భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల పై సీఎం కేసీఆర్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ పై ఆ పై మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ ఇలా ఈటలను ఎక్కడ గుక్క తిప్పుకోకుండా ఉచ్చు బిగిస్తున్నారు గులాబీ బాస్. ఇక టీఆర్ఎస్ మంత్రులు..ఇతర నేతల విమర్షలు సరే సరి..తాజాగా ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం పై దృష్టి పెట్టారు కేసీఆర్. ఉప ఎన్నిక వస్తే ఈటల పై పోటీ చేసే నేతను సైతం సిద్దం చేశారు.

ఈటల రాజేందర్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నేత వకుళా భరణం కృష్ణ మోహన్ ఉన్నప్పటికి ద్వితీయశ్రేణి నేతలతో ప్రయోగాలు చేసే కంటే ఈటలను ఢీకొనేందుకు దీటైన అభ్యర్థినే రంగంలోకి దింపాలని చూస్తున్నారు కేసీఆర్. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ను ఈటలకు ధీటుగా నిలపాలని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తుంది. వినోద్ కుమార్ కేసీఆర్ కి సన్నిహితుడు కావడంతో అటు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
హుజురా బాద్ నియోజకవర్గం పూర్వం కమలాపూర్ నియోజకవర్గంగా ఉండేది. వినోద్‌కుమార్ హన్మంకొండ ఎంపీ గా గెలుపొందిన సమయంలో కమలాపూర్ ఆ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు, నేతలతో సంబంధాలు ఉన్న వినోద్‌కుమార్ ఈటల కు సరైన అభ్యర్ధిగా టీఆర్ఎస్ అధిష్టానం లెక్కలేస్తుంది. వినోద్‌కుమార్ గెలిచిన తర్వాత ఆయనను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయని, కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆయనకు పాలనలో సలహాలిస్తూ వినోద్‌కుమార్ కుడి భుజంగా ఉంటారని భావిస్తున్నట్లు సమాచారం.
మరో వైపు రెండు రోజులు గా ఈటల నియోజకవర్గంలో తన సన్నిహితులు,అనుచరులతో భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికల ద్వారా టీఆర్ఎస్ నాయకత్వానికి గుణపాఠం చెప్పాలని కొందరు, రాజీనామా చేయకుండా శాసనసభ్యుడిగా ఉంటూనే పోరాడాలని మరి కొందరు సూచించారు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.