Home News

రెండు రాష్ట్రాల జలజగడం వెనుక లొగుట్టు ఇదే..టార్గెట్ బీజేపీ !

సీఎం కేసీఆర్ ఉన్నపళంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై యుద్దం ప్రకటించారు. అదికూడా కేబినెట్ ఎజెండాలో పెట్టి మరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా వెనుక ఓ రాజకీయ వ్యూహం ఉంటుంది. ఏపీ సీఎం జగన్ తో మనకు వైరముందని ప్రత్యేకించి పదిమందికి తెలిసే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందంటూ మరో వైపు కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు. మంత్రులూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ కేబినెట్ లో కీలకమంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రజల పై పరుషమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీని పై లోతుగా విశ్లేషిస్తే బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణలో జరిగిన రాజకీయపరిణామాల్లో కీలకమైంది ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక.. అయినా ఆయా అంశాలను తన రాజకీయ అజెండాలో పెట్టుకుని మంత్రులతో చర్చించలేదు. అంటే బీజేపీపై రాజకీయ విమర్శలకు తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చెప్పాలి. అంతర్గత కోణంలో బీజేపీని రాష్ట్రంలో ఇరుకున పెట్టే కొత్త అజెండా తో కేసీఆర్ కదులుతున్నారు. ఏపీ సీఎం పైన మాత్రమే మంత్రులతో మాట్లాడారు. సీఎం సీరియస్ గా ఉన్నారంటే మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు చెలరేగి పోతారు. కచ్చితంగా కేసీఆర్ కు కావాల్సింది అదే. అందుకే సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రాతో విభేదాల వల్ల తెలంగాణకు వచ్చే నష్టమేమీ లేదు. ఎంతోకొంత టీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనమే తప్ప.

తెలంగాణ పై బీజేపీ ఫోకస్ పెట్టడం మరోవైపు కాంగ్రెసు పూర్తిగా బలహీన పడలేదు…రెండు పార్టీలను తెలంగాణలో ఇరుకున పెట్టాలంటే అంతర్రాష్ట్ర అజెండాను తలకెత్తుకోవడమే మార్గంగా కనిపిస్తుంది. బీజేపీ, కాంగ్రెసులు ఏపీతో తగాదాలపై టీఆర్ఎస్ తరహాలో మాట్లాడలేవు. జాతీయ పార్టీలుగా వాటికి కొన్ని బాధ్యతలు, పరిధులు, పరిమితులు ఉంటాయి. అందులోనూ నీటి పై దోపిడీ చేస్తున్నారనే అంశం సంక్లిష్టమైన రాజకీయ అంశం. అటు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి అన్ని రాష్ట్రాలతో ముడి పడి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెసు, బీజేపీలను కూడా గోదాలోకి లాగుతున్నారు. నిజానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ కు పెద్దగా విభేదాలేమీ లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కి వెన్నుదన్నుగా నిలిచారు కేసీఆర్. ఒకదశలో ఇరు రాష్ట్రాల సీఎంలు గోదావరి,కృష్ణా నదుల అనుసంధానం పై సమావేశాలు సైతం నిర్వహించారు.

తాజాగా జగన్ చేపట్టిన ఆర్డీఎస్ పనులు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు నీళ్ల ప్రస్తావనతో జగన్ మోహన్ రెడ్డి కంటే బీజేపీనే టార్గెట్ చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెబుతున్నారంటే తన కోటలోకి దూసుకువస్తున్న కమలం పార్టీకి హస్తినలోనే చెక్ పెట్టాలనే వ్యూహంతో కేసీఆర్ వెళ్తున్నారు. మరో వైపు తెలంగాణలో వైసీపీ చాప చుట్టేసింది. కానీ షర్మిల రూపంలో మరో కొత్త కుంపటిని తన తలపై తెచ్చి పెట్టారనేది కేసీఆర్ అనుమానం. నిజానికి షర్మిల పార్టీకి రాజకీయంగా తెలంగాణలో పెద్దగా స్టేక్స్ లేవు. రెండు మూడు శాతం ఓట్లు తెచ్చుకుంటే గొప్ప విషయమే అనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే షర్మిల చీల్చే ఆ ఓట్లు టీఆర్ఎస్ కే నష్టం అన్న ఆందోళన ఉంది. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలలో మెజారిటీ ఓటింగు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తోంది. షర్మిల సైతం అదే వర్గాల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇది కేసీఆర్ కి ఇబ్బందికరంగా మారడంతో ఇలా ఎదురుదాడికి సిద్దమయ్యారన్న చర్చ నడుస్తుంది.

జల వనరుల పంపకాలు, ఎత్తిపోతల పథకాల వంటి విషయాలు రెండు రాష్ట్రాల మధ్య అంత తొందరగా తెమిలిపోయే విషయాలు కాదు. ఆ వివాదాలు అలా సాగుతూనే ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సందర్భాల్లో ప్రయోజనం కలిగిస్తూనే ఉంటాయి. తర్వాత సద్దుమణుగుతుంటాయి. తమ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు రాజకీయ పోరాటం సాగిస్తున్నట్లు ఇరు ప్రాంతాల ప్రజలను నాయకులు నమ్మిస్తూ ఉంటారు. కానీ దీని వెనుక వేరే ఆంతర్యం ఉండటం ఇక్కడ గమనించదగ్గ అంశం..ఇక వచ్చే రోజుల్లో కేసీఆర్ ఆర్డీఎస్ వద్ద పర్యటించి మరింత రచ్చ లేపిన ఆశ్చర్యం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here