Home News Politics

రాజ్‌భ‌వ‌న్ రాజ‌కీయం

గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌య‌మే కీల‌కం

అనుకున్న‌ట్లే జ‌రిగింది. క‌న్న‌డ‌నాట ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన సంపూర్ణ‌మెజారిటీ ఏ పార్టీకీ రాలేదు. మ్యాజిక్ ఫిగ‌ర్‌కి ఎనిమిది సీట్ల దూరంలో ఆగిపోయింది బీజేపీ. జేడీఎస్‌కి బేష‌ర‌తు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ ఉమ్మ‌డి ప్ర‌భుత్వానికి సిద్ధ‌మంటోంది. ప‌దేళ్ల త‌ర్వాత అధికారపీఠంపై ఆశ‌లు పెట్టుకుంటే ఇలా జ‌రిగిందేంటా అని య‌డ్యూర‌ప్ప బాధ‌ప‌డుతున్నారు. అత్య‌ధిక సీట్లు గెలుచుకున్న బీజేపీకే అవ‌కాశం ఇవ్వాలంటూ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిశారు బీజేపీ సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప‌. మ‌రోవైపు కాంగ్రెస్‌-జేడీఎస్ క‌లిస్తే 116 సీట్లు కావ‌టంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌మ‌ను ఆహ్వానించాల‌ని ఆ రెండుపార్టీలు కోరుతున్నాయి. అదేమంటే ఎస్సార్ బొమ్మై కేసుని గుర్తుచేస్తున్నాయి.

ఇప్పుడు క‌ర్ణాట‌క పీఠంపై ఎవ‌రిని కూర్చోబెట్టాల‌న్న విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌య‌మే కీల‌కం. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా ఒక‌ప్పుడు గుజరాత్ బీజేపీలో కీలక నేత. 1970ల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆరెస్సెస్‌తో విడ‌దీయ‌రాని అనుబంధం ఆయ‌న‌ది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 11 నెలలు జైలులో గడిపిన చరిత్ర ఉన్న గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌. గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన వాజూభాయ్‌ వాలాని 2014లో కర్నాటక గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడాయ‌న తీసుకునే నిర్ణ‌యంపైనే క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుచేసేది ఎవ‌ర‌నేది తేలిపోతుంది.

అతి పెద్ద పార్టీగా బీజేపీకే ఆయన మొదట అవకాశం ఇస్తార‌నే భావిస్తున్నారు. బల నిరూపణకు ఇప్ప‌టికే య‌డ్యూర‌ప్ప వారం రోజుల గ‌డువు కోరినందున వీలైనంత ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉంది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేడీఎస్, కాంగ్రెస్‌ల‌ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే బీజేపీ స‌ర్కారుకు ఏ ఢోకా ఉండ‌దు. ఇప్ప‌టికే దేవ‌గౌడ పెద్ద కుమారుడు రేవ‌ణ్ణ బీజేపీవైపు మొగ్గుతున్నాడు. రేవ‌ణ్ణ స‌హా ప‌న్నెండు మంది జేడీఎస్ స‌భ్యుల మ‌ద్ద‌తున్న‌ట్లు బీజేపీ చెబుతోంది. ఇదేకాకుండా కాంగ్రెస్ మాజీ మంత్రి శివ‌కుమార్‌కూడా బీజేపీ వైపు చూస్తున్నాడు. ఆయ‌న కోరుకున్న ప‌ద‌వి ఇస్తే ఓ ప‌దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకొచ్చే అవ‌కాశం ఉంది.

గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా… అక్కడ బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. తమిళనాడులో శశికళ ముఖ్యమంత్రి అవుతార‌నుకున్న స‌మ‌యంలో రాజ్‌భ‌వ‌న్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. చివ‌రికి ప‌ళ‌నిస్వామి నేతృత్వంలో బీజేపీకి అనుకూల ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ప్రస్తుతం కర్ణాటకలోనూ గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ద్వారా బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం త‌న ఆలోచ‌న‌ను అమ‌లుచేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. యడ్యూరప్పకే తొలి అవకాశం ఇవ్వ‌డం.. లేనిపక్షంలో బీజేపీ- జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటు.. లేదంటే ప్ర‌తిష్ఠంభ‌న‌ను చూపించి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయ‌డం…క‌ర్ణాట‌క‌లో గ‌వ‌ర్న‌ర్ ముందున్న ఆప్ష‌న్స్ ఇవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here