Home News Politics

కేసీఆర్‌కి ఓట‌మి త‌ప్ప‌దా?

గులాబీ గ్యాంగ్‌లో గుబులు మొద‌లైందా?

 

ప్లాన్ బెడిసికొడుతుందా?

ఆత్మ‌విశ్వాసం ఉండొచ్చుగానీ అతి విశ్వాసం అస‌లుకే మోసం. తొమ్మిదినెల‌ల ముందే అసెంబ్లీ ర‌ద్దుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లెక్క‌లు ఏమ‌యినా అయ్యుండొచ్చుకానీ…ఆయ‌న అంచ‌నాలు త‌ప్పొచ్చ‌న్న భయం మాత్రం గులాబీ గ్యాంగ్‌లో మొద‌లైంది. తొమ్మిదినెల‌ల్లో ఎంతో చేసే అవ‌కాశ‌మున్నా, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా మిగిలిపోయి కేసీఆర్ కాళ్లు చేతులు క‌ట్టేసుకోవాల్సి వ‌చ్చింది. వ‌చ్చే మూడేళ్ల‌లో హైద‌రాబాద్‌ని విశ్వ‌న‌గ‌రం చేస్తాన‌ని కేసీఆర్ వార‌సుడు చెబుతుంటే…నాలుగేళ్ల‌లో చేసిందేంట‌న్న ప్ర‌శ్న స‌హ‌జంగానే వ‌స్తోంది. నాలుగేళ్ల‌లో చేయ‌లేక‌పోయింది ఆరేడునెల‌ల్లో ఎంతోకొంత క‌వ‌ర్ చేసుకునే అవ‌కాశ‌మున్నా కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోసం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు కేసీఆర్ ప‌డుతున్న ఆరాటం చివ‌రికి బూమ‌రాంగ్ అయ్యేలా ఉంది.

కొడుకు ప‌ట్టాభిషేకానికి తొంద‌ర‌ప‌డుతున్నారు కేసీఆర్‌. మ‌రో ఐదేళ్లు గ‌డిస్తే రావెవ‌రో..రెడ్డెవ‌రో..? అందుకే ఈ ట‌ర్మ్‌లోనే యువ‌రాజుని సీఎం సీట్లో కూర్చోబెట్టేస్తే ఓ ఐదేళ్లు కేంద్రంలో త‌న మార్క్ చూపించాల‌నేది కేసీఆర్ దూరాలోచ‌న (వేరేవారికి దురాలోచ‌న‌లా అనిపించొచ్చుగాక‌) . కొన్ని నెల‌ల‌క్రితం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ హ‌డావుడి చేసింది అందుకే. అమిత్‌షా వ‌చ్చి నాలుగు విమ‌ర్శ‌లు చేసి వెళ్లినా….బీజేపీని భార‌తీయ ఝూటా పార్టీగా కేటీఆర్ ప్ర‌తి విమ‌ర్శ చేసినా కేసీఆర్‌-మోడీల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం ఇవాళ కాక‌పోతే రేప‌యినా బ‌య‌టప‌డ‌క‌పోదు. సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రిగితే ఇచ్చిపుచ్చుకోవ‌డం కుద‌ర‌దు. అటు ఎంఐఎంని..ఇటు బీజేపీని చెరోవైపు పెట్టుకోవ‌డం అస్స‌లు సాధ్యంకాదు. అందుకే ఓ ఆర్నెల్ల‌ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిపోతే…త‌ర్వాత త‌న మంత్రాంగానికి ఎలాంటి అడ్డంకులూ ఉండ‌వ‌నేది ది గ్రేట్ కేసీఆర్ ప్లాన్‌. అందుకే ముంద‌స్తుకు అంత తొంద‌ర‌.

ఏక‌మ‌వుతున్న విప‌క్షం..

గ‌తంలో కేసీఆర్ ఏం చెప్పినా తెలంగాణ స‌మాజం న‌మ్మింది. ప‌ద‌వీ త్యాగాల‌తో ఉప ఎన్నిక‌ల్ని ఆహ్వానించినా మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిపించింది. కానీ ఇప్పుడు కేసీఆర్ తొమ్మిదినెల‌ల ముందే అసెంబ్లీని ర‌ద్దుచేయ‌డాన్ని మాత్రం తెలంగాణ ప్ర‌జ‌లెవ‌రూ ఆహ్వానించ‌లేక‌పోతున్నారు. పైగా అసెంబ్లీ ర‌ద్దుకు ఆయ‌న చెబుతున్న కార‌ణాన్ని అంగీక‌రించ‌లేక‌పోతున్నారు. విప‌క్షాలు అడ్డం ప‌డుతున్నాయ‌నే కేసీఆర్ వాద‌న‌ని తెలంగాణ ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డంలేదు. ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వాల్ని ర‌ద్దుచేసి…కోర్టు చెప్పినా లెక్క‌చేయ‌ని జ‌గ‌మొండి కేసీఆర్…కాంగ్రెస్‌వాళ్లు త‌న కాళ్ల‌కు అడ్డం ప‌డుతున్నార‌ని చెబుతుంటే అంత‌కంటే పెద్ద జోక్ మ‌రోటి ఉండ‌దు. ఆల‌స్యం అమృతం విషం. ఎన్నిక‌ల‌కు ఇంకా ఎదురుచూస్తే తన పాచిక‌లు పార‌వ‌నే విష‌యం కేసీఆర్ ముంద‌స్తుగా గ్ర‌హించ‌బ‌ట్టే…తొమ్మిదినెల‌ల అధికారాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌నే అంతా భావిస్తున్నారు.

