ర‌హానికి గురిచేసింది. అయినా కోర్టుకెక్కి అనుమ‌తి తెచ్చుకుని కోదండ‌రాం బ‌హిరంగ‌స‌భ‌ను స‌క్సెస్ చేయ‌ట‌మే కాదు…వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని చాటిచెప్ప‌టం గులాబీ నేత‌ల గుండెల్లో గుబులు పుట్టించింది.

డ‌బ్బులిచ్చి జ‌నాన్ని త‌ర‌లించ‌డానికి అధికారం చేతిలో ఉన్న పార్టీకాదు. ఎక్క‌డిక‌క్క‌డ స‌రూర్‌న‌గ‌ర్ స‌భ‌కు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చారు. అప్ప‌ట్లో ఉద్య‌మ ఆకాంక్ష ఎంత బ‌లంగా ఉందో…అంత‌కంటే ఎక్కువ జోష్ క‌నిపించింది కోదండ‌రాం స‌భ‌లో. ఎన్నో ఏళ్ల పోరాటం త‌ర్వాత సాధించుకున్న తెలంగాణ కొంద‌రి చేతుల్లో ద‌గా ప‌డ‌కుండా చూడాల‌న్న మాటే వినిపించింది అంద‌రినోటా. కొత్త రాజ‌కీయం సృష్టించుకుందామ‌ని, తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న‌కు స‌మాధి క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ అధినేత‌. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు తలొగ్గే అధికారుల‌పై తాము అధికారంలోకి వ‌స్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.
అధికారంలోకి వ‌చ్చాక కోదండ‌రాంని ఏకాకిని చేసేందుకు టీజేఏసీకి కొన్ని వ‌ర్గాలు దూరంగా ఉండేలా చేయ‌గ‌లిగింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడాయ‌న ఏకంగా రాజ‌కీయ‌పార్టీనే పెట్టేశారు. జెండా ఎగ‌రేశారు. త‌న ఎజెండా ఏంటో చెప్పేశారు. కాంగ్రెస్‌మీదో, టీడీపీమీదో బుర‌ద చ‌ల్లినంత సుల‌భం కాదు కోదండ‌రాంని టార్గెట్ చేయ‌డం. ఎందుకంటే ఇప్ప‌టిదాకా ఆయ‌న ఏ రాజ‌కీయ ప‌ద‌విలో లేరు. విద్యార్థిలోకం అసంతృప్తితో ర‌గిలిపోతోంది. ప్ర‌భుత్వ అణ‌చివేత ధోర‌ణిపై ప్ర‌జాసంఘాలు భ‌గ్గుమంటున్నాయి.

కోరుకున్న‌దేమిటి…జ‌రుగుతున్న‌దేమిట‌నే దానిపై మేథావివ‌ర్గంలో సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది ముందు తెర‌పైకొచ్చిన తెలంగాణ జ‌న‌స‌మితిని అంత తేలిగ్గా తీసేయ‌డానికి లేదు. బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌చిక్కితే ఏమ‌వుతుందో సామెత‌లు అల‌వోక‌గా వ‌ల్లెవేసే పెద్ద‌ల‌కు ఒక‌రు చెప్పాల్సిన ప‌న్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here