Home News

ఈటల సన్నిహితులైన ఆ ఎంపీ,ఎమ్మెల్యే పై కన్నేసిన కేసీఆర్..!

ఈటల ఎపిసోడ్ తర్వాత టీఆర్‌ఎస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రికి సన్నిహితులైన ఎంపీ,ఎమ్మెల్యే వైపు అందరి చూపు పడింది. తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనుచరులతో డిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. గులాబీ పార్టీతో ఈటల తెగతెంపులు తర్వాత టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన సన్నిహితుల పరిస్థితి ఏంటన్న అంశంపై లేటెస్ట్‌గా చర్చ మొదలైంది.

మాజీ మంత్రికి అత్యంత సన్నిహితులైన ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులపై హట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. వారివైపే టీఆర్‌ఎస్‌ వర్గాలు చూస్తున్నాయి. ఈటల రాజేందర్‌కు ఉద్యమ సమయం నుంచి సన్నిహితుడుగా ఉన్నారు మానుకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాల వల్ల ఈటలతో కలిసి రసమయి ముందుకు సాగారన్న వాదనలు ఉన్నాయి. అప్పట్లో గులాబీ జెండాకు ఓనర్లం మేము అని ఈటల కామెంట్ చేసిన మరుసటిరోజు..ఆయనతో హైదరబాద్‌లో భేటీ అయ్యారు రసమయి. ఒక కార్యక్రమంలో రసమయి పాడిన పాటపై చర్చ కూడా జరుగుతోంది.

ఈటల టీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే రసమయి పరిస్థితి ఏంటన్న ప్రశ్న నడుస్తుంది. టీఆర్‌ఎస్‌లో ఈటలకు మరొక సన్నిహితుడు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి. మొదటి నుంచి ఈటలకు రంజీత్ రెడ్డికి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరు కలసి వ్యాపారాలు కూడా నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రంజీత్ రెడ్డి. వ్యాపారాలతో పాటు ఇద్దరు కలసి పలు భూముల కొనుగోళ్లు చేసినట్టు రాజకీయ వర్గాల టాక్‌. అందుకే తాజా పరిణామాలతో ఎంపీ ఎటువంటి వైఖరిని తీసుకుంటారన్న చర్చ పార్టీలో మొదలైంది.

ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వెళ్లిన తర్వాత టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కొక్కరుగా మాజీ మంత్రిపై ఫైర్‌ అవుతున్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడేందుకో ఏమో విమర్శించడానికి నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఆ జాబితాలో ఎంపీ రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇంకా చేరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెదవి విప్పకుండా మౌనంగా ఉండటమే బెటర్‌ ఈ ఇద్దరు నేతలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరి పై టీఆర్‌ఎస్‌ వర్గాలు ఓ కన్నేసినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here