Home News

ఖమ్మం కార్పోరేషన్ లో ఏం జరుగుతుంది…!

ఖ‌మ్మం కార్పొరేష‌న్ కార్పొరేట‌ర్ల తిరుగుబాటుపై ఆగ్రహంగా ఉన్న టిఆర్ఎస్ అధిష్టానం ఏం చేయబోతోంది? రాష్ట్రంలో ఉన్న ఒకేఒక్క ఎస్టీ మేయ‌ర్‌ను దింపడానికి జరిగిన కుట్రల‌పై హైక‌మాండ్ ద‌గ్గర ఉన్న ప‌రిష్కారం ఏంటి ? .. అసలు టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉన్నా ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? మేయ‌ర్‌పై తిరుగుబాటుకు కార్పొరేట‌ర్లను వెన‌క ఉండి న‌డిపిస్తుంది ఎవ‌రు ?

రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉంది… అటు ఖ‌మ్మం జిల్లాలోనూ టిఆర్ఎస్‌దే పైచేయిగా ఉంది… కార్పొరేష‌న్‌ ఎన్నికల్లోనూ పూర్తి మెజార్టీతో ఆ పార్టీనే విజయం సాధించింది … తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీద రిజర్వేషన్‌ లెక్కలతో ఒక్క ఖ‌మ్మంలోనే ఓ ఎస్టీకి మేయ‌ర్‌గా అవ‌కాశం ఇచ్చింది… మేయర్‌ పదవీకాలం ఇంకా ఏడాదిన్నర ఉన్న తరుణంలో .. మేయ‌ర్ వర్సెస్‌ కార్పొరేటర్ల రాజ‌కీయం రచ్చకెక్కింది … ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 50 మంది కార్పొరేట‌ర్లు ఉన్నారు. ఇందులో 42 మంది టిఆర్ఎస్ కార్పొరేట‌ర్లే …

అయితే ముగ్గురు మిన‌హా టిఆర్ఎస్‌లోని 39 మంది కార్పొరేటర్లు మేయ‌ర్‌ పాపాలాల్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి.. గద్దె దిగాల్సిందే అని తీర్మానం చేశారు .. మేయర్‌ తమ డివిజన్లకు అభివృద్ది నిధులు మంజూరు చేయ‌డం లేదు… అంటీముట్టిన‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నార‌నేది కార్పొరేట‌ర్ల ఆరోప‌ణ … ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రాష్ట్రంలోనే ఓ గుర్తింపు ఉంది… 50 డిజిజ‌న్లు ఉన్న ఈ కార్పొరేష‌న్లో క‌నీసం శానిటేష‌న్ విష‌యంలోనూ శ్రద్ద పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ..

మేయ‌ర్ పాపాలాల్ ఇంత పెద్ద కార్పొరేష‌న్‌ను ముందుండి న‌డిపించాల్సి ఉండ‌గా … ఆయన డాక్టర్‌గా తన ప్రాక్టీసుపైనే ఎక్కువ దృష్టి సారిస్తుంటారు .. ప్రజాప్రతినిధిగా ఉద‌యం లేచి డిజిజ‌న్లలో పర్యటించి ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిన న‌గ‌ర‌ ప్రథ‌మ పౌరుడు సొంత హాస్పిట‌ల్‌లో రోగుల‌ను పరీక్షించుకుంటుంటారు .. వైద్యశాఖలో ఉద్యోగం చేస్తూ మేయ‌ర్ అయిన పాపాలాల్ భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగే.. ఆర్జేడీగా విధులు నిర్వర్తిస్తున్నారు… దాంతో ఆయన పార్టీ ఎజెండా కాకుండా సొంత ఎజెండాతో మేయ‌ర్ ప‌నిచేస్తున్నార‌నేది కార్పొరేట‌ర్ల వాద‌న‌…

అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు కూడా ఖమ్మం కార్పొరేష‌న్‌లో ఇలాంటి ముస‌ల‌మే పుట్టింది. హైకమాండ్ జోక్యంతో అప్పుడు చ‌ల్లబ‌డింది… ఏ ఒక్క కార్పొరేట‌ర్‌తో మేయ‌ర్‌కు సయోధ్య లేక‌పోవ‌డం పెద్ద లోపంగా పార్టీ భావిస్తోంది… ఖ‌మ్మం కార్పొరేష‌న్ న‌గ‌రంలోని ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో విస్తరించి ఉంటుంది.. అయితే పాపాలాల్‌ మొన్నటి ఎన్నికల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం చేయలేదు.. పక్కనున్న మరో సెగ్మెంట్‌కు వెళ్లి ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు.. అలా త‌న‌కు సంబంధంలేని నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి ఆయన హడావుడి చేయడంపై ఇప్పటికే పార్టీలో అసంతృప్తి ఉంది..

ఇక తాజాగా మేయ‌ర్ త‌న పుట్టినరోజు వేడుకలను పార్టీకి కొంత దూరంగా ఉంటున్న నేత‌తో సెల‌బ్రేట్ చేసుకున్నారు… స్థానిక ఎమ్మెల్యే అయిన పువ్వాడ అజ‌య్‌తో సహా కార్పొరేటర్లను కూడా ఆ పార్టీకి పిలవలేదు … కార్పొరేట‌ర్లతో దూరం మరింత పెర‌గ‌డానికి మేయ‌ర్ బ‌ర్త్ డే కార్యక్రమం కూడా ఓ కారణమంటున్నారు ..

ఆ క్రమంలో ఇప్పుడు కార్పొరేటర్ల తిరుగుబాటు వ్యవ‌హారంపై ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌, పార్టీ ఇన్‌ఛార్జ్ తాతా మ‌ధు ప్రత్యేక స‌మావేశం నిర్వహించారు… కార్పొరేట‌ర్లు, మేయ‌ర్‌తో మంత‌నాలు సాగించారు.. ఏం చేయాల‌న్న దానిపై పార్టీ హైక‌మాండ్‌కు ఓ నివేదిక పంపారు. ఇప్పుడు ఈ నివేదిక పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ , వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర ఉందంట.. మ‌రోవైపు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా టిఆర్‌ఎస్‌ అధిష్టానం నివేదిక‌లు తెప్పించుకుందంట … కార్పొరేష‌న్ రాజ‌కీయం ర‌చ్చకెక్కడానికి కార‌ణం ఎవ‌రు ? వెన‌కుండి న‌డిపిస్తున్న శ‌క్తులు ఎవ‌రు అన్న దానిపై పూర్తి స్థాయిలో స‌మాచారం తెప్పించుకున్నారంట…

పార్టీ అధికారంలో ఉండ‌టం.. కార్పొరేషన్‌ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్నర స‌మ‌యం ఉండ‌టం.. స్థానిక ఎమ్మెల్యే కూడా సొంత పార్టీ కావ‌డం లాంటి ఆంశాల‌ను అధ్యయ‌నం చేస్తూ .. మేయర్ విషయంలో ఇప్పుడున్న ప్రత్యామ్నాయాల‌ను కూడా పరిశీలిస్తున్నారంట పార్టీ పెద్దలు.. ఆ క్రమంలో మ‌రో ముగ్గురు ఎస్టీలు కార్పొరేట‌ర్లుగా ఉన్నా .. పాపాలాల్‌ను దింపాలా వ‌ద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు… ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని రోడ్డుకు ఈడ్చిన వ్యక్తుల‌పై చ‌ర్యలు తీసుకుంటారా ? లేకపోతే మేయ‌ర్‌ను ఇంటి దారి పంపిస్తారా అన్నది తేలాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here