పుష్కరకాలం అలుపెరగని పోరాటం. మృత్యుముఖందాకా వెళ్లి దశాబ్ధాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షని సాధించానని పదేపదే చెప్పుకుంటారు కేసీఆర్. ఎవరో ఒకరు ముందుండబట్టే…గట్టిగా కొట్లాడబట్టే తెలంగాణ వచ్చింది. ఆ క్రెడిట్ కేసీఆర్‌కి కలిసొచ్చి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అందలమెక్కించింది. మరి బంగారు తెలంగాణ లక్ష్యం సాకారమైందా అంటే జవాబుకోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. గతంలో అభివృద్ధిలో వివక్ష ఉన్నా, రాజకీయంగా తెలంగాణ నేతల్ని అణగదొక్కినా గొంతెత్తే స్వేచ్ఛన్నా ఉండేది. గడచిన నాలుగేళ్ల కాలంగా తెలంగాణ సమాజంలో అణచివేత ధోరణి పెరిగిందనేది మేథావులు, విద్యావంతులనోటినుంచి వస్తున్న మాట. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల్నీ ఏకం చేసిన ప్రొఫెసర్ కోదండరాం..ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం ఎందుకు పిడికిలి బిగించాల్సి వచ్చిందన్నదే ప్రశ్న. జాయింట్ యాక్షన్ కమిటీ రాజకీయపార్టీగా రూపాంతరం చెందడానికి ఎన్నో కారణాలు.
కేసీఆర్మీద తెలంగాణ ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఉందో లేదో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది. ఉద్యమకాలం నాటి పరిస్థితులు వేరు. అప్పుడు రాజీనామాలతో పదేపదే ఉప ఎన్నికల్ని ఆహ్వానించినా జనం టీఆర్ఎస్ వైపే నిలిచారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయనే నెగ్గుకొచ్చారు. కొత్త రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే క్రమంలో కేసీఆర్ రాజకీయంగా బలహీనపడకూడదనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉప ఎన్నికల్లోనూ ఆవిష్కృతమైంది. తెలంగాణ సాకామయ్యాక జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారపీఠమెక్కినా..తిరుగులేని మెజారిటీతో మాత్రం కాదు. బొటాబొటి ఆధిక్యంతో పవర్లోకి రావడం కేసీఆర్‌ని కలవరపెట్టింది. అందుకే బలాన్ని పెంచుకునేందుక ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేచింది. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ…చివరికి సీపీఐ ఎమ్మెల్యేని కూడా లాగేసుకుని రాజకీయ ఏకీకరణ జరిగిందని టీఆర్ఎస్ జబ్బలు చరుచుకున్నా అది వాపే తప్ప బలుపుకాదని వారికీ తెలుసు.
2019లో ఏం జరుగుతుందన్నది అప్పుడే ఊహించడం తొందరపాటే అవుతుంది. కానీ తెలంగాణలో ఇక చేయాల్సిందేమీ లేదన్నట్లు కేసీఆర్ ఎన్నికలకు ఏడాది ముందుగానే జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టడమే ఆశ్చర్యకర పరిణామం. బీజేపీ-కాంగ్రెస్సేతర కూటమి అంటూ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనని తెరపైకి తెచ్చినా..అది వృథా ప్రయాసంటున్నారు తలపండిన నేతలు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ఎవరు కలిసొస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ మధ్య మమతాబెనర్జీని కలిసినా అడుగు ముందుకు పడలేదు. తర్వాత కర్ణాటకలో జేడీఎస్ నేత దేవెగౌడతో కేసీఆర్ మంతనాల వెనుక పరమార్ధం వేరేనన్న ప్రచారం జరిగిపోయింది. ఇక నవీన్‌పట్నాయక్‌తో భేటీ అన్న వాదన కేవలం పూరీ టెంపుల్ సందర్శనగానే మిగిలిపోయింది. ఓపక్క యూపీలో బద్దవైరమున్న బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలే మోడీకి వ్యతిరేకంగా ఏకమవుతుంటే ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఓ భ్రమగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది.
ఇప్పుడేమో జాతీయ స్థాయిలో పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు పార్టీ ప్లీనరీలో పర్మిషన్ తీసుసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని చెప్పుకునేందుకు ఇదేదో బాగానే ఉంది కానీ దానివల్ల ఒరిగేదేముండదు. కేసీఆర్ ఆలోచనని ప్లీనరీ చప్పట్లతో ఆమోదించకుండా ఎందుకుంటుంది? ఆయన మాటే శిలాశాసనమయ్యాక అదో చిన్న తంతు మాత్రమే. అయినా ప్రతినిధుల సభ ఆమోదిస్తేనే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని, లేకపోతే లేదని కూడా కేసీఆర్ ప్లీనరీ సాక్షిగా చెప్పబోతున్నారు. ఒకవేళ ఓపెనింగ్స్ బాలేవని ఆయన వెనక్కి తగ్గాలనుకుంటే…బంగారు తెలంగాణకోసం మీరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని ప్లీనరీ సాక్షిగా గులాబీ నేతలంతా ముక్తకంఠంతో ఘోషించినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. చేతిలో పనేగా…ఎలా కావాలంటే అలా. ఎనీ డౌట్స్?