Home News

కడియం ఇంట్లో విందుకు..హుజురాబాద్ ఉపఎన్నికకు లింక్ ఇదే..!

సీఎం కేసీఆర్‍ వరంగల్ టూర్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ ఎప్పుడు వరంగల్ వచ్చిన విడిది మాత్రం కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లోనే ఉండేది. అలాంటిది ఈసారి అనూహ్యంగా వరంగల్ పర్యటనలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో లంచ్‍ చేశారు సీఎం కేసీఆర్. కొంతకాలంగా కడియం శ్రీహరికి పార్టీలో ప్రాధాన్యం తగ్గించారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ సడెన్‌గా కడియం ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది. దీంతో కడియం ఇంటికి కేసీఆర్ వెళ్లడం హుజురాబాద్ ఉపఎన్నికకు ఉన్న లింక్ పై కొత్త చర్చకు ఈ టూర్ తెరలేపింది.

కేసీఆర్ కడియం ఇంట్లో విందు వెనుక వెనక మర్మం ఏమై ఉంటుంది.. రాజకీయంగా ఏమైనా మార్పులు జరుగుతాయా అని పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరిని మరోసారి ఎమ్మెల్సీని చేస్తారా అలాగే హుజురాబాద్‌ టికెట్‌ పై ఆశలు పెట్టుకున్న కెప్టెన్‌ కుటుంబానికి పరోక్ష సంకేతాలు ఏమైనా ఇచ్చారా అన్నది ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ కేడర్‌లోనే కాదు ఏ ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసినా ఇదే చర్చ నడుస్తుంది. ఈటల బర్తరఫ్ సమయంనుంచి హుజురాబాద్ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కెప్టెన్ ఫ్యామిలీ. ఎన్నికల్లో తమ కుంటుంబం నుంచే అభ్యర్ది ఉంటారనే రేంజ్ లో ప్రచారం మొదలు పెట్టింది.

మరో వైపు కేసీఆర్ తొలివిడత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు కడియం శ్రీహరి. అధినేత తర్వాత అంతటి స్థానాన్ని అనుభవించారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కడియానికి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఆయన్ని సీఎం దూరం పెట్టారని ప్రచారం సాగింది. ఒకప్పడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలను శాసించిన కడియం ప్రస్తుతం ఆదరణ లేక, రాజకీయాల్లో ఉన్నారో లేరో అన్నట్టుగా సైలెంట్‌ అయ్యారు. మళ్లీ ఎమ్మెల్సీ డౌట్‌ అన్నవారూ ఉన్నారు. ఇదే సమయంలో రాజకీయ భవిష్యత్ కోసం కడియం పక్కపార్టీ వైపు కన్నేశారని ప్రచారం జరిగింది. కుమార్తెను రాజకీయాల్లో దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ.. బీజేపీ ఆయనపై ఫోకస్‌ పెట్టినట్టు చెబుతున్నారు.

ఈ తరహా ప్రచారాల మధ్య సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా కడియం ఇంటికి విందుకు రావడంతో సీన్‌ మారిపోయింది. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో టీఆర్ఎస్ అభ్యర్దిత్వం పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే కెప్టెన్ ఫ్యామిలీతో పాటు మాజీ ఎంపీ వినోద్,మాజీ మంత్రి మద్దసాని కుటుంబం పలువురు బీసీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కేసీఆర్ కడియం ఇంటి వచ్చి కెప్టెన్ కి చెక్ పెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఇప్పటికే కెప్టెన్ కి రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉండగా కుమారుడు వొడితెల సతీష్ కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ అదే కుటుంబానికి టిక్కెట్ అంటే కష్టం అనే అభిప్రాయం పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతుంది. మరి.. ఈ విందు రాజకీయం టీఆర్‌ఎస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here