Home News Stories

కరీంనగర్‌ కోటలో జంగ్ సైరన్ ….త్రిముఖ పోటీలో గెలుపెవరిది…?

పోరాటల పురిటి గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు లాంటి కరీంనగర్ లో రాజకీయం ఎలా ఉంది. ముందస్తు ఎన్నికలు రావడంతో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో హ్యాట్రిక్‌ కొట్టాలని ఒకరు! తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మరో ఇద్దరు! రెండుసార్లు ఎమ్మెల్యేది అభివృద్ధి నినాదం! హస్తం పార్టీ అభ్యర్ధి మాజీ ఎంపీ ఉద్యమంలో పోరాటయోధుడు! ‘అధ్యక్షా!’ అనాలని ఉవ్విళ్లూరుతున్న మరొకరిది హిందుత్వ వాదం! ముగ్గురూ యోధాను యోధులే! అందుకే ఈసారి కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా సాగుతోంది. కరీంనగర్ రాజకీయ ముఖ చిత్రం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…

కరీంనగర్‌ నుంచి మూడోసారి గెలిచి.. హ్యాట్రిక్‌ కొట్టాలని బరిలో నిలిచారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌. ఉద్యమ కాలంలో పార్లమెంటులోనూ, ఢిల్లీలోనూ పోరాటం చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటి ఇచ్చి రెండవస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ ఈసారి విన్నర్‌ కావాలని మళ్లీ పోటీ చేస్తున్నారు. దాంతో, ఇక్కడ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. వెలమలు ఆధిపత్యం చెలాయించే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముగ్గురూ బీసీ అభ్యర్థులే కావడం విశేషం.

కరీంనగర్‌ నుంచి ఇప్పటి వరకూ బీసీలు రెండుసార్లు విజయం సాధించగా.. ఆ రెండుసార్లు గెలిచింది కమలాకరే. కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనతికాలంలోనే శాసనసభ్యుడిగా ఎదిగారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. వెలమల కోటలో బీసీ అభ్యర్థి గెలుపును నమోదు చేయడం అదే ప్రథమం. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రెండో విజయాన్ని సాధించారు. ఈసారి హ్యాట్రిక్‌ కొట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యే నుంచి ఆ పై స్థాయికి ప్రమోషన్‌ పొందాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, పట్టణంలో తాను చేసిన అభివృద్ధిని ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక దఫా ప్రచారం పూర్తి చేసుకొని రెండో విడతకు శ్రీకారం చుట్టారు.


గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన సంజయ్‌కుమార్‌ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అటు హిందుత్వ నినాదం, ఇటు మోదీ అభివృద్ధి వాదంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అమిత్‌ షా నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి వెళ్లగా.. ప్రచార పర్వం ముగిసేలోగా పలువురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించి పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలని సంజయ్‌ చూస్తున్నారు.


మాజీ సీఎం వైఎస్‌ ఆశీస్సులతో ఎంపీ అయిన పొన్నం ప్రభాకర్‌.. తెలంగాణ ఉద్యమ కాలంలో క్రియాశీలంగా వ్యవహరించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించలేదు. దాంతో, ఈసారి కూడా ఆయన పార్లమెంట్‌కే పోటీ చేస్తారని భావించారు. కానీ, అనూహ్యంగా అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్‌లో విశేషంగా కృషి చేసిన ఆనాటి పార్టీ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించడంతో పొన్నం కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీకి దిగారు.

కరీంనగర్‌ పట్టణంతోపాటు రెండు మండలాలు మాత్రమే ఉన్న ఈ నియోజకవర్గంలో పట్టణ ఓటర్లు గెలుపును ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ. పట్టణంలోనే 1,48,773 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, విద్యావంతులు అధికం కావడంతో పట్టణంలో పట్టు సాధించినవారే విజయం సాధించే అవకాశం ఉంటుంది. కరీంనగర్‌లో మొదటి నుంచీ వెలమలదే ఆధిపత్యం. ఇప్పటి వరకూ 14 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు వెలమ అభ్యర్థులే గెలిచారు. గడీల సామ్రాజ్యానికి, దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపిన కాలంలోనూ రాజకీయ ఆధిపత్యం వెలమలదే. అలాంటి కరీంనగర్లో ఇప్పుడు తొలిసారిగా వెలమ అభ్యర్థులెవరూ పోటీదారులుగా లేరు. మూడు పార్టీల నుంచీ బీసీ అభ్యర్థులే. కమలాకర్‌, సంజయ్‌ కుమార్‌ మున్నూరు కాపు కాగా.. పొన్నం ప్రభాకర్‌ది గౌడ సామాజికవర్గం.

ఇక హస్తం పార్టీ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ పై గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయాడన్న సానుభూతి ఉంది. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో చేసిన పోరాటం, అందరికీ అందుబాటులో ఉంటాడనే పేరు ప్రభాకర్ కి ప్లస్ పాయింట్స్ అయితే ఎంపీగా ఉన్నప్పుడు నాయకులను ఎదగకుండా చేశాడనే ఆరోపణలు ఆయనకు కొంత మైనస్ గా మారాయి. గులాబీ పార్టీ అభ్యర్ధి గంగుల కమలాకర్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం పై పట్టు సాధించడం,సుమారు వెయ్యి కోట్ల నిధులు తీసుకురావడం,కరీంనగర్‌ పట్టణం స్మార్ట్‌ సిటీగా ఎంపిక కావడం కమలాకర్ కి అనుకూలంగా మారాయి. పనులు వేగవంతం చేయకపోవడంతో సిటీలో కొంత మైనస్ గా మారింది. కమలం పార్టీ అభ్యర్ధి సంజయ్ కుమార్ హిందుత్వ ఎజెండా.. హిందువుల ప్రతినిధిగా యువతలో పేరు సాధించారు. తనకు ఒక చాన్స్ ఇవ్వాలన్న నినాదంతో వెళ్తున్నారు. పార్టీలో ఒంటెద్దు పోకడ పోతాడనే పేరు ఇక్కడ సంజయ్ కి మైనస్ ఏదేమైన ఇక్కడ త్రిముఖ పోరు జిల్లాలో ఉత్కంఠ రేపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here