Home News Updates

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ బరిలో ఎవరు..?

రాష్ట్రంలో ఏలాగూ అధికారం దక్కలేదు..కనీసం వచ్చే లోక్ సభ ఎన్నికలలోనైనా వీలైనన్ని మెజారిటీ సీట్ల లో విజయం సాదించి తమ పార్టీ నేతను ప్రధానిగా చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో సీట్లు గెలవలేకపోయిన ఖమ్మం జిల్లాలో మాత్రం తమ పట్టు ను నిలుపుకుంది కాంగ్రెస్ పార్టీ..దీంతో ఏలాగైనా ఈ సారి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయ్యాలని అందరి చూపు ఖమ్మం పై పడిందా..?జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు? రాబోవు పార్లమెంటరీ ఎన్నికల నేపధ్యంలో వేగంగా మారుతున్న ఖమ్మం జిల్లా రాజకీయాల పై స్పెషల్ స్టోరీ….

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 శాసన సభ స్థానాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 6, టీఆర్ఎస్ 1, టీడీపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి అధికారపార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ బీ-ఫారం తీసుకున్న ప్రతిచోటా విజయం సాధించింది. దీన్ని పరిగణలోనికి తీసుకొని కొందరు రాష్ట్ర నేతల కన్ను ఖమ్మం పార్లమెంటుపై పడింది. ఖమ్మం సీటు జనరల్‌ స్థానం కూడా కావడం, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పార్టీ గెలుచుకోవడంతో ఆశావహులు జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర స్థాయి బడానేతలు కూడా వరుస కడుతున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం శాసనసభ స్థానాలున్నాయి. జిల్లా పరిధిలోని మరో స్థానం మహబూబాబాద్‌ లోక్‌సభలో ఇల్లెందు, భద్రాచలం, పినపాక స్థానాలున్నాయి.

ఖమ్మంలో ఎక్కువ స్థానాలు గెలుపొందడంతో కాంగ్రెస్ అగ్రనాయకుల దృష్టి ఈ జిల్లా పై పడింది. విహెచ్ మొదలు అజారుద్దీన్ వరకు అంతా ఇక్కడ నుంచే పోటి చేయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంగ, అర్థబలం ఉన్న నేతలను ఎంపిక చేసుకొని పోటీలో నిలపాలన్న నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తరహాలో ఇతర జిల్లాల్లో కాంగ్రెస్‌కు సీట్లు వచ్చి ఉంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవాళ్లం. గెలుచుకున్న స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం నుంచే ఉన్నాయి. ఈ జిల్లాలోనే కాంగ్రెస్‌ పార్టీ అంచనాలు నిజమయ్యాయి. మిగతా జిల్లాలో ఈస్థాయి విజయం సాధించకపోవడంతో కాంగ్రెస్ అధికారానికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. ఇక్కడి నుంచి బరిలోదిగేందుకు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి,సీనియర్‌నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)తోపాటు పలువురు తమకు టికెట్‌ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మం అసెంబ్లీ టికెట్‌ ఆశించినా గత ఎన్నికల్లో స్థానికంగా దక్కలేదని, ఖమ్మం జిల్లాలో తనకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకొని టికెట్‌ తనకే ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర మంతనాలు చేస్తున్నారు. ఆఖరి క్షణంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంకేటాయించినా 55 వేల వరకు ఓట్లు తెచ్చుకున్న విషయాన్ని వద్దిరాజు గుర్తుచేస్తున్నారు. తనకున్న ఆర్ధిక,అంగబలంతో టీఆర్ఎస్ కి ధీటైన అభ్యర్థినని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో ఉన్న పరిచయాలు ఆయనకు ప్లస్ పాయింట్. వీరితోపాటు మరికొందరు కూడా దరఖాస్తులతో పని లేకుండా అధిష్ఠానం కనుసన్నల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ గురించి పరిశీలించాలని ఓ రాష్ట్ర స్థాయినేతకు కూడా సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. తనకు ఖమ్మం జిల్లాతో అనుబంధం ఉందని, తనకున్న పరిచయాలదృష్ట్యా సీటు కేటాయించాలని వీహెచ్‌ కోరుతున్నారు. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా రంగంలో దిగే అవకాశాలున్నాయి. గతంలో ఆమె ఖమ్మం స్థానం నుంచి గెలుపొంది కేంద్రంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఇక జిల్లాకే చెందిన పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేయ్యాలని భావిస్తున్నారంటా..రాజా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టీ మద్దతు ఇతనికే ఉండటంతో జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది.

ఇక మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానం పరిధిలోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఈ స్థానం తమకు కేటాయించాలని బలరాం నాయక్‌, బిల్యానాయక్‌ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక టీడీపీ పొత్తులో భాగంగా మూడు సీట్లలో పోటీ చేసి రెండు స్థానాలు అశ్వారావుపేట, సత్తుపల్లిలో విజయం సాధించింది. ఖమ్మంలోఆ పార్టీ పోటీ చేసినా గెలవలేకపోయింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేసే యోచనలో ఉన్నారని టీడీపీ కార్యకర్తల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కూటమిలోని మరో పార్టీ సీపీఐ ఖమ్మం, మహబూబాబాద్‌, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికి 2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ పోంగులేటి శ్రీనివాసరెడ్డి తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన శ్రీనివాసరెడ్డికే లోక్ సభ సీటు కేటాయిస్తుందన్న నేపధ్యంలో ఆర్ధికంగా బలమైన నాయకుడు అయిన శ్రీనివాసరెడ్డి ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా అతనికి ధీటైన అభ్యర్ది ని నిలబెట్టాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటుంది.సామాజిక పరంగా,ఆర్ధికంగా బలమైన అభ్యర్థి గా ఎవరిని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలుపుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here