Home News Politics

హాంఫ‌ట్..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్..

గులాబీబాస్ ఆలోచ‌న పేక‌మేడేనా?


సొంతింటిని చ‌క్క‌దిద్దుకోకుండా..బంగారు తెలంగాణ ఎలా సాధ్య‌మో చూసుకోకుండా నేల‌విడిచి సాముచేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే, ఆంధ్రాపాల‌కుల పీడ వ‌దిలితే త‌మ జీవితాలు మారిపోతాయ‌ని ఎన్నో క‌ల‌లుగ‌న్నారు తెలంగాణ ప్ర‌జ‌లు. ఏ పోరాటాల‌తోనైతే తెలంగాణ రాష్ట్ర స్వ‌ప్నం సాకార‌మైందో…అవే పోరాటాల్ని అణ‌చివేస్తున్నార‌న్న విప‌క్షాలు, ప్ర‌జాసంఘాల ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా దేశ రాజ‌కీయాల్ని మార్చేస్తానంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్సేత‌ర కొత్త వేదిక ఏర్పాటు బాధ్య‌త‌ని త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుంటారు.
త‌ప్పేంలేదు. కేసీఆర్‌లాంటి మాట‌కారి..తెలుగులో మాట్లాడినంత అసువుగా హిందీ, ఇంగ్లీష్‌భాష‌ల్లోనూ అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నేర్ప‌రి. కానీ మొద‌లుపెట్టిన కార్య‌క్ర‌మం వెనుక మ‌రో ఉద్దేశం ఉంద‌నే అనుమానాలు రాకుండా ముందే జాగ్ర‌త్త‌ప‌డాల్సింది. ఆయ‌న ఎప్పుడైతే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట ఎత్తారో..అది ప‌రోక్షంగా మోడీకోస‌మేన‌న్న విమ‌ర్శ మొద‌లైంది. మ‌మ‌తాబెన‌ర్జ‌తో మాట్లాడినా పెద్ద‌గా సానుకూల స్పంద‌న క‌నిపించ‌లేదు. ఎందుకంటే మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా జ‌రిగిన ర‌చ్చ‌లో అన్నాడీఎంకే స‌భ్యుల‌తో టీఆర్ఎస్ ఎంపీలు గొంతుక‌ల‌ప‌డ‌మే.

ఇక జేడీఎస్ అధినేత దేవెగౌడ‌ని వెళ్లి క‌లిసినా టైం రాంగ్‌. క‌ర్ణాట‌క‌లో హంగ్ స‌ర్కారు ఏర్ప‌డే అవ‌కాశ‌ముంద‌న్న అంచ‌నాలున్నాయి. అదే జ‌రిగితే బీజేపీకి స‌హ‌క‌రించాల‌ని మోడీ త‌ర‌ఫున దూత‌గా కేసీఆర్ వెళ్లార‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. ఇక ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో మీటింగ్ అన్నా..అదికాస్తా పూరీ జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నంలో క‌లిసిపోయింది. ఇప్పుడేమో త‌మిళ‌నాడు డీఎంకే నేత‌ల‌తో భేటీ. దేశంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మ‌రో ఫ్రంట్ సాధ్య‌మేకాద‌ని తేల్చేస్తున్నాయి క‌మ్యూనిస్టు పార్టీలు. బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ ఒకే గొడుగుకిందికి రావాల‌ని మాయావ‌తిలాంటి నాయ‌కులు కోరుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌న‌తో ఎవ‌రు క‌లిసొస్తార‌న్న‌ది ఆకాశానికి నిచ్చెనేస్తున్న కేసీఆర్‌కే తెలియాలి.

త‌న ఫెడ‌ర‌ల్‌ఫ్రంట్ ప్ర‌తిపాద‌న తేలిపోకుండా..ఆ ఆశ‌ల్ని స‌జీవంగా నిలుపుకోవాల‌న్న తాప‌త్ర‌యం టీఆర్ఎస్ ప్లీన‌రీ సాక్షిగా కేసీఆర్‌లో క‌నిపించింది. మ‌రోవైపు త‌న చిత్త‌శుద్ధిని శంకిస్తున్నార‌న్న ఆక్రోశం ఆయ‌న మాట‌ల్లో త‌న్నుకొచ్చింది. మోడీతో త‌న‌కెలాంటి మ‌త‌ల‌బు లేద‌ని చెప్పేందుకే కేంద్రాన్ని గ‌ట్టిగా టార్గెట్ చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

టెంటే లేని ఫ్రంట్‌ అంటున్నవారికి భ‌య‌మెందుక‌ని ప్ర‌శ్నిస్తూనే.. క‌శ్మీర్‌లాంటి కీల‌క స‌మ‌స్య‌ల్ని గాలికొదిలేసి రాష్ట్రాల వ్య‌వ‌హారాల్లో వేలెందుకు పెడుతున్నార‌ని కేంద్రాన్ని నిలదీశారు కేసీఆర్‌. కావేరీ వివాదం నుంచి మొద‌లుకుని చాలా అంశాలు ప్ర‌స్తావించారు. ప్లీన‌రీకే ప‌రిమితం కాకుండా బ‌య‌ట‌కూడా ఇదే దూకుడు కొన‌సాగిస్తేనే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కి పునాది ప‌డుతుంది. లేదంటే ఫ్రంట్‌..హాంఫ‌ట్టే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here