Home News Stories

ఖమ్మం గుమ్మంలో రసవత్తర పోరు…!

విప్లవ రాజకీయాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేసేందుకు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేతలంతా ముకుమ్మడిగా కారు ఎక్కడంతో విజయం పై గులాబీ దళం ధీమాగా ఉంది. అయితేవలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌ మళ్లీ రేణుకా చౌదరిని రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే.. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో నాయకులు, ఎమ్మెల్యేలు, కేడర్‌తో పరిపుష్టంగా కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించిన గులాబీ దళానికి పెద్ద బలగమే కనిపిస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాములు నాయక్, జెడ్పీ చైర్మన్‌ కవిత, డీసీసీబీ మాజీ చైర్మన్‌ విజయబాబు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు అండగా ఉన్నారు.

అయితే నామా అభ్యర్థిత్వమే ఇక్కడ సమస్య అవుతుందా అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గ ప్రజలు గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీ నుంచి తీసుకువచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామాను బరిలోకి దించడం సామాన్య ప్రజలతో పాటు టీఆర్‌ఎస్‌ కేడర్‌కు కూడా రుచించడం లేదనే వాదన ఉంది. సీఎం కేసీఆర్, కేటీఆర్ పథకం ప్రకారమే నామా నాగేశ్వరరావును బరిలో దించారని, జిల్లాలోని పార్టీ నేతలంతా ఆయన విజయానికి కృషి చేస్తారని, నామా విజయం తథ్యమని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో వైరి వర్గాలుగా తలపడిన రెండు గ్రూపులూ ఇప్పుడు తమ గూటికే రావడం కచ్చితంగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు.

నామా నాగేశ్వరరావు విజయం సాధించాలంటే మాత్రం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం పరిపూర్ణంగా ఉండాల్సిందేనని అర్థమవుతుంది. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పాలేరు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు సొంత కేడర్‌ ఉంది. ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో ఆయన పట్టు నిలుపుకునేందుకు మంచి ప్రయత్నమే చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా కేడర్‌కు అందుబాటులో ఉంటూ తనకంటూ ఎప్పుడు పిలిచినా పలికే కేడర్‌ను తయారు చేసుకున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ పట్టు సాధించారు.

ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు సానుకూలత కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ గట్టి పట్టున్న నాయకుడు. ఆయనకు తోడు ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కేడర్‌ ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుక వర్గం కూడా ఉన్నా కాంగ్రెస్‌ సంస్థాగతంగా పట్టు కోల్పోయింది. అయితే, ఇక్కడ నామా, రేణుకల్లో కమ్మ సామాజిక వర్గం ఎవరిని ఎంచుకుంటుంది. మైనార్టీలు, మున్నూరు కాపులు ఎవరివైపు మొగ్గు చూపుతారనేవి అభ్యర్థుల జాతకాలను తారుమారు చేయనున్నాయి.

పాలేరులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిని గెలిపించాయి. ఇప్పుడు ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించగా, టీడీపీ కేడర్‌ కూడా నామాతో పాటు టీఆర్‌ఎస్‌ గూటికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు తప్ప నేతలు లేని పరిస్థితి. అయితే, ఉపేందర్‌రెడ్డి పార్టీ మార్పుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌దే పైచేయి అయ్యే అవకాశాలు మెండుగాకనిపిస్తున్నాయి.

మధిరలో రెడ్డి, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం ఎటు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నందున కాంగ్రెస్‌కు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అయితే, టీఆర్‌ఎస్‌ కూడా బలంగానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపిన రెడ్డి సామాజికవర్గం ఈసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్‌ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకకు కూడా ఇక్కడి ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. నామాకు ఇక్కడ మెజార్టీ రావాలంటే పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటేనే సాధ్యమవుతుంది.

వైరా నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు గత ఎన్నికల్లో సహకరించి పనిచేసింది కాంగ్రెస్‌ నేతలే. అయినా, మహాకూటమి తరఫున నిలబడ్డ సీపీఐ అభ్యర్థికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే, రాములు నాయక్, ఆయన ప్రత్యర్థి మదన్‌లాల్‌కు కలిపి లక్ష ఓట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అయితే, మదన్‌లాల్‌ కంటే ఎక్కువ పొంగులేటి టీఆర్‌ఎస్‌ పక్షాన ఇక్కడ ప్రభావం చూపగలరు. కాంగ్రెస్‌ అభ్యర్థి పక్షాన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం సహకారం తప్పనిసరి.

కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్‌ అంటేనే వనమా.. వనమా అంటేనే కాంగ్రెస్‌ అనే పరిస్థితి. కానీ, ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో యడవెల్లి కృష్ణతో పాటు నలుగురైదుగురు నేతలు మాత్రమే పార్టీలో మిగిలారు. వనమా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఇక్కడ కూడా మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కలిసి పనిచేస్తే ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ తప్పదు. అయితే, వనమాతో పాటు కొందరు నేతలే వెళ్లారని, కేడర్‌ తమతోనే ఉందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

సత్తుపల్లిలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌ పక్షానే చేరారు. ఈయనతో డీసీసీబీ మాజీ చైర్మన్‌ విజయబాబు కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఇక్కడ నామా విజయం కోసం పనిచేస్తే ఇక్కడా టీఆర్‌ఎస్‌కు మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే, పార్టీ మారిన సండ్రపై నియోజకవర్గ ప్రజల్లో కొంత అసహనం కనిపిస్తోంది. నామా కూడా ఎన్నికల ముందే పార్టీ మారి బరిలో నిలవడంతో ఇక్కడి ఓటర్లు కొంత ప్రతికూల అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

అశ్వారావుపేటలో టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే అటు పార్టీగా కన్నా ఎంపీ పొంగులేటి వర్గంగానే బలంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక నేతలు ఎక్కువ మంది పొంగులేటి అనుచరులే. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తాటి వెంకటేశ్వర్లు కూడా ఆయన వెంట ఉన్న నాయకుడే. తాటితో పాటు ఆలపాటి రాము ఇతర నేతలు సహకారం సంపూర్ణంగా లభించాల్సి ఉంటుంది. ఇక, ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ), పార్టీ కేడర్‌ కాంగ్రెస్‌కు ఇక్కడ బలాలుగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here