వసుదేవుడంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు. ఇక అధికారంకోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమని ఉత్తరాదినుంచి ఈశాన్యరాష్ట్రాలదాకా రాజీ రాజకీయాలు నడుపుతున్న బీజేపీ ఎంత? దక్షిణాదిలో కాషాయజెండా ఎగరేయాలని తెగ ఉబలాటపడుతున్న బీజేపీ…కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనుకుంటోంది. కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వేలు చెబుతుండటంతో అదే జరిగితే ఏం చేయాలనేదానిపై మోడీషా మంత్రాంగంలో మునిగితేలారు. అవసరమైతే వేరొకరికి మద్దతిచ్చయినా తెరవెనుక తానే చక్రం తిప్పాలన్న లక్ష్యంతో ఉంది బీజేపీ.
సర్వేల ప్రకారమే చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుంది కానీ..ఒంటరిగా అధికారంలోకి వచ్చేందుకు సరిపడా మ్యాజిక్ ఫిగర్‌ని అందుకోవడం మాత్రం కష్టమే. కాంగ్రెస్‌పార్టీకి వందనుంచి 110 సీట్లదాకా వస్తాయని సర్వేలు లెక్కకడుతున్నాయి. బీజేపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా సీట్లు 80కి మించవంటున్నారు. కన్నడనాట ఇప్పుడు దేవెగౌడ పార్టీ కూడా దూకుడు మీదే ఉంది. జేడీఎస్‌కి 40 నుంచి 50 సీట్లదాకా రావచ్చనే అంచనాలున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్‌కి అధికారపగ్గాలు దక్కకుండా చూసేందుకు బీజేపీ ఇప్పట్నించే జేడీఎస్‌ని దువ్వుతోంది. కాంగ్రెస్‌ని ప్రతిపక్షస్థానానికే పరిమితం చేసేందుకు జేడీఎస్‌తో చేయి కలిపేందుకు సిద్ధపడుతోంది. కింగ్‌మేకర్ పాత్ర పోషించే అవకాశమున్న దేవెగౌడతో దోస్తీకి తహతహలాడుతోంది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వంనుంచి కొందరు దూతలు దేవెగౌడని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించినప్పటికీ అధికారం చేపట్టడానికి అవసరమైన సంఖ్యాబలం రాదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసం ఎలాంటి రాజీకైనా సిద్ధపడతామని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కాంగ్రెస్‌కు గతంలో మాదిరి 240 స్థానాల్లో 122 సీట్లు వచ్చే అవకాశాలు లేవని, ఆ పార్టీకి 100-110 సీట్లు వస్తాయని, బీజేపీ 70-80 సీట్లు సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉందని చెప్పొచ్చారు ఆ దూతలు. ఈ వ్యవహారాన్నంతా గ్రహించిన కాంగ్రెస్ బీజేపీ-జేడీఎస్ అనైతిక బంధాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలనుకుంటోంది.