Home News

ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్‌ సరికొత్త ఎత్తుగడ…!

సీఎం కేసీఆర్ ప్రగ‌తి భ‌వ‌న్ విడిచి చేస్తున్న వరుస పర్యటనలు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయి. గత వారం రోజులుగా వరుసగా జిల్లాలు చుట్టేస్తున్నారు. సిద్ధిపేట, వరంగల్‌, వాసాలమర్రి, యాదగిరిగుట్ట ఇలా ఒక్కసారిగా స్పీడు పెంచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికల ప్రచార సందర్భం కాకుండా కెసీఆర్‌ ఈ స్థాయిలో పర్యటనలు చేసిన సందర్భం మరొకటి లేదు. ఎన్నికల లాంటి సందర్భం ఏదీ లేకుండా సభల్లో సుదీర్ఘంగా ప్రసంగాలు ఇచ్చిన దాఖలాలూ లేవు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మార్చేశారు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్దమవుతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

కెసీఆర్‌ వ్యూహాలు ఎప్పుడు ప్రత్యేకమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కెసీఆర్‌ చాలా కాలంగా పెద్దగా చురుగ్గా కనిపించ లేదు. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే, వాళ్లనే ప్రగతిభవన్‌ కి పిలిపించుకునేవారు. కానీ, ఇప్పుడు కెసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. మళ్లీ అదే మాటల ఒరవడి..అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రత్యర్ధులకు మింగుడు పడటం లేదని చెప్పాలి. నిజానికి తెలంగాణలో కొంత కాలంగా రాజకీయ స్తబ్థత ఉంది. విపక్షాలు నామమాత్రంగానే మారిపోయాయి. కాంగ్రెస్‌ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అటు బిజెపి 2014 తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినా పెద్దగా సాధించిందేం లేదు. ఈ తరుణంలో రాజకీయ స్తబ్ధతను ఛేదించి మరోసారి యాక్టివిటీని పెంచారు కెసీఆర్‌. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.

కెసీఆర్‌ తీరులో వచ్చిన మార్పు వెనుక వ్యూహం ఏమిటనే కొత్త చర్చ నడుస్తోంది. సైలెంట్‌ ఉన్న గులాబీ బాస్‌ స్పీచ్‌ లు ఎందుకు దంచుతున్నారు ప్రజల మధ్యకు వెళ్లి మరీ మమేకమవటం వెనుక కారణమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల రాజీనామా తర్వాత టిఆర్ఎస్‌ పార్టీలో ఎలాంటి మార్పు లేకపోయినా, ఈటల బిజెపితో చేరిక తర్వాత … కొత్త మాటలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ట‌్రయల్స్‌ అనే కామెంట్స్‌ వినిపించినా, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే అయితే ఇంత హంగామా అవసరం లేదు. ఇంత దూకుడుతో అసలే పనిలేదు. ఎందుకంటే ఉప ఎన్నికలు కెసీఆర్‌ కి కొత్తకాదు.ఒక్క ఎత్తుగడతో తన వ్యతిరేకులు అందరికీ చెక్‌ పెట్టడం కెసీఆర్‌ స్ట్రాటజీ. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహం ఏదైనా ఉందా అన్న చర్చ నడుస్తుంది.

కాంగ్రెస్‌ పరిస్థితి 2018ముందస్తు ఎన్నికల కంటే ఏమాత్రమూ మెరుగుపడలేదు.. సరికదా.. ఇంకాస్త స్తబ్ధుగా మారిపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా టియ్యారెస్‌ లో విలీనం చేసేశారు. దుబ్బాకలో మూడో స్థానం, గ్రేటర్‌ లో రెండు సీట్లకు పరిమితం కావటం, సాగర్‌ లో సీనియర్‌ నేత జానారెడ్డి పోటీ చేసినా గెలవకపోవటం ఆ పార్టీ పేలవ ప్రదర్శనకు నిదర్శనం. పార్టీకి కొత్త పిసిసి చీఫ్‌ ని పెట్టుకోటమే పెద్దగా సమస్యగా మారింది. ప్రతిసారి ఇదిగో అదుగో అనటం, వాయిదా వేసుకోవటం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలో బిజెపితో పోలిస్తే వరుసగా ఓడినా కాస్తో కూస్తో కేడర్‌ …అన్నో ఇన్నో ఓట్లు ఉన్నది కాంగ్రెస్‌ పార్టీకే. అందుకే కాంగ్రెస్‌ పార్టీని ఫీనిక్స్‌ తో పోలుస్తుంటారు. ఎప్పుడేమైనా జరగొచ్చు. అందుకని కెసీఆర్‌ ఈ పరిస్థితి నుండి బయటపడక ముందే కాంగ్రెస్‌ ని మరింత తొక్కేయటానికి ముందస్తు వ్యూహం పనికొచ్చే అవకాశం ఉంది.

2023 చివరిదాకా ఆగితే పరిస్థితి ఎలాగైనా మారొచ్చు. బీజేపీ కొంత బలం పుంజుకునే అవకాశం ఉండొచ్చు. ఇది జరగకూడదు అంటే, బీజేపీకి బలపడే సమయం ఇవ్వకూడదు. బీజేపీ ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపిస్తున్నా, గ్రామీణ స్థాయిలో మాత్రం బలపడలేదు. నాగార్జున సాగర్‌ దాన్ని రుజువు చేసింది. బిజెపికి క్యాడర్ లేదు. అయినా, కాస్త సమయం ఇస్తే, బెంగాల్‌ పై నేతలంతా మూగినట్టు… ఇక్కడా కమలం నేతలు చేరే అవకాశం ఉంటుంది. అక్కడ రెండు సీట్ల నుండి 80పైగా సీట్లకు ఎగబాకింది బిజెపి. ఓ దశలో గెలుస్తుందా అనే అభిప్రాయం కలిగించింది. మోదీ, అమిత్‌ షా నుంచి అందరూ బెంగాల్‌ లోనే మొహరించారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేలా…ఇప్పుడే చకచకా ఎన్నికల వైపు అడుగులు వేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here