Home News Stories

సార్వత్రిక ఎన్నికల ముంగిట కంచుకోటలో కాంగ్రెస్ కష్టాలు….

ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట, పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ఇందిరనే బరిలో దిగిన జిల్లాలో హస్తం పార్టీ ఏటికి ఎదురీదుతుందా…అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది.. ఆ ఎన్నికలకు ముందు నుంచే అక్కడ ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతూ వచ్చింది.. అంతో ఇంతో పేరున్న నాయకులు -హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోతుండటంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు అనేదే కరువైంది ఆ జిల్లాలో.. ఎవరి లెక్కలతో వారు సుదీర్ఘకాలం ఆశ్రయమిచ్చిన గూటిని వదిలేస్తుండటంతో .. కేడర్‌ ఉన్నా వారిని నడిపించే నాయకులే కరువవుతున్నారక్కడ.. అసలింతకీ ఆ జిల్లా ఏది? అక్కడ ఆ పార్టీలో ఏంజరుగుతోంది?


ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి విభజించిన సిద్దిపేట జిల్లాలో … కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది… గతంలో బలమైన నాయకుల సారథ్యంలో సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేలలో విజయాలను దక్కించుకున్న ఆ పార్టీ కి .. ఆయా నియోజకవర్గాల్లో సరైన నాయకుడే లేకుండాపోయాడని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ముత్యంరెడ్డి, ఎన్నికల తర్వాత వంటేరు ప్రతాప్ రెడ్డి లు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ పూర్తిగా ఢీలా పడినట్లే కనిపిస్తోంది..


2018 ఎన్నికల సమయంలో జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ను మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ఆశించారు… నిజానికి ఆయన ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే తన ఆరోగ్యం సహకరించకపోయినా గ్రామాల్లో ప్రచారం మొదలుపెట్టారు… తీరా టికెట్ల కేటాయింపు సమయంలో దుబ్బాక టికెట్ ను ప్రజా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా.. కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితికి కేటాయించడంతో ఖంగు తిన్న ముత్యం రెడ్డి పార్టీ పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు … ఆ కోపంతో ఆయన టీఆర్ఎస్ లో చేరిపోయారు.. దాంతో దుబ్బాక నుండి కాంగ్రెస్ కు చెప్పుకోగద్ద నాయకుడు లేకుండా పోయారు … ముత్యంరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ లా సాగింది రాజకీయం.. అయితే ఇప్పుడు ఆయన పార్టీని వీడి ప్రత్యర్ధితో కలిసి పోవడంతో టిఆర్ఎస్ కు ఎదురేలేకుండా పోయిందన్న టాక్ వినిపిస్తోంది.

ఇక సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి క్రేజ్ ను తీసుకువచ్చిన వంటేరు ప్రతాప్ రెడ్డి సైతం ఇటీవల టీఆర్ఎస్ లో చేరిపోయారు… 2018 ఎన్నికలకు ముందు ప్రతాప్ రెడ్డి టిడిపి నుండి కాంగ్రెస్ లో చేరారు… ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ పై పోటీ లో నిలిచారు… ప్రచార సమయంలో ఆయన అనుసరించిన స్ట్రాటజీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు పాపులర్ అయిది..

ఢీ అంటే ఢి అంటూ ప్రచారాన్ని సాగించిన ప్రతాప్ రెడ్డి తనకు అనుకూలంగా వేవ్ ను మార్చుకునేందుకు తుది కంటా పోరాటం సాగించారు .. అయితే టిఆర్‌ఎస్‌ ప్రభంజనం, కేసీఆర్‌ ఛరిష్మాలతో ఆయనకు ఓటమి తప్పలేదు… ఆ తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం నుంచి పార్టీ లో చేరాల్సిందిగా ఆహ్వానం రావడంతో ఆయన గులాబీ కండువా కప్పేసుకున్నారు .. దాంతో గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే హుస్నాబాద్ నియోజకవర్గం లో సైతం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు… పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఈ సీట్ ను సిపిఐ కి కేటాయించడం తో అక్కడ బలమైన కాంగ్రెస్ నాయకునిగా ఉన్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు…

మొత్తం మీద ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి మిగిలిన చెప్పుకోదగ్గ ఏకైక లీడర్ గా తూంకుంట నర్సారెడ్డి మిగిలారు… 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గజ్వేల్ స్థానం నుండి నర్సారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు… ఆ తర్వాత 2014 లో ఆయన ఇదే స్థానం నుండి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు… ఆ క్రమంలో ఆయన కొద్ది రోజులకే టీఆర్ఎస్ పార్టీ లో చేరడంతో ఆయన్ని తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది… అయితే అనూహ్యంగా 2018 ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ ను వీడి సొంత గూడు కాంగ్రెస్‌లో చేరారు.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో తూంకుంట నర్సారెడ్డి ఒక్కరే చెప్పుకోదగ్గ బలమైన కాంగ్రెస్ నాయకుడుగా కొనసాగుతున్నారు… మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి ఆ పార్టీ వారికే మింగుడుపడకుండా తయారైందంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here