Home News Politics

కరీంనగర్ లో కూటమిలో సీట్ల పంచాయతి…!

కాంగ్రెస్‌ కూటమి ఇంకా అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించలేదు .. అయినా కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీలు పుట్టుకొస్తున్నాయి… ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు స్థానాలకు తెలంగాణ పీసీసీ, స్క్రీనింగ్‌ కమిటీలు ..’సింగిల్‌ నేమ్‌’తో ..అభ్యర్థుల జాబితా పంపారన్న ప్రచారంతో వివాదం రేగుతోంది .. రాహుల్‌గాంధీ సూచించిన మార్గదర్శకాలకు భిన్నంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారంటూ పలువురు నిరసన గళం విప్పుతున్నారు…

కరీంనగర్‌ పాత జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మంథని, జగిత్యాల, సిరిసిల్ల సెగ్మెంట్లు మినహా.. మిగిలిన వాటికి కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా కోసం పిసీసీ ఒకే పేరును ప్రతిపాదించిందన్న ప్రచారంతో ఆ పార్టీలో నిరసన గళాలు మిన్నంటుతున్నాయి… పొత్తుల లెక్క ఎలా ఉన్నా.. జగిత్యాల, మంథని, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, కేకే.మహేందర్‌ రెడ్డి పేర్లను మాత్రమే ప్రతిపాదించినా వ్యతిరేకత తలెత్తలేదు .. కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పేరును అధిష్టానమే ప్రతిపాదించగా.. మిగతా స్థానాల్లో ఒకే పేరును ప్రతిపాదించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్‌ నుంచి పొన్నం ప్రభాకర్, చల్మెడ లక్ష్మీనర్సింహరావు, కటకం మృత్యుంజయం, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, రేగులపాటి రమ్యారావుతోపాటు 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడ టికెట్‌ దాదాపుగా ఖరారైంది… దాంతో మిగిలిన వారు గొడవకు దిగే అవకాశం ఉంది.

హుస్నాబాద్‌ స్థానాన్ని కూటమిలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గట్టిగా అడుగుతున్నారు… కాంగ్రెస్‌ మాత్రం తమ పార్టీ అభ్యర్థినే బరిలో దింపాలనుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ శ్రీరామ్, బొమ్మ వెంకటేశ్వర్లు ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ రేసులో ఉండగా.. ఒకే పేరును పంపారన్న ప్రచారం వివాదాస్పదం అవుతోంది. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్‌తో పాటు ఏడుగురు పోటీ పడుతున్నారు. .. ఇందులో కౌశిక్‌రెడ్డి ఒక్క పేరును ఏఐసీసీకి పంపారని మిగిలిన ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… కౌశిక్‌రెడ్డి పేరు పంపడానికి, తమ పేర్లను ప్రతిపాదించకపోవడానికి కారణాలు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పెద్దపల్లి నుంచి ఈర్ల కొమురయ్య, డాక్టర్‌ గీట్ల సవితారెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి, బల్మూరు వెంకట్‌తో పాటు ఏడాదిక్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్‌.విజయరమణరావు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు… వారిలో విజయరమణరావుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది .. దాంతో ఆయనకు తప్ప తమలో ఎవరికి ఇచ్చినా ఫరవాలేదంటూ మిగిలిన ఆశావహులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు…మానుకొండూరు టికెట్‌ కోసం ఆరేపల్లి మోహన్, డాక్టర్‌ కవ్వంపెల్లి సత్యనారాయణ, దరువు ఎల్లన్న దరఖాస్తు చేసుకున్నారు… కవ్వంపెల్లికి ధర్మపురి నుంచి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఉండగా.. మానకొండూరు కోసం ఆరేపెల్లి మోహన్‌ ఒక్కరి పేరే పంపారన్న ప్రచారం ఆ పార్టీలో చర్చగా మారింది.

చొప్పదండి నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, పీసీసీ అధికార ప్రతినిధులు మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతంతోపాటు 10 మంది దరఖాస్తు చేసుకోగా.. పైముగ్గురిలో ఒకరికి టికెట్‌ లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి మేడిపల్లి సత్యం పేరును ప్రతిపాదించారన్న వివాదం చొప్పదండిలో రగులుతోంది.
ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మద్దెల రవీందర్‌తోపాటు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అడ్లూరి వరుసగా మూడు సార్లు ఓడిపోయిన క్యాండెట్‌ అవ్వడంతో మిగతా వారు టికెట్‌పై చాలా ఆశలే పెట్టుకున్నారు … మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ రేవంత్‌రెడ్డి టీమ్‌తో కాంగ్రెస్‌లో చేరిన కవ్వంపెల్లి సత్యనారాయణ పేరు కూడా పరిశీలనలో ఉంది.

వేములవాడలో గత ఎన్నికల్లో పోటీచేసిన బొమ్మ వెంకటేశ్వర్‌ ఈసారి దూరంగా ఉండగా.. ఏనుగు మనోహర్‌రెడ్డి, కొనగాల మహేశ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు… 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ రెండునెలల క్రితం కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ రేసులో ఉన్నారు… ఇప్పుడు ఆది శ్రీనివాస్‌ పేరు ఒక్కటే ఏఐసిసికి పంపారన్న ప్రచారంతో 25 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న నేతలు అసంతృప్తికి గురవుతున్నారు… పార్టీ మారి వచ్చిన వారిని ఎలా ప్రతిపాదిస్తారని నిలదీస్తున్నారు. కోరుట్లలో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు .. దాంతో కొమొరెడ్డి రాములుతోపాటు టీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి రత్నాకర్‌రావు కుమారుడు జువ్వాడి నర్సింగరావు పేరు పరిశీలనలో ఉన్నాయి. .. టికెట్‌ కమిట్‌మెంట్‌తోనే నర్సింగరావు వెళ్లి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు వార్తలు వస్తుండటం స్థానిక కాంగ్రెస్‌లో అలజడి రేపుతోంది..

రామగుండంలో రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్, ఐఎన్‌టీయూసీ నాయకుడు బి.జనక్‌ప్రసాద్‌తోపాటు ఐదుగురు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరి మధ్యే పోటీ కనిపిస్తోంది.. అయితే ఇక్కడి నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పోటీ చేస్తారన్న ప్రచారం కొత్తగా తెరపైకి వచ్చింది… పొత్తుల లెక్కలు పక్కనపెడితే ..ఎవరిని సంప్రదించకుండా రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ పేరునే పిసీసీ ప్రతిపాదించినట్లు జరుగుతున్న ప్రచారం స్థానిక కాంగ్రెస్‌లో అసంతృప్తికి కారణమమవుతోంది… మొత్తమ్మీద అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించకుండానే ఆశావహులు సిగపట్లకు దిగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here