Home News Politics

కరీంనగర్ గడ్డ పై కాంగ్రెస్ ఎక్కడ…?

తెలంగాణకు అది ఉద్యమ కేంద్రం, ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. ఎప్పుడు అధికార పార్టీకి ధిక్కార స్వరం వినిపించే కేంద్రం. ఎందుకో ఇక్కడ విపక్షం ఈ సారి పోటీకే జంకుతోంది. అధికార పార్టీకి ఆమడ దూరంలో ఉంటున్నది. విపక్ష పోరాటాల్లో ముందున్న కరీంనగర్ కాంగ్రెస్ లో నాయకల కొరత ఉందా…పోటీకి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్ కి పెట్టని కోటగా ఉండే కరీంనగర్ అసెంబ్లీలో నేతలున్నా పోటీ అంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్రం. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో, ఆ తర్వాత తెలంగాణలోనూ రాజకీయంగా పేరున్న జిల్లా కూడా. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని అందించిన జిల్లా. ఇక్కడ రాజకీయాలు చేసే వారంతా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వారే…మాజీ ప్రదాని పీవీ, మాజీ స్పీకర్ శ్రీపాదరావు, మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి, మాజీ సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్ రావు, చొక్కారావు….వీరంతా నాటి తరం నేతలు. ఈ తరం నేతల్లో సిఎం కేసిఆర్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి ఎమ్మెస్సార్, జీవన్ రెడ్డి, వినోద్ లాంటి వారు కూడా జాతీయ రాజకీయాల్లో కీ రోల్ లీడర్సే. కరీంనగర్ అసెంబ్లీ నుండి ఎన్నికై మంత్రులయిన వారూ ఉన్నారు. ఎస్సీ, బిసీ, మైనార్టీల ఓట్లే అధికంగా ఉన్నా సామాజికంగా ఇది వెలమలకు కంచుకోట. కాని ఇప్పుడు అదే వెలమ సామాజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో నేతలను వెతుక్కోవాల్సిన పరిస్థితి.

ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కోలాహాలం ప్రారంభం కాగానే కరీంనగర్ అసెంబ్లీపైనే చర్చ సాగుతోంది. కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు రంగంలో ఉంటారన్నది జోరుగా చర్చ నడుస్తోంది. తాజా తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొన్నం ప్రభాకర్. ఇటీవలే టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. తెలంగాణ విషయంలో ఇటు పార్టీలో అటు పార్లమెంట్ లో తన గళం విప్పి తనదైన ఉనికిని చాటుకున్న పొన్నం ప్రభాకర్ జిల్లా కేంద్రంలో పార్టీ ఉనికిని కూడా కాపాడుతూ వస్తున్నారు. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడై జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయన లభించిన స్వాగతం అంతా ఇంతా కాదు…ఒక దశలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిందని కేసులు కూడా నమోదయ్యాయి…

అంటే ఆ ర్యాలీని చూసి కరీంనగర్ కాంగ్రెస్ చాల బలంగా ఉందన్నది అందరి వాదన. అది కరెక్టే కాని మరి పోటీలో ఎవరు ఉంటారన్నదే ప్రశ్న. గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన చల్మడ లక్ష్మినర్సింహారావు గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాకు దూరంగా ఉంటున్నారు. ఆయన అనుచరులు ఎప్పుడో అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కాలం కలిసొస్తే చల్మడ కూడా అధికార పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారట. మరి కరీంనగర్ అసెంబ్లీ నుండి ఎవరుంటారబ్బా అని నేతల్లోనే ఓ విధమైన చర్చ. ఇటీవల యాక్టీవ్ గా తిరుగుతున్న కేసిఆర్ బందువు కల్వకుంట్ల రమ్య రావు ఉన్నా ఆమే అసెంబ్లీకి సరిపోదని వాదన.

