Home News Politics

ఉత్తరాంధ్ర టీడీపీలో చిచ్చు రేపుతున్న ఆ కాంగ్రెస్ నేత చేరిక…

టీడీపీకి మళ్లీ వలస నేతలతో తలనొప్పులు మొదలు కాబోతున్నాయా..? గతంలో వైసీపీ నుంచి వచ్చిన వారితో పాత తరం నేతలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నేతలతో అదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొబోతున్నారా..? వివిధ జిల్లాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…

అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి భారీ స్థాయిలో నేతలను పార్టీలో చేర్చుకుని టిడిపి చాలా ఇబ్బందులు పడింది… పాతనేతలు, కొత్త వారికి మధ్య సమన్వయం కుదిర్చి .. పరిస్థితి సెట్ రైట్ చేయడానికి పార్టీ అధినాయకత్వానికి తలకు మించిన భారమైంది …ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో ఉత్తర-దక్షిణ ధృవాలుగా ఉన్న నేతలను ఒక్క తాటి మీదకు తెచ్చే ప్రయత్నాలు నెమ్మదిగా గాడిన పడుతున్నాయి… అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మళ్లీ ఇదే తరహా తలనొప్పులను టీడీపీ హైకమాండ్ మెడకు చుట్టుకోబోతున్నట్టు కన్పిస్తోంది.

ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పరిస్థితి గతంలో ఉన్నంత స్మూత్‌గా లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది… ఈ జిల్లాలో బీసీలు.. ఎస్టీలు ఎక్కువగా ఉంటారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటూ వచ్చారు … అయితే ఇప్పుడా పరిస్థితి లేదనే భావన స్థానికంగా ఉన్న నేతల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో మొదటి నుంచి టీడీపీకి అంటిపెట్టుకుని ఉన్న బీసీలు.. ఎస్టీల కంటే పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి ఇటీవల కాలంలో ఎక్కువ అయిందంటున్నారు…

జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే.. టీడీపీలోని బీసీలు, ఎస్టీలు …రాజులకు సాగిలపడాల్సిందేనా.. అనే అసంతృప్తి స్థానిక నేతల్లో బలంగా కన్పిస్తోందని అంటున్నారు. విజయనగరం సంస్థానానికి సంబంధించిన అశోక్ గజపతి రాజు చాలా కాలంగా పార్టీలో ఉంటున్నారు… తర్వాత బొబ్బిలి సామ్రాజ్యానికి చెందిన బొబ్బిలి రాజులు సుజయ కృష్ణ రంగారావు పార్టీలో చేరారు… వచ్చి రావడంతోనే ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు.. అలాగే మేరంగి రాజులుగా పేరొందిన శత్రుచర్ల విజయరామరాజు కూడా పార్టీలో చేరి.. ఎమ్మెల్సీ వంటి పదవులను పొందారు… అయినా అధిష్టానం చెపుతోంది కాబట్టి సరే అనుకున్నారు స్థానిక నేతలు. కానీ ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాలో జరుగుతున్న మరో ఎపిసోడుతో మాత్రం టీడీపీకి చెందిన ఎస్టీ, బీసీ నేతలకు తీవ్ర కలవరానికి గురవుతూ .. అసంతృప్తితో రగిలిపోతున్నట్లు కనిపిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీ దిగ్గజం.. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. ..ఇప్పుడిదే విజయనగరం జిల్లాలోని బీసీ, ఎస్టీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి… కిషోర్ చంద్రదేవ్ పార్టీలో చేరడం అంటూ జరిగితే అరకు పార్లమెంట్ సీటు కచ్చితంగా ఎగరేసుకుపోతారు. దీంతో ఆ సీటు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే … ఈ తరహా ఘటనలు ఒక్కోక్కటిగా జరుగుతూ ఉండడంతో బీసీలు.. ఎస్టీలకు చెందిన స్థానిక నేతలు తీవ్ర అసహనానికి గురి అవుతున్నట్టు కన్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు.. టిక్కెట్లు అన్ని కొత్తగా వచ్చిన వారికి.. అది రాజులకే కట్టబెట్టేలా వ్యవహారాలు నడుస్తుండడంతో …తమవి బానిస బతుకులేనా.. అనే స్థాయిలో బీసీ, ఎస్టీ నేతలు వాట్సాప్ మెసేజులు చేసుకుంటున్నారట. … కొత్తగా పార్టీలోకి వచ్చిన రాజుల వల్ల బీసీలకు.. ఎస్టీలకు చెందిన పాత తరం నేతలకు అవకాశాలు రాకుండా పోతున్నాయనేది ఆ మెసేజుల సారాంశంగా ఉంది.

బొబ్బిలి రాజులు పార్టీలో చేరడం వల్ల అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఉన్న కొప్పుల వెలమ బీసీ వర్గానికి చెందిన తెంటు లక్ష్మునాయుడుకు అవకాశం లేకుండా పోయింది… ఇక కురుపాం నియోజకవర్గం విషయాని కొచ్చేసరికి జనార్ధన్ థాట్రాజ్ సాంకేతికంగా ఎస్టీనే అయినప్పటికీ.. దొరలుగానే ఎస్టీలు ట్రీట్ చేస్తారు … ఈ క్రమంలో నిఖార్సైన ఎస్టీలకు అవకాశం రాకుండా పోతోందని అంటున్నారు… అలాగే ప్రస్తుతం ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న శత్రుచర్ల విజయరామరాజు విషయంలోనూ ఇదే తరహా భావన ఉందని అంటున్నారు…

ఇక సాలూరు నియోజకవర్గానికి చెందిన ఆర్పీ భాంజ్ దేవ్ వల్ల నిఖార్సైన ఎస్టీలకు టిక్కెట్లు దక్కడం లేదనే చర్చ ఎస్టీ నేతల్లో నలుగుతోంది … మరోవైపు పార్టీలో కొత్తగా చేరాలని సిద్దమవుతున్న కిషోర్ చంద్రదేవ్ వల్ల అరకు ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెదవి విరుస్తున్నారు… ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎస్టీలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది..

సున్నితమైన ఈ అంశంలో ఏ మాత్రం తేడా జరిగినా.. అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నాయి సదురు పార్టీ వర్గాలు… మొత్తంగా చూస్తే.. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ అధిష్టానం మరింత జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.