అసెంబ్లీ ర‌ద్దుకాగానే 105మంది అభ్య‌ర్థిత్వాల్ని ప్ర‌క‌టించేసి విప‌క్షాల్ని డిఫెన్స్‌లో ప‌డేశాన‌ని సంబ‌ర‌ప‌డిపోయారు కేసీఆర్‌. త‌నకి ఎవ‌రూ ఎదురుతిరిగే ధైర్యం చేయ‌లేర‌నుకున్నారు. అసెంబ్లీ ర‌ద్దుని ఎమ్మెల్యేలెవ‌రూ వ్య‌తిరేకించ‌కూడ‌ద‌నే ఇద్ద‌రు త‌ప్ప మిగిలిన సిట్టింగ్‌లంద‌రికీ ఆయ‌న ఉదారంగా సీట్లిచ్చేశారు. వారిలో మూడోవంతు ఎమ్మెల్యేల‌పై ఇంటాబ‌య‌టా వ్య‌తిరేక‌త ఉంది. వేరే పార్టీల‌నుంచి వ‌చ్చి కండువాలు క‌ప్పుకున్న‌వారంద‌రికీ టికెట్లు ఇచ్చేయ‌టంతో పార్టీలో అసంతృప్తి లావాలా ఎగ‌సిప‌డుతోంది. తెలంగాణ‌లో ఉనికికి కూడా లేద‌నుకున్న(కేసీఆర్ దృష్టికోణంలో) తెలుగుదేశం కేసీఆర్ వ్య‌తిరేక‌శ‌క్తుల‌న్నిటినీ ఏకం చేసే ప‌న్లో ఉంది. టీడీపీ-కాంగ్రెస్ కాంబినేష‌న్ కేసీఆర్‌ని భ‌య‌పెడుతోంది. మ‌రోవైపు బుజ్జ‌గింపుల‌తో పార్టీలో అస‌మ్మ‌తి స‌ర్దుకుపోయేలా లేదు. ఎన్నిక‌ల‌నాటికి ఈ వ్య‌వ‌హారం పార్టీ కొంప ముంచేలా ఉంది.

2014 ఎన్నిక‌ల‌నాటి వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో లేదు. అప్ప‌ట్లో తెలంగాణ రాష్ట్ర క‌ల‌ను సాకారం చేసిన ఉద్య‌మ‌పార్టీగానే టీఆర్ఎస్ క‌నీసం డెబ్భై సీట్లు గెలుచుకోలేక‌పోయింది. వ‌ల‌స‌ల్ని ప్రోత్స‌హించి ఎమ్మెల్యేల సంఖ్య‌ను వంద దాటించినా అది బ‌లుపు కాదు వాపేన‌న్న విష‌యం గులాబీపార్టీ అధినేత‌కు తెలుసు. ఈ నాలుగేళ్ల‌లో ద‌ళితుల్లో అసంతృప్తి పెరిగింది. కేసీఆర్ డ‌బ‌ల్‌గేమ్‌పై మైనారిటీలు కూడా అసంతృప్తితో క‌నిపిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ముందున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కొత్త‌పార్టీతో మేథావుల్ని, ప్ర‌జాసంఘాలు, విద్యార్థులు ఏకంచేసే ప‌న్లో ఉన్నారు. రెడ్డి నేత‌ల్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నార‌న్న ఆగ్ర‌హంతో ఆ సామాజిక‌వ‌ర్గం ఉంది. అన్నిటికీ మించి కేసీఆర్ కుటుంబ రాజ‌కీయంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

ఆంధ్రాపార్టీ అని టీడీపీని ఆడిపోసుకున్నా, ఢిల్లీలో నిర్ణ‌యాలు చేసే పార్టీలు మ‌న‌కొద్ద‌ని భావోద్వేగాలు నూరిపోసినా తెలంగాణ స‌మాజం ఈసారి గుడ్డిగా న‌మ్మ‌క‌పోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here