Home Entertainment Reviews

రివ్యూ: కనులు కనులను దోచాయంటే Kanulu Kanulanu Dochayante Review


నటీనటులు: దుల్కర్ సల్మాన్, గౌతమ్ మీనన్, రితూ వర్మ, రక్షణ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: దేసింగ్ పెరియస్వామి
నిర్మాతలు: వయాకమ్ 18
విడుదల తేదీ: ఫిబ్రవరి 28

మహానటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. దానికి ముందే ఓకే బంగారంతో క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన. ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని కనులు కనులను దోచాయంటే సినిమాతో వచ్చేసాడు. పైగా ఇది ఈయనకు 25వ చిత్రం. మరి దాంతో నిజంగానే దోచేసాడా అనేది చూద్దాం..

కథ:
సిధ్ (దుల్కర్ సల్మాన్) ఓ దొంగ. పక్కా ప్రణాళికలతో పోలీసులను కూడా మాయ చేస్తూ.. ఎవరికి దొరక్కుండా ఆన్‌లైన్ వాడుకుంటూ దొంగతనాలు చేస్తుంటాడు. తనతో పాటే స్నేహితుడు (రక్షణ్) కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసే ఈ ఆన్‌లైన్ క్రైమ్స్ చేస్తుంటారు. ఆ తర్వాత రకరకాలుగా మాయ చేసి సొమ్ము చేసుకుంటారు. అలాంటి సమయంలో సిధ్.. మీరా ఉరఫ్ మధుమిత (రితూ వర్మ) ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో ఉన్నపుడు అనుకోకుండా మీరా గురించి ఓ దారుణమైన నిజం సిధ్‌కు తెలుస్తుంది. అప్పటి వరకు తాము మాత్రమే దొంగలు అనుకుంటే.. వాళ్లు కూడా దొంగలే అని డిసిపీ (గౌతమ్ మీనన్) సాయంతో తెలుస్తుంది. దాంతో వాళ్లను పట్టుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. పట్టుకున్న తర్వాత అంతా కలిసి క్రైమ్స్ చేయడానికి అలవాటు పడతారు. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లేం చేసారు అనేది అసలు కథ..

కథనం:
తెలుగులో ఆన్‌లైన్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తక్కువే. ఇప్పుడు అలాంటి నేఫథ్యంలోనే కథ రాసుకున్నాడు కొత్త దర్శకుడు దేసింగ్ పెరియస్వామి. ముఖ్యంగా మహానటి లాంటి సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులను ఈ తరహా కథతో పలకరించాడు దుల్కర్ సల్మాన్. ఈయన తెలుగు ప్రేక్షకులకు చేరువ కాకముందే ఈయన సినిమాలు ఇక్కడ పరిచయం. దుల్కర్ చిత్రం అంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం ఆయన పెంచుకున్నాడు. ఇప్పుడు ఈయన 25వ సినిమాగా కనులు కనులను దోచాయంటే చిత్రం. ఇందులో కూడా చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. ముఖ్యంగా కథను మొదలుపెట్టడమే ఆసక్తికరంగా మొదలు పెట్టాడు దర్శకుడు దేసింగ్. పక్కాగా కథనం కూడా రాసుకున్నాడు ఈ దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ ఆకట్టుకుంటుంది. కొత్తకొత్తగా ప్లాన్ చేసే క్రైమ్స్ ఆసక్తి పుట్టిస్తాయి. ఇంటర్వెల్ వరకు కూడా హీరోల దొంగతనాలు.. వాటి కోసం హీరో వేసే ప్రణాళికలు భలేగా అనిపిస్తాయి. ఆ తర్వాత హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరిగిపోతుంది. అక్కడ్నుంచి పూర్తిగా మరో కథను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. కథను ఢిల్లీకి మార్చేసి అక్కడ ట్రాప్ మొదలుపెడతాడు. అది కూడా ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్, రితూ వర్మ బ్యాచ్ చుట్టూ సెకండాఫ్‌లో అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. దాంతో పాటు అనీష్ కురివిల్లా ఇంటిని దోచుకునే సీన్స్ కూడా బాగున్నాయి. ఆన్ లైన్ క్రైమ్స్ గురించి పెద్దగా ఏ సినిమాలో కూడా చూపించలేదు. కానీ దీనిపై బాగా వర్కవుట్ చేసాడు కొత్త దర్శకుడు దేసింగ్. చిన్న చిన్న డీటైల్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా చూసుకున్నాడు.. కథనం కూడా రాసుకున్నాడు. ఇక దుల్కర్, రితూ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే అక్కడక్కడా ల్యాగ్ అయింది స్క్రీన్ ప్లే. ఫస్టాఫ్ అంతా ఆసక్తికరంగా సాగినా కూడా డబ్బింగ్ వాసనలు అక్కడక్కడా ఉంటాయి. ఇంటర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై అంచనాలు పెంచేసాడు దర్శకుడు. అప్పటి వరకు హీరో మాత్రమే దొంగ అనుకున్న వాళ్లకు సెకండాఫ్‌లో హీరోయిన్ కూడా దొంగ అని తెలియడం పెద్ద ట్విస్ట్. క్లైమాక్స్‌లో గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా కనులు కనులను దోచాయంటే సినిమా ఆకట్టుకుంటుంది.

నటీనటులు:
దుల్కర్ సల్మాన్ మరోసారి నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. తన 25వ సినిమా కథను పూర్తిగా విభిన్నంగా ఉండేలా ఎంచుకున్నాడు. ఈ సినిమాలో ఎనర్జిటిక్‌గా కనిపించాడు దుల్కర్. ఆయన స్నేహితుడిగా రక్షణ్ బాగా నటించాడు. రితూ వర్మ కూడా చాలా బాగా నటించింది. పెళ్లి చూపులు తర్వాత మరోసారి ఈమె మంచి నటన కనబర్చింది. గౌతమ్ మీనన్ అందరికీ సర్‌ప్రైజ్. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వాన్ని మాత్రమే చూసిన వాళ్లకు నటన కూడా అద్భుతమే అని తెలుస్తుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.

సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. అనువాద చిత్రమే అయినా కూడా పాటలు బాగున్నాయి.. అందులో లిరిక్స్ కూడా బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా నీట్‌గా అనిపించింది. ల్యాగ్ సీన్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా అక్కడక్కడా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం. సినిమాను చిత్రీకరించిన లొకేషన్స్ బాగున్నాయి. దర్శకుడు దేసింగ్ తొలి సినిమాకే మంచి కథను తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా చక్కగా అల్లుకున్నాడు. అనువాద చిత్రమే అయినా కూడా దుల్కర్ సొంత వాయిస్.. రితూ వర్మ తెలుగమ్మాయి కావడంతో మన సినిమా చూసినట్లే అనిపిస్తుంది.

చివరగా:
కనులు కనులను దోచాయంటే.. ఆకట్టుకునే ఆన్‌లైన్ క్రైమ్ డ్రామా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here