Home News Politics

క‌న్నాకి సున్న‌మేనా?

వ‌ద‌ల్లేడు..ఎటూ క‌ద‌ల్లేడా?


ఒక‌ప్పుడు కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్‌. ఏపీలో పార్టీ నిండా మున‌గ‌టంతో బీజేపీలోకొచ్చారు. త‌న సీనియారిటీకి త‌గ్గ‌ట్లు పెద్ద‌పీట వేస్తార‌ని ఊహించారు. కానీ ఎంత పెద్ద పోటుగాడ‌యినా బీజేపీలో న‌లుగురితో పాటు నారాయ‌ణేన‌న్న విష‌యం అర్ధ‌మ‌య్యేస‌రికే ఆల‌స్య‌మైంది. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే కొన్నాళ్లు చ‌క్రం తిప్పొచ్చ‌ని అనుకున్నా చివ‌రికి ఆ ఆశ‌కూడా లేకుండాపోయింది. కాంగ్రెస్ నేప‌థ్య‌మున్న నాయ‌కుడికి బీజేపీ ప‌గ్గాలిస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ పేరుని ప‌క్క‌న‌పెట్టారు. దీంతో త‌ప్ప‌ద‌న్న‌ట్లు బీజేపీతో బ‌ల‌వంతపు సంసారం చేస్తున్న క‌న్నా…వెంట‌నే ఆపార్టీకి గుడ్‌బై చెప్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు.
సీన్ క‌ట్ చేస్తే…క‌న్నా ఆస్ప‌త్రిలో ఉన్నారు. కారణం విప‌రీత‌మైన ఒత్తిడి. వైసీపీలో ఆయ‌న చేరిక వాయిదాప‌డింది. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకున్నారు. ఆస్ప‌త్రినుంచి డిశ్చార్జి అయ్యారు. కారులో వెళ్లి జ‌గ‌న్‌ని క‌లిసి కండువా క‌ప్పుకోవ‌డానికి ఎలాంటి అడ్డంకులూ లేవు. అయితే అదెప్పుడ‌న్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇప్ప‌ట్లో మంచి ముహూర్తం లేక కాదు. క‌న్నా వెళ్ల‌లేకా కాదు. అవ‌త‌లివైపునుంచే అలికిడి లేదు. త‌మ పార్టీలో చేరాల్సిన నాయ‌కుడు ఆస్ప‌త్రి పాలైతే వైసీపీనుంచి ఎవ‌రూ వ‌చ్చి ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదు. క‌న్నా త‌మ పార్టీకి గుడ్‌బై చెప్పేసినా.. బీజేపీ నేతలు సోమువీర్రాజు, మాణిక్యాల‌రావుఇంటికెళ్లి మ‌రీ ప‌రామ‌ర్శించ‌డం విశేషం కాక మ‌రేంటి.
క‌న్నాలాంటి సీనియ‌ర్ పార్టీని వీడ‌కుండా చూసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పి, లేదంటే ఏద‌యినా ప‌ద‌విపై హామీ ఇచ్చి పార్టీలోనే ఉండేలా చూసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌క‌యినా పార్టీ మారే ప్ర‌య‌త్నం వ‌ద్ద‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు క‌న్నాని కోరిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌రే బీజేపీ నుంచి ఎన్ని ప్ర‌య‌త్నాల‌యినా జ‌రుగుతుండొచ్చు..వైసీపీ ఒక్క‌సారిగా సైలెంట్ ఎందుకైంద‌న్న‌దే అంతుప‌ట్ట‌ని విష‌యం.
త‌మ పార్టీని వీడాల‌నుకుంటున్న నేత‌ల‌కు కండువాలు కప్పొద్ద‌ని బీజేపీ పెద్ద‌ల‌నుంచి జ‌గ‌న్‌కి ఆదేశాలున‌చ్చ‌క‌పోతే అభ్య‌ర్థ‌న అనుకోవ‌చ్చు ఉన్నాయ‌నీ..అందుకే క‌న్నా డిమాండ్ల‌కు ముందు ఓకే చెప్పిన వైసీపీ కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండాల‌నుకుంటోంద‌ని వార్త‌లొస్తున్నాయి. అది అబ‌ద్ధ‌మ‌ని కొట్టి పారేయ‌డానికి వీల్లేకుండా..వైసీపీనుంచి ఎవ‌రూ నోరెత్త‌డంలేదు. ఆయ‌న ఏ క్ష‌ణ‌మైనా పార్టీలోకొస్తార‌ని వైసీపీనేత‌లెవ‌రూ చెప్ప‌డంలేదు. అంటే తెర‌వెనుక ఏదో జ‌రిగింద‌నేగా? క‌న్నా అర్జంట్‌గా కండువా మారిస్తేగానీ ఊహాగానాల‌కు తెర‌ప‌డేలా లేదు మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here