ఇక అందరి చూపంతా ఫైర్ బ్రాండ్ పొన్నం పైనే… కాంగ్రెస్ పార్టీలో ఎంత యాక్టీవ్ గా పొన్నం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంటేనే వైరాగ్యంతో ఉంటున్నారట. కరీంనగర్ నుండి పొన్నం బరిలోకి దింపితేనే పార్టీ విజయ సాదిస్తుందని ఆయన అనుచరులు, పార్టీ వర్గాలు ఒత్తిడి తెస్తున్నా ఆయనెందుకు ఓ అడుగు వెనక్కి వేస్తున్నారట.అయితే పొన్నం అనుచరులు, పార్టీ ముఖ్యుల నుండి వస్తున్న భిన్న వాదనలు ఆలోచింపచేస్తున్నాయి. కరీంనగర్ లో అధికార పార్టీ నుండి బరిలో ఉన్న గంగుల కమలాకర్ అంటే పొన్నం కు ఎందుకో సాఫ్ట్ కార్నర్ అట. వీరిద్దరు పాత మిత్రులు కావడం వల్ల పొన్నం పోటీపై ఆలోచిస్తున్నారట. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు ఫైర్ బ్రాండ్ గా పేరుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుకుంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు,ఎంపీ కవితను అవసరమైన సందర్భాలలలో విమర్శిస్తుంటారు. కాని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒకరిద్దరి పట్ల పొన్నం సానుకూల దృక్పథంతో, స్నేహపూర్వక ‘శతృత్వాన్ని’ కొనసాగిస్తున్నారట.


కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీరుపై పలు పలు ఆరోపణలున్నప్పటికీ పొన్నం ప్రభాకర్ ఆయన ‘జొలికి’ పోవడం లేదన్న విమర్శ ఉంది. వక్ఫ్‌బోర్డ్‌ భూములు, సీతారాంపూర్‌ భూకుంభకోణాల ఆరోపణలు, స్మార్ట్‌సిటీ నిధుల వాడకానికి సంబంధించి తన కాంట్రాక్టర్లతోనే పనులు నడిపిస్తున్నారన్న ఆరోపణల విషయంలోగానీ ఎక్కడా, ఎప్పుడూ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడకపోవడం రాజకీయంగా చర్చ కు దారి తీస్తున్నది. అంతేకాదు… అధికార, ప్రతిపక్షాలకు మధ్య పెద్ద రాజకీయ రగడకు తెరతీసిన ఆర్ట్స్‌ కళాశాల కూల్చివేత విషయంలోనూ పొన్నం ‘మౌనం’ అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఇద్దరూ మంచి ‘స్నేహితులు’. ఇద్దరూ గతంలో ఒకే బడిలో చదువుకున్నారట. ఇప్పటికీ అరేయ్ అనుకునే ఈ ఇద్దరు నేతల క్యాడర్ మాత్రం రాజకీయంగా గందరగోళంలో ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ‘పరస్పర అవగాహన’తో కరీంనగర్‌లో రాజకీయాలు నడుపుతున్నట్టు వాదన ఉంది. అయితే తాజాగా మారిన పరిస్థితుల నేపధ్యంలో పొన్నం పోటీ చేస్తారా లేదా అన్నది డౌట్ అట.

పొన్నం ఎక్కడ నిలబడ్డా బలమైన అభ్యర్థే. కరీంనగర్ నుండి బరిలో దిగకపోతే హుజురాబాద్ నుండి పోటీ చేయాలని ఒత్తిడి కూడా ఉంది. కాని ఇక్కడ అదే పరిస్థితి. ఇక మంత్రి ఈటెల రాజేందర్‌ కూడా బీసీ సామాజికవర్గం వారే కావడంతో పొన్నం ప్రభాకర్ మంత్రి పట్ల కూడా ‘ సానుభూతి’ గా ఉంటున్నట్టు సమాచారం. కొన్ని సందర్భాలలో మంత్రి ఈటెల పై మాట్లాడినా అందులో ‘పదును’ ఉండడం లేదని అంటున్నారు.

మిత్రుత్వం ముఖ్యమా…రాజకీయంగా ఎదుర్కోవడం సుముఖమా అన్నది పొన్నం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here