హుజూరాబాద్ రాజకీయం తెలంగాణలో మరింత హీట్ పెంచింది. మాజీ మంత్రి ఈటల మంత్రి గంగుల మధ్య జరుగుతున్న మాటల యుద్దం ఓ రేంజ్ కి చేరింది. 2018 ఎన్నికల తర్వాత నుంచి ఈటల,గంగుల మధ్య మొదలైన కోల్డ్ వార్ కరీంనగర్ జిల్లాలో సెగలు పుట్టిస్తుంది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆగ్రహంతో ఉన్న ఈటల మంగళవారం హుజూరాబాద్‌లో మంత్రి గంగులపై ఘాటుగా స్పందించారు. గంగుల సైతం అదే రీతిలో స్పదించడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

హుజూరాబాద్ లో ఎంట్రీ ఇచ్చిన మంత్రి గంగుల మండలాల వారీగా పార్టీ ఇన్చార్జీలను నియమించి తమపై ఉసిగొల్పుతున్నారని ఈటల వర్గం మండిపడుతుంది. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి తొలగించారే తప్ప ఆయన టీఆర్ఎస్ పార్టీకి గానీ, ఎమ్మెల్యే పదవికి గానీ రాజీనామా చేయలేదు. ఇప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కరోనా తగ్గిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఇప్పటికే చెప్పారు. అయితే టీఆర్ఎస్ మాత్రం విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. ఉపఎన్నిక పై అప్పుడే దృష్టి పెట్టింది. తాజాగా కరీంనగర్‌కు చెందిన పలువురు నాయకులను హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖాయమైతే మంత్రి హరీష్‌రావుకు గెలుపు బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సైతం నడుస్తుంది. ‘నా సహచరుడైన మంత్రిని హుజూరాబాద్ ఇన్చార్జిగా నియమిస్తున్నారని ఇప్పటికే ఈటల మాటల సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎక్కడికి వెళ్లినా పార్టీని గెలిపిస్తడు అన్ననమ్మకంతో నా సహచరున్నే నాపై గురి పెట్టాలని చూస్తున్నారని ఈటల కామెంట్స్ చేశారు. ఉద్యమ కాలం నుంచి ఈటలకు సన్నిహితుడిగా పేరున్న హరీశ్ తోనే హుజూరాబాద్ రణతంత్రం నడపాల్ని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ మాత్రం మంత్రి గంగులతో నడుపుతున్నారు.