Home News Stories

ఖమ్మంలో హైడ్రామా…ఏ పార్టీలోనూ అభ్యర్ధి పై లేని క్లారిటీ..!

లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. ఖమ్మం స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. సిట్టింగ్‌ ఎంపీకి మళ్లీ టికెట్‌ ఇవ్వరాదన్న యోచనలో అధికార టీఆర్‌ఎస్‌ ఉంది. స్థానికంగా టీడీపీలో బలమైన నేత అయిన నామా నాగేశ్వర్‌రావు ఆ పార్టీని వీడటంతో ఆయనకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారైందన్న ప్రచారం ఉంది. కానీ, గులాబీ పార్టీ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ప్రభావం లేని టీడీపీ కూడా ఖమ్మంలో పోటీకి ఆసక్తి చూపుతోంది. సీపీఎం తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుండగా.. ఆ పార్టీకి మద్దతు తెలపాలా? లేక కాంగ్రె్‌సకు సహకరించాలా? అన్న విషయాన్ని తేల్చుకోలేని స్థితిలో సీపీఐ ఉంది. ఏ పార్టీకి ఎవరు అభ్యర్థి అవుతారో తేలని పరిస్థితి ఇది తాజాగా ఖమ్మం పార్లమెంట్ రాజకీయం…

మొత్తంగా అభ్యర్థుల విషయంలోనే గందరగోళం నెలకొనడంతో ఖమ్మంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులే ఇందుకు కారణంగా మారాయి. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాలేరు, మధిర, కొత్తగూడెం… టీడీపీ సత్తుపల్లి, అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ ఖమ్మం స్థానాల్లో గెలుపొందాయి. వైరాలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి గెలుపొందారు. లోక్‌సభ నియోజకవర్గం యూనిట్‌గా చూస్తే ప్రజాఫ్రంట్‌కు టీఆర్‌ఎస్‌ కంటే 5.8 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు నేతలు పోటీ పడ్డారు. పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, పార్టీ నేత, స్థానిక గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర, వీవీసీ మోటర్స్‌ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు టికెట్‌ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సైతం ఖమ్మం సీటు పట్ల ఆసక్తి కనబరిచినట్లు చెబుతున్నారు. గతంలో ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా తనవంతు ప్రయత్నాలు చేశారు. ఏఐసీసీ స్ర్కీనింగ్‌ కమిటీ వడపోత తర్వాత.. రాజేంద్రప్రసాద్‌, నామా పేర్లు షార్ట్‌ లిస్టు అయ్యాయి. రేణుకా చౌదరికి టికెట్‌ ఇవ్వరాదంటూ కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఆమె పేరును రాష్ట్ర నాయకత్వం స్ర్కీనింగ్‌ కమిటీ ముందుకే తీసుకెళ్లలేదు.

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై పరిశీలన జరుగుతుండగానే రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇవి ఖమ్మంకు కూడా తగలడంతో స్థానికంగా రాజకీయాలే మారిపోయాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు, కందాల ఉపేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఒకరి వెనకాల మరొకరు టీఆర్‌ఎ్‌సకు జై కొట్టారు. దీంతో ప్రస్తుతం అక్కడ కాంగ్రె్‌సకు భట్టి విక్రమార్క, టీడీపీకి మెచ్చా నాగేశ్వర్‌రావు మాత్రమే మిగిలారు. ఒక్క సీటు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ బలం ఐదుకు చేరుకుంది. అయినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్‌.. ఖమ్మంలో చతికిలబడటానికి కారణం స్థానికంగా పార్టీలో వర్గపోరేనని ఆయన భావిస్తున్నారు. పార్టీ సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పై స్థానిక నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనకు ఈసారి టికెట్‌ దక్కే అవకాశం లేదని, ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ఆశావహుల జాబితాలో ఉన్న రాజేంద్రప్రసాద్‌ పేరును పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా కొనసాగుతుండగానే.. టీడీపీ నేత నామా నాగేశ్వర్‌రావు పేరు కాంగ్రెస్‌ నుంచి ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇందుకు ఆయన సుముఖత చూపలేదు. పైగా ఆయన సీఎం కేసీఆర్‌ను కలవడం, టీడీపీకి రాజీనామా చేయడంతో టీఆర్‌ఎస్‌ తరఫున నామా పేరు దాదాపు ఖరారైందని చెబుతున్నారు.

నామా, రాజేంద్రప్రసాద్‌లు జారిపోవడం, పార్టీ ఎమ్మెల్యేలూ టీఆర్‌ఎస్‌ బాట పట్టడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్ణయం మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా రేణుకా చౌదరి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్‌రావు పేర్లను కాంగ్రెస్‌ పార్టీ పరిశీలిస్తోంది. రేణుక అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు వనమా, ఉపేందర్‌రెడ్డి ఇద్దరూ టీఆర్‌ఎ్‌సకు జైకొట్టడంతో.. టికెట్‌ రేసులో ఉన్న ఈ ముగ్గురికీ సమాన అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామాకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారైతే.. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేరు కూడా కాంగ్రెస్‌ పరిశీలనలో ఉంటుందని అంటున్నాయి.

ఇలా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థు విషయమే తేలకపోగా.. మరోవైపు టీడీపీ కూడా పోటీకి ఆసక్తి ప్రదర్శిస్తోంది. టీడీపీ అధిష్ఠానం అనుమతిస్తే బరిలోకి దిగేందుకు ఆ పార్టీ నేత కోనేరు చిన్ని సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సీపీఎం అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్‌ను దింపుతున్నారు. ఆయనకు మద్దతివ్వడమా? కాంగ్రెస్‌ అభ్యర్థికే సంఘీభావం తెలపడమా అన్నదానిపై సీపీఐ ఇంకా తేల్చుకోలేదు. మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక కూడా ఖమ్మంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here