Home News Politics

ఎవ‌రికోసం? ఎందుకోసం?

నేల‌విడిచి కేసీఆర్ సాము

తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిందేమీ లేదంటూ పెడ‌లే లేని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కోసం పొలోమ‌ని బ‌య‌లుదేరారు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌. మంచిదే…తాడూబొంగ‌రం లేనేళ్లో జాతీయ నాయ‌కుల‌మ‌నుకుంటుంటే ఆయ‌న మాత్రం రాజ‌కీయంగా ఎద‌గొద్దా? ఒకే రాష్ట్ర రాజ‌కీయంతో ఆయ‌న‌కి కూడా బోర్ కొట్టేసుంటుంది. కాక‌పోతే ఆ మొద‌లుపెట్టేదేదో అస‌లేం చేయాల‌నుకుంటున్నారో..త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ (ఇప్పుడ‌ది అస‌లు ఫ్రంటే కాదంటున్నారు) ఉద్దేశ‌మేంటో..దాన్నెలా ముందుకు తీసుకెళ్లాల‌నుకుంటున్నారో, భావ‌వైరుధ్య‌మున్న పార్టీల్ని ఎలా క‌లుపుకుని వెళ్ల‌గ‌ల‌రో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్య‌త మాత్రం ఆయ‌న‌మీదుంది. ఎందుకంటే కాంగ్రెస్ స‌భ్యుల్ని మూకుమ్మ‌డిగా స‌భ‌నుంచి గెంటేసినా, న‌చ్చ‌ని ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలుగా ప‌నికిరార‌ని వేటేసినా, లేదంటే ఏమిటీ న్యూసెన్స్ అని ధ‌ర్నాచౌక్‌లాంటి పోరాట‌వేదిక‌ల్ని ఎత్తేసినా అది ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌కున్న అధికారం. కానీ జాతీయ‌స్థాయి రాజ‌కీయ‌మ‌న్నాక రెండు సీట్లు లేని పార్టీ కూడా స‌వాల‌క్ష సందేహాలు అడుగుతుంది. అనుమానాలు తీర్చ‌మంటుంది. ఓపిగ్గా అంద‌రికీ న‌చ్చ‌జెప్పాల్సిందే. అన్నిటికీ మించి చేసే ప్ర‌య‌త్నం త్రిక‌ర‌ణ‌శుద్ధితో నిజాయితీగా చేస్తున్నామ‌ని అంతా న‌మ్మేలా ఉండాలి.

బీజేపీ-కాంగ్రెస్సేత‌ర పార్టీల‌న్నిటినీ ఒకే వేదిక‌పైకి తీసుకురావాల‌న్న‌ది కేసీఆర్ కొత్త ఫ్రంట్ ల‌క్ష్యం. మ‌మ‌తాబెన‌ర్జీనుంచి మొన్నామ‌ధ్య క‌రుణానిధి, స్టాలిన్‌ల‌దాకా న‌లుగురైదుగురు జాతీయ‌నేత‌ల్ని తానే స్వ‌యంగా వెళ్లి క‌లిసొచ్చారు కేసీఆర్‌. ఇక స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ తానే నేరుగా వ‌చ్చి స‌మాలోచ‌నలు జ‌రిపారు. ఈ మాత్రం క‌ద‌లిక తేవ‌డం సానుకూల సంకేత‌మే. కానీ దీన్ని నిల‌బెట్టుకుంటారా అన్న‌దే అనుమానం. ఎందుకంటే ఇప్ప‌టిదాకా కేసీఆర్ క‌లిసిన నేత‌లంతా బీజేపీపై పీక‌ల్లోతు కోపంగా ఉన్న‌వారే. మోడీకి వ్య‌తిరేకంగా తెర‌పైకొచ్చే ఏ కూట‌మికైనా మ‌ద్ద‌తిచ్చేందుకు ముందుకొచ్చేవారే. కానీ కాంగ్రెస్‌మీద మాత్రం అంత వ్య‌తిరేక‌త లేదు. కేసీఆర్ ఏమో ఆ రెండుపార్టీల్ని ఒకే గాట‌న క‌ట్టేయ‌డమే కాదు..విచిత్రంగా బీజేపీని ప‌ల్లెత్తుమాట అన‌డంలేదు. గ‌త ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాల్నే ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు త‌ప్ప‌..ఈ నాలుగేళ్ల‌లో ఎన్డీఏ హ‌యాంలో అరాచ‌కాలు, అన్యాయాల‌పై ఒక్క మాట కూడా ఆయ‌న పెద‌వుల‌నుంచి రావ‌డంలేదు. నిన్న‌టికి నిన్న అఖిలేష్‌యాద‌వ్ ప‌క్క‌నే కూర్చుని బీజేపీ దుమ్ముదులిపేసినా కేసీఆర్ మాత్రం ఆ పార్టీనేం అన్లేక‌పోతున్నారు. అలాంట‌ప్పుడు ఆయ‌న ఫ్రంట్‌కి ఉన్న చిత్త‌శుద్ధిపై ఆవ‌లిస్తే పేగుల్లెక్క‌పెట్టేవారికి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది?


ఓ కొత్త ఫ్రంట్‌తో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్న‌ప్పుడు స‌హ‌నం ఉండాలి. ఎటునుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లొచ్చినా ఓపిగ్గా జ‌వాబివ్వాలి. మూడు భాషల్లో ప్రావీణ్యం ఉంటే స‌రిపోదు. మీడియా సందేహాల్ని కూడా తీర్చాలి. కానీ అఖిలేష్ సాక్షిగా కేసీఆర్ త‌న‌కు అల‌వాటైన ద‌బాయింపు ప‌ద్ద‌తిలోనే మాట్లాడారు. ఫ్రంట్ పేరుతో అంద‌రినీ క‌లుస్తూ రాజకీయాల‌కు అతీత‌మ‌నీ…2019 ఎన్నిక‌లు ల‌క్ష్య‌మేకాద‌నీ..ఈ దేశంలో ధ‌ర్మ సంస్థాప‌నార్ధం తానో ప‌విత్ర య‌జ్ఙాన్ని మొద‌లుపెట్టాన‌ని చెబితే అంద‌రూ న‌మ్మేయ‌లేరుగా. కాంగ్రెస్‌ని కూట‌మిలో క‌లుపుకుంటారా అంటే అస‌హ‌నం. రాజ‌కీయ ఉద్దేశం లేదని ఎలా న‌మ్మ‌మంటార‌ని ప్ర‌శ్నిస్తే ఆగ్ర‌హం. తాను చేసేది చిన్న‌ప్ర‌య‌త్నం కాద‌ని కేసీఆర్ చెప్పుకుంటే స‌రిపోదు. చూసేవారికి కూడా అనిపించాలి. అలా క‌నిపించాలి. ఇప్ప‌టికైతే కేసీఆర్ చెబుతున్న గుణాత్మ‌క మార్పు అనేది బ్ర‌హ్మ‌ప‌దార్థ‌మే. ఇంత‌టి సువిశాల భార‌త‌దేశంలో అలాంటి మార్పు ఎలా సాధ్య‌మ‌న్న‌దే ప్ర‌శ్న‌. రాజ‌కీయ‌క్రీడ‌గా చూడొద్ద‌ని మీడియామీద అస‌హ‌నం వ్య‌క్తంచేసినంత మాత్రాన పొలిటిక‌ల్ గేమ్ కాకుండా పోదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here