Home News

ఖమ్మం టీఆర్ఎస్ లో కొత్త ముసలం…!

ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బలోపేతమైన ఆ జిల్లా టిఆర్‌ఎస్‌లో కొత్త ముసలం మొదలైనట్లు కనిపిస్తోంది .. ముందునుంచి ఉన్న వారికి, కొత్తగా వచ్చి చేరిన వారి మధ్య ఆధిపత్యపోరు స్పష్టమవుతోంది … జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యే వర్గాల మధ్య వర్గ పోరు ఒక రేంజ్ లో నడుస్తుంది. సభ్యత్వ నమోదు వేదికగా జిల్లా టిఆర్‌ఎస్‌లో రోజు రోజుకి రాజుకుంటున్న అసమ్మతి గులాబీ పార్టీని గందరగోళానికి గురి చేస్తుంది…

ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్‌లో సభ్యత్వ నమోదు సందర్భంగా అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి … పాలేరు నియోజకవర్గం టిఆర్ఎస్ లో తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులుగా చెప్పుకుంటున్న పలువురు నేతలు తమ అసమ్మతిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి .. మాజీ మంత్రి తుమ్మల వర్గీయులను దరిచేరనీయడం లేదని ఆరోపిస్తున్నారు. .. ఎమ్మెల్యే కందాళ కూడా వారి ఆరోపణలపై ధీటుగానే స్పందిస్తున్నారు ..

2018 ఎన్నికలకు ముందు వర్గ పోరు, విభేదాల కారణంగానే ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిందని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు… అయినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు కనపడక పోతుండటం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది… పాలేరు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో మొదటి నుంచి టిఆర్ఎస్ లో ఉన్న వారిని పక్కన పెడుతున్నారని.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని అందలం ఎక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో విపక్షాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీకండువా కప్పేసుకున్నారు … దీంతోనే మొదలైంది అసలు వర్గపోరు… పాలేరు, వైరా, కొత్తగూడెం సెగ్మెంట్లలో టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయిన వారిని, వారి వర్గీయుల్ని … ప్రస్తుత ఎమ్మెల్యే లు పూచిక పుల్లల్లా చూస్తున్నారంట.. కనీసం తమకు పార్టీ సభ్యత్వ పుస్తకాలు కూడా ఇవ్వలేదని సదరు నేతలు వాపోతున్నారు .

ముఖ్యంగా పాలేరులో టిఆర్ఎస్ రెండు వర్గాలుగా వీడిపోయింది.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు… ఈ సమావేశానికి హాజరైన తుమ్మల నాగేశ్వరరావు … వేదికపై వలస ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉండగానే .. ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు తప్పు చేశారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి తీర్పునిచ్చారని ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్యేని టార్గెట్‌ చేశారు .. తుమ్మల ప్రసంగిస్తున్నప్పుడు ఆయన వర్గీయులు చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం వేదికపై ఉన్న ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారింది… దాంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహంతో కనిపిస్తున్నారు..
అదలా ఉంటే వర్గపోరు రాజుకుంటున్న వేళ కందాళ కూడా కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు… తాను పార్టీకి విధేయుడిగా ఉంటానని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలే తనకు ముఖ్యమని .. నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా సింగిల్ గా వెళ్లగలనని వ్యాఖ్యానిస్తున్నారు .. కొంతమంది సమావేశాలు పెట్టి వర్గాలకు కారణమవుతున్నారని … తాను ఎప్పుడు అలా వ్యవహరించలేదని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు…

నియోజకవర్గంలో తుమ్మలకు వర్గం ఉందేమో కానీ తనకు వర్గాలు అంటూ ఏమీ లేవని… అభద్రత భావం కూడా లేదని .. కందాళ అంటిస్తున్న చురకలపై తుమ్మల వర్గం గుర్రుగా కనిపిస్తోంది.. మొత్తానికి రెండు వర్గాల విబేధాలు బహిర్గతం అవడంతో ..ఇది ఎటు దారితీస్తుందోనని పార్టీ వర్గాలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు…

వైరా నియోజకవర్గంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది… కొత్తగూడెం నియోజకవర్గం లో కూడా అదే పరిస్థితి … సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది .. ఈ పరిస్థితి రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో రిఫ్లైక్ట్‌ అయి… తిరిగి అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలే చూడాల్సి వస్తుందేమో అన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.. మరి ఖమ్మం జిల్లాపై ప్రత్యేకశ్రద్ద చూపించే గులాబీబాస్‌ ